ETV Bharat / health

జిమ్‌కి వెళ్లే టైం లేదా? - 'ఉత్థిత త్రికోణాసనం'తో ఫిట్‌గా అవ్వొచ్చట!

- ఇంట్లోనే శరీర బలాన్ని పెంచే 'ఉత్థిత త్రికోణాసనం' - బిజీ షెడ్యూల్‌లోనూ ఆరోగ్యంగా ఉండొచ్చట!

Utthita Trikonasana
Utthita Trikonasana (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : August 4, 2026 at 4:18 PM IST

4 Min Read
Choose ETV Bharat

How to Practice Utthita Trikonasana : ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, ఉదయాన్నే నిద్రలేవగానే ఒళ్లు నొప్పులు రావడం లేదా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా కండరాలు పట్టేయడం వంటివి ఈ రోజుల్లో చాలా మందికి సాధారణ సమస్యలుగా మారాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం శరీర సౌలభ్యం (Flexibility) తగ్గడం, శారీరక సమతుల్యత దెబ్బతినడం అని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవడానికి జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిరోజూ ఇంట్లోనే చేయగలిగే సులభమైన యోగాసనాల ద్వారా మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అలాంటి వాటిలో 'ఉత్థిత త్రికోణాసనం' ఒకటని, ఇది శరీరానికి ఒకే సమయంలో వశ్యత (సులువుగా వంగడం), బలం, సమతుల్యతను అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ఆసనాన్ని ఎలా వేయాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

ఉత్థిత త్రికోణాసనం అంటే ఏమిటి?: సంస్కృతంలో 'ఉత్థిత' అంటే పైకి లేచిన లేదా విస్తరించిన అని, 'త్రికోణ' అంటే త్రిభుజం అని, 'ఆసన' అంటే భంగిమ అని అర్థం. ఈ ఆసనం వేసేటప్పుడు మన శరీరం విస్తరించిన త్రిభుజాకార రూపాన్ని (Triangle shape) సంతరించుకుంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

రెండు కాళ్లను వెడల్పుగా ఉంచి, ఒక చేతిని క్రిందికి దించి కాలిని తాకుతూ, మరొక చేతిని నిటారుగా పైకి చాచే ఈ భంగిమ, శారీరక నిర్మాణాన్ని, శరీర నిలకడను సరిచేయడానికి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇందులో లోతైన శ్వాస ప్రక్రియ కూడా ఉంటుందట. కాబట్టి, ఇది శరీరానికే కాకుండా మనసుకు కూడా గొప్ప ఉల్లాసాన్ని, పునరుజ్జీవనాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు.

బ్రేక్​ఫాస్ట్ తిన్న కాసేపటికే ఆకలి వేస్తోందా? - కారణాలు ఇవే కావచ్చట!

National Library of Medicine ప్రకారం, ఉత్థిత త్రికోణాసనం చేసే విధానం:

  • రెండు పాదాల మధ్య 3.5 - 4 అడుగుల దూరం ఉండేలా నిటారుగా నిలబడాలి.
  • కుడి పాదాన్ని 90 డిగ్రీలు బయటకు, ఎడమ పాదాన్ని కొద్దిగా లోపలి వైపునకు తిప్పాలి. శరీర బరువు రెండు కాళ్లపై సమానంగా ఉండాలి.
  • రెండు చేతులను భుజాల స్థాయికి ఇరువైపులా నిటారుగా చాచాలి. అరచేతులు నేల వైపు చూస్తున్నట్లు ఉండాలి.
  • లోతుగా శ్వాస తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
  • ఇప్పుడు శ్వాస వదులుతూ, మోకాళ్లను వంచకుండా, నడుము పైభాగాన్ని కుడి వైపునకు వంచాలి.
  • శరీర సౌలభ్యాన్ని బట్టి, కుడి చేతిని మీ కుడి కాలి చీలమండ, మోకాలి కింద లేదా కుడి పాదానికి దగ్గరగా నేలపై ఉంచాలి.
  • ఎడమ చేతిని ఆకాశం వైపు నిటారుగా పైకి చాచాలి. మీ రెండు చేతులు ఒకే సరళరేఖలో ఉండేలా చూసుకోవాలి.
  • మీకు మెడ నొప్పి లేకపోతే, తలను నెమ్మదిగా పైకి తిప్పి, ఎడమ చేతి వేళ్లను చూడండి.
  • సాధారణ శ్వాస తీసుకుంటూ 20 నుంచి 30 సెకన్ల పాటు ఇదే భంగిమలో స్థిరంగా ఉండండి.
  • శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా సాధారణ స్థితికి రండి. ఇదే ప్రక్రియను ఎడమ వైపు కూడా పునరావృతం చేయండి.

