గుండె ఆరోగ్యం "స్పెషల్ డైట్" - నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్లు ఇవే!
2026లో గుండె ఆరోగ్యకరమైన ఆహారం - కొన్ని రకాల డైట్లను సూచిస్తున్న నిపుణులు!

Published : January 6, 2026 at 3:28 PM IST
Heart Healthy Diets to follow in 2026 : పని చేసినంత వరకూ గుండె గురించి పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు 'ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా' అని చింతిస్తాం. అందుకే, పరిస్థితి అంత వరకూ రాకుండా ముందే మేల్కోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే డైట్ల గురించి తెలుసుకొని, పాటిస్తే మేలని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
గుండె ఆరోగ్యం కోసం : సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారు డైట్ పాటిస్తారు. కానీ, గుండె ఆరోగ్యం కోసం కొన్ని రకాల డైట్ చేయవచ్చంటున్నారు నిపుణులు. అలాగే, గుండె ఆరోగ్యం కోసం పండ్ల రసాలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, కొవ్వు కలిగిన చేపలతో కూడిన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో సోడియం, చక్కెర, సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

మెడిటరేనియన్ డైట్ : మెడిటరేనియన్ డైట్ అనేది మధ్యధరా సముద్ర తీర దేశాలైన గ్రీస్, ఇటలీ, స్పెయిన్ ప్రజల సంప్రదాయ ఆహారపు అలవాట్లపై ఆధారపడిన ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహార విధానాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ డైట్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలను ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాదు, ఆలివ్ ఆయిల్ వాడతారు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. మెడిటరేనియన్ డైట్ పాటించే వ్యక్తులకు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని ucdavis.edu అధ్యయనం పేర్కొంది.
రోజంతా 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ : ఈ డైట్‌లో 'ఏం తినాలి' అనే దానికంటే, 'ఎప్పుడు తినాలి' అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రోజంతా నిర్ణీత గంటల పాటు ఉపవాసం ఉండి, మిగిలిన సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఊబకాయం, రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అయితే, దీనిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
ఫుడ్స్ డైట్ : ఆరోగ్యకరమైన, సమతులాహారం అంటే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అనేవి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు బరువును నియంత్రణలో ఉంచుతాయి.
DASH డైట్ : DASH డైట్ (Dietary Approaches to Stop Hypertension) అనేది ముఖ్యంగా రక్తపోటును తగ్గించడానికి రూపొందించిన ఒక శాస్త్రీయ ఆహార విధానం. ఇది 2026లో కూడా ప్రపంచవ్యాప్తంగా గుండె ఆరోగ్యానికి అత్యుత్తమ డైట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ డైట్ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రూపొందించబడింది. DASH ఆహారం హృదయ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాల సమతులాహారం అందిస్తుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. తృణధాన్యాలు, తక్కువ గ్లైసెమిక్ పండ్లు, ఆకుకూరలు, చిక్కుళ్లు నుంచి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అవసరమైన సూక్ష్మపోషకాలను సరఫరా చేస్తాయని తెలిపింది.

పాలియో డైట్ : దీనినే 'శిలాజ యుగం నాటి ఆహారం' (Caveman Diet) అని కూడా అంటారు. మన పూర్వీకులు వ్యవసాయం ప్రారంభించకముందు, అంటే సుమారు 10,000 ఏళ్ల క్రితం వేటాడటం లేదా అడవుల దొరికే పండ్లును మాత్రమే తినేవారు. ఈ పద్ధతినే పాలియో డైట్ అని పిలుస్తారు. ఆధునిక పాలియో డైట్‌లో పండ్లు, కూరగాయలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, గింజలు, విత్తనాలు ఉంటాయని mayoclinic అధ్యయనం పేర్కొంది.
ప్లాంట్-బేస్డ్ డైట్ : ఈ డైట్‌లో మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలపై ఆధారపడే జీవనశైలి. ఇది కేవలం శాకాహారం మాత్రమే కాదు, ఇందులో జంతు సంబంధిత ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ, ఈ డైట్‌లో 70-80% మొక్కల నుంచి లభించే ఆహారం మాత్రమే తీసుకోవాలి. తద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందంటున్నారు నిపుణులు.

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ : ఇది శరీరంలో దీర్ఘకాలిక వాపు లేదా మంటను తగ్గించే ఆహార నియమావళి. ఈ డైట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు గుండె వాపును తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
లో-కార్బ్ & కీటో డైట్ : ఈ డైట్‌లు రెండూ పిండి పదార్థాలను తగ్గించి, శరీరానికి అవసరమైన శక్తిని కొవ్వుల నుంచి పొందేలా చేస్తాయి. 2026 నాటికి బరువు తగ్గడానికి ఇవి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతులు. అంతేకాదు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
తక్కువ సోడియం ఆహారం : ఉప్పును తగ్గించి, పొటాషియం ఎక్కువగా ఉండే చిలగడదుంపలు, టమోటాలు వంటివి తీసుకోవడం వల్ల గుండె, ధమనులపై ఒత్తిడి తగ్గుతుందట.
ఫ్లెక్సిటేరియన్ డైట్ : ఇది పూర్తిగా శాకాహారం తీసుకుంటూనే, అప్పుడప్పుడు లేదా మితంగా మాంసాహారాన్ని అనుమతించే ఒక సౌకర్యవంతమైన ఆహార విధానం. దీనిని 2026లో అత్యంత సులభంగా పాటించదగ్గ, సమతులమైన డైట్‌లలో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బరువు తగ్గడానికి, గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

