పక్షవాతానికి "రిహాబిలిటేషన్" చికిత్స - ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?
చాపకింద నీరులా పక్షవాతం - వినూత్నం పద్ధతుల ఆశ

Published : June 2, 2026 at 3:45 PM IST
Resuscitation Treatment for Paralysis : పక్షవాతం క్షణంలో జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. దీని లక్షణాలు హఠాత్తుగానే మొదలవుతాయి. ముఖం ఒకవైపున వాలిపోవటం, చేయి, కాలు బలహీనత, మాట తత్తరపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు సత్వరం చికిత్స అందకపోతే వైకల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి రిహాబిలిటేషన్ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు చిట్టిపోయి రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం తలెత్తుతుంది. అలాగే, నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. తద్వారా మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందవట. బ్రెయిన్ కణాలు నిమిషాల్లోనే చనిపోవటం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక లోపల రక్తస్రావమైతే మెదడు కణాలు మీద ఒత్తిడి పెరిగి, దెబ్బతింటూ వస్తాయంటున్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ ఎంత మేరకు, ఏ భాగంలో దెబ్బతిన్నదనే దాన్ని బట్టి పక్షవాత వైకల్యం తీవ్రత ఆధారపడి ఉంటుందట. కొంతమంది సరిగా నడవలేకపోవచ్చు. మరి కొంతమందికి మాట సరిగా రాకపోవచ్చు. ఫలితంగా, రోజువారీ పనులు చేసుకోలేక పోవటం, స్పష్టంగా ఆలోచించక పోవటం వంటివీ ఇబ్బంది పెడతాయి. మరీ తీవ్రమైతే పక్షవాతమైతే శరీరంలో ఒకవైపు మొత్తం బలహీనంగా లేదా చచ్చుబడొచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయిన నైపుణ్యాలను తిరిగి పొందటానికి, మళ్లీ పనులు చేసుకునేలా చూడటానికి పునరుత్తేజ చికిత్స తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పక్షవాతం దాడి చేశాక 48 గంటల్లో హాస్పిటలోనే దీన్ని ప్రారంభిస్తుంటారట. ఫిజియో థెరపిస్టులతో పాటు నర్సులు, స్పీచ్ లాంగ్వేజ్ నిపుణులు ఒక బృందంగా ఏర్పడి దీన్ని అందిస్తారని పేర్కొంటున్నారు. ప్రత్యేక వ్యాయామాలు, శిక్షణతో కూడిన ఇది శరీరం కోలుకోవటానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఒకవేళ వైకల్యం పూర్తిగా తగ్గకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల్లో దాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్చుకోవటానికి తోడ్పడుతుంది.
ఆరోగ్య దిక్సూచిగా 'ముక్కు' - ఈ సంకేతాలు హెచ్చరికలేనట!
కొత్త సంబంధాల ప్రక్రియ : పక్షవాతంలో మెదడు కణాల మధ్య సంబంధాలు దెబ్బ తినటం మూలంగానే నైపుణ్యాలు పోతాయి. మరి, కణాల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడితే నైపుణ్యాలను తిరిగి ఎలా పొందుతామో, అలాగే పునరుత్తేజ చికిత్స ఉద్దేశం కూడా ఇదే. బ్రెయిన్ కణాల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడేలా చూడటాన్ని రీ మ్యాపింగ్ (Re-mapping) అంటారు. పనులను ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అవే పనులను మళ్లీ మళ్లీ చేయటం ద్వారా రీ మ్యాపింగ్ ప్రక్రియ ఊపందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉపయోగాలు :
కండరాలు, నాడుల నియంత్రణ : స్ట్రోక్ బాధితులకు రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, ఫిజియో, ఆక్యుపేషన్ థెరపిస్టులు కండరాలు సాగటానికి, బలోపేతం కావటానికి తోడ్పడే వ్యాయామాలు చేయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, తినటం, స్నానం చేయటం, దుస్తులు వేసుకోవటం వంటి పనులను తిరిగి నేర్చుకునేలా శిక్షణ ఇస్తారని పేర్కొంటున్నారు.
మూత్ర విసర్జన మీద పట్టు : కొంతమందికి మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా వెంటనే మూత్రం పోయాలని అనిపిస్తుంది. ఇది చాలా ఇబ్బంది పెట్టే సమస్య. అయితే, యూరాలజిస్టులు, మందుల సాయంతో దీన్ని ఎదుర్కొనేలా చేస్తారట.
మాట్లాడటం, భాషను అర్థం చేసుకోవటం : పక్షవాతం వచ్చిన తర్వాత కొంతమందికి మాట్లాడటం కష్టమవుతుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గటం, సృష్టంగా ఆలోచించలేక పోవటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి స్పీచ్ థెరపిస్టులు కొత్త పద్ధతిలో మాట్లాడేలా విధంగా నేర్పిస్తారట. అలాగే, భాషను మెరుగుపరచుకోవటానికి శిక్షణ కూడా ఇస్తారు.
ముద్ద సరిగా మింగేలా : కొంతమందికి అన్నం తినటం, ముద్ద మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి తీనే తీరులో మార్పులు చేయటం మేలు చేస్తుంది. ఈ క్రమంలో చిక్కటి ద్రవాలను తాగటం, పదార్థాలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని తినటం వంటి విధానాలు నేర్పిస్తారని నిపుణులు చెబుతున్నారు.
వినూత్నం పద్ధతుల ఆశ : స్ట్రోక్ బాధితులను చేసే పునరుత్తేజ చికిత్సలో కొత్త పద్ధతులను అన్వేషించటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకులు మాట, భాషను పునరుద్ధరించటానికి వినూత్న విధానాన్ని పరీక్షిస్తున్నారు. మెదడును ప్రేరేపించటం ద్వారా తీవ్రమైన స్పీచ్ థెరపీ చేయటం దీనిలోని ముఖ్యమైన అంశం. స్ట్రోక్ మెదడులో భాషను నియంత్రించే భాగన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి నలుగురు పక్షవాతం బాధితుల్లో కనీసం ఒకరు అఫేషియా (Aphasia) బారినపడుతుంటారట. ఇందులో మాట్లాడటం, చదవటం, రాయటం, భాషను అర్థం చేసుకోవటం ప్రభావితమవుతాయని పేర్కొంటున్నారు. స్పీచ్ థెరపీ తీసుకున్నప్పటికీ పక్షవాతం బాధితులంతా అఫేషియా నుంచి బయటపడరని తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గుండె ఆరోగ్యం కోసం - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
టీ, కాఫీలు కాదు - "హెర్బల్ టీ" లు తాగండి! - ఆరోగ్యానికి ఎంతో మంచిదట!