ప్రయోజనాలు ఏంటి?:

శరీర సౌలభ్యం పెరుగుతుంది : తొడ వెనుక కండరాలు, తుంటి, భుజాలు, ఛాతీ, వెన్నెముక ఒకే సమయంలో సాగడం వల్ల శరీర నమ్యత గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నెముకలో వశ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, భుజాల అమరికను సరిచేయడానికి కూడా ఉపయోగపడుతుందని researchgate పేర్కొంది. ఇది శరీర దిగువ భాగానికి ప్రయోజనం చేకూరుస్తుందని, అలాగే, మోకాలు, చీలమండలాలను బలపరుస్తుందని వెల్లడించింది.

కీళ్లు, కండరాలు బలోపేతమవుతాయి : ఈ ఆసనంలో శరీర బరువును కాళ్లు మోయడం వల్ల తొడలు, మోకాలు, చీలమండలాలు బలంగా తయారవుతాయంటున్నారు.

నడుము నొప్పి నుంచి ఉపశమనం : వెన్నెముక సాగడం వల్ల, ఆఫీసుల్లో గంటల తరబడి తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల వచ్చే తేలికపాటి నడుము నొప్పి తగ్గుతుందని తెలియజేస్తున్నారు.

ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది : ఛాతీ, భుజాలు వెడల్పుగా విస్తరించడం వల్ల ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే సామర్థ్యం పెరిగి, శ్వాసక్రియ సజావుగా సాగుతుందని వివరిస్తున్నారు.

జీర్ణక్రియ మెరుగవుతుంది : పొత్తికడుపు భాగం సాగడం, స్వల్పంగా మెలితిరగడం వల్ల లోపలి జీర్ణ అవయవాలు ఉత్తేజితమై, జీర్ణక్రియ రేటు పెరుగుతుందని చెబుతున్నారు

మానసిక ప్రశాంతత, ఏకాగ్రత : భంగిమను సమతుల్యంగా ఉంచడానికి ఏకాగ్రత, క్రమబద్ధమైన శ్వాస అవసరమంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుందట. ఏకాగ్రత పెరుగుతుందని తెలియజేస్తున్నారు.

ఎవరు చేయవచ్చు?:

  • యోగాసనాలు సాధన చేయడం ఇప్పుడిప్పుడే ప్రారంభించిన వారు
  • ప్రతిరోజూ ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చుని పనిచేసే వ్యక్తులు
  • శరీర సమతుల్యత, భంగిమను మెరుగుపరచుకోవాలనుకునే వారు

ఎవరు దీనికి దూరంగా ఉండాలి?

  • తీవ్రమైన నడుము నొప్పి సమస్యలు లేదా గాయాలు ఉన్నవారు
  • ఇటీవల తుంటి, మోకాలు లేదా చీలమండల సర్జరీ చేయించుకున్నవారు
  • తీవ్రమైన మెడనొప్పి ఉన్నవారు
  • తల తిరగడం, స్పృహ కోల్పోవడం లేదా రక్తపోటు అధికంగా ఉన్నవారు డాక్టర్​ సలహా తీసుకోవాలట
  • గర్భిణులు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే యోగా సాధన చేయాలట.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'ఐస్ క్యూబ్ బాత్' ట్రెండ్! - హీరోయిన్ల ఫిట్‌నెస్ సీక్రెట్ మీకు సెట్ అవుతుందా?

తరచూ "తలనొప్పి" ఎందుకు వస్తుందో తెలుసా? - మీ అలవాట్లే కారణమట!