ETV Bharat / health

వర్షాకాలంలో అనారోగ్యం ముప్పు! - ఏవి తినాలి? ఏవి తినకూడదో తెలుసుకోండి!

ఈ సీజన్​లో ఆరోగ్యం ప్రధానం - ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

monsoon_health
monsoon_health (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : July 20, 2026 at 3:49 PM IST

4 Min Read
Choose ETV Bharat

Vegetables and Fruits to Avoid During the Monsoon : ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం వచ్చేసింది. అయితే, ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల నీరు, ఆహారం ద్వారా వ్యాపించే రకరకాల ఇన్‌ఫెక్షన్లు ప్రబలే అవకాశం ఉంది. సాధారణంగా శరీరానికి ఎంతో మంచివని భావించే ఆకుకూరలు, పండ్లు కూడా ఈ కాలంలో కొన్నిసార్లు అనారోగ్యానికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే, వర్షాకాలంలోని తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. మనం కొనుగోలు చేసే ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంచినప్పుడు లేదా వాటిని సరిగ్గా కడగకుండా తిన్నప్పుడు ఈ క్రిములు సులభంగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల, వర్షాకాలంలో పచ్చి కూరగాయలు, పండ్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

వర్షాకాలంలో వ్యాధులు ఎందుకు పెరుగుతాయి? : వర్షాకాలంలో గాలిలో ఉండే అధిక తేమ, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భారీ వర్షాల వల్ల రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడం, అది మంచినీటి మార్గాలతో కలవడం వల్ల తాగునీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయి. ఈ కలుషిత నీటిని వ్యవసాయానికి, అలాగే మార్కెట్లలో కూరగాయలను కడగడానికి ఉపయోగించడం వల్ల 'ఇ-కోలి', 'సాల్మొనెల్లా' వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఆహార పదార్థాలకు సులభంగా అంటుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా, వర్షాకాలంలో మార్కెట్లు, రోడ్డు పక్కన ఉండే దుకాణాల వద్ద నిలిచే బురద నీరు, ఈగలు, దోమల వల్ల క్రిములు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో లభించే పచ్చి కూరగాయలు, పండ్లను సరిగ్గా కడగకుండా లేదా వండకుండా తిన్నప్పుడు, అవి నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా తీవ్రమైన విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్ ముప్పు - ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయట!

పండ్లు, కూరగాయలు అన్నీ ప్రమాదకరమైనవేనా? : వర్షాకాలంలో పచ్చి కూరగాయలు లేదా పండ్లు తినడం శరీరానికి మంచిది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహార స్వభావాన్ని బట్టి భద్రత మారుతూ ఉంటుందంటున్నారు నిపుణులు.

మందపాటి తొక్క గల పండ్లు : అరటిపండ్లు, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి పండ్ల లోపలి భాగం సహజంగానే మందపాటి పొర లేదా తొక్కతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల బయటి సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించడం కష్టం. కాబట్టి, వీటిని సురక్షితంగా తినవచ్చు.

ఆకుకూరలు, సలాడ్ కూరగాయలు : క్యాబేజీ, పాలకూర, దోసకాయ, టమాటా వంటి పచ్చిగా తినే కూరగాయల ఉపరితలంపై తేమ వల్ల క్రిములు ఆశ్రయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మడతలు ఎక్కువగా ఉండే ఆకుకూరలలో పురుగులు, బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. అందువల్ల, వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

సంక్రమణను నివారించడానికి ఏమి చేయవచ్చు? : వర్షాకాలంలో ఆహారం ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లను అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

శుభ్రంగా కడగడం : మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను స్వచ్ఛమైన నీటితో నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కడగడం మంచిది.

తొక్క తీసి తినడం : ఆపిల్, దోసకాయ, క్యారెట్ వంటి పండ్లు, కూరగాయలను పచ్చిగా తినేటప్పుడు, వాటి తొక్కను పూర్తిగా తీసివేసి తినడం సురక్షితం.

కోసిన పండ్లకు దూరం: రోడ్డు పక్కన దుకాణాలలో అప్పటికే కోసి ఉంచిన పండ్లను అస్సలు కొనకూడదు. వాటిపై దుమ్ము, ఈగలు వాలడం వల్ల కలుషితమై ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.

పచ్చిగా తినడం మానుకోవాలి : వర్షాకాలం ముగిసే వరకు ఆకుకూరలు, కూరగాయలను 'సలాడ్ల' రూపంలో పచ్చిగా తినకపోవడమే మంచిది. క్రిములను పూర్తిగా నాశనం చేయడానికి వాటిని ఆవిరిపై ఉడికించి లేదా బాగా వండి మాత్రమే తినాలి.

నిల్వ చేయడంలో జాగ్రత్త : వండని పచ్చి ఆహార పదార్థాలను, వండిన పదార్థాలను ఒకేచోట పెట్టకుండా వేరువేరుగా నిల్వ చేయాలి. అలాగే, వండడానికి ముందు, తినడానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.

వారు మరింత జాగ్రత్తగా ఉండాలి! : రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు ఇంట్లో బాగా కడిగి, తొక్క తీసిన పండ్లను ఇవ్వాలి. వర్షాకాలంలో వృద్ధులు పచ్చి కూరగాయల సలాడ్‌లకు దూరంగా ఉండాలి. అలాగే, బాగా ఉడికించిన వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిది.

ఒకవేళ విరేచనాలు అయితే? : కలుషితమైన ఆహారం లేదా నీటి కారణంగా విరేచనాలు అయితే, డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా శుద్ధి చేసిన నీరు, మంచినీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) తాగమంటున్నారు నిపుణులు. పెరుగు, అన్నం, గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలట. ఈ క్రమంలో రెండు రోజుల కంటే మించి విరేచనాలు, మలంలో రక్తం పడితే, తీవ్రమైన జ్వరం, వాంతులు లాంటి సమస్యలు ఉంటే, మీరు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్​ని సంప్రదించాలి.

పరిశోధన మూలాలు :

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC9321083/

https://www.researchgate.net/profile/Rajpal-Khillare-2/publication/362387536_Food_Safety_Measures_for_Monsoon/links/62e776333c0ea878877251f1/Food-Safety-Measures-for-Monsoon.pdf

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

'సైలెంట్ కిల్లర్స్' - మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న అలవాట్లు ఇవేనట!