చలికాలంలో "గుండెపోటు"కు కారణాలివే! - వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
ఈ సీజన్లో రోగనిరోధక శక్తి తక్కువ - ఎండకు తిరగడంతో పాటు ఏం చేయాలో తెలుసా?

Published : December 16, 2025 at 12:53 PM IST
Precautions to Take During Winter : వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి, వెన్నులో వణుకు పుట్టించే చలితో పిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు ముక్కులో నుంచి రక్తం కారడం, చంటి పిల్లల్లో న్యుమోనియా, పెద్దల్లో ఆస్తమా పెరుగుతున్నాయి. గుండె సంబంధిత రుగ్మతలున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకూ పెరుగుతున్న చలి కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. మరి, అవేెంటో ఇప్పుడు తెలుసుకుందాం!
శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. శరీరానికి ఎండ సరిగ్గా తగలక విటమిన్ డి లోపం తలెత్తి, రోగనిరోధక శక్తి క్షీణించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయని అంటున్నారు. మరి, ఈ సమస్యల్ని నివారించాలంటే ఈ కాలంలో లభించే కొన్ని ఆహారం, వ్యాయామాలతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జర్నీ చేస్తే వాంతులు, తల తిరుగుతోందా? - ఈ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
- చలి తీవ్రత పెరగడంతో అనేక లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.
- ఈ కాలంలో చిన్నారుల్లో తీవ్రమైన జ్వరాలు కనిపిస్తుంటాయని చెబుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా న్యుమోనియా సోకకుండా జాగ్రత్తపడాలని తెలియజేస్తున్నారు.
- అలాగే, అనేక రకాల అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలూ పిల్లలపై దాడి చేస్తుంటాయని పేర్కొంటున్నారు.
- నెలలోపు వయసున్న పసిపిల్లల్లో 'హైపోథర్మియా' వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వారి శరీరం చల్లబడుతుందని పేర్కొంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పసిపిల్లల్ని వెచ్చగా ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే, పొడి వాతావరణం వల్ల ముక్కు ఎండిపోయి లోపల నుంచి రక్తస్రావం జరుగుతుందని పేర్కొంటున్నారు. జలుబు తీవ్రంగా ఉండడం వల్ల ఎక్కువసార్లు ముక్కు చీదినా, లోపల తరచూ వేలు పెట్టినా రక్తం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
శీతల వాతావరణం గుండె సమస్యలున్న వారికి ప్రమాదకరం. రక్తనాళాలు సంకోచించడం వల్ల హైబీపీకి దారితీస్తుంది. తద్వారా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చల్లని వాతావరణం వల్ల రక్తం చిక్కుబడి క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. శ్వాసకోశ సంబంధిత సమస్యల వల్ల గుండెకు సరఫరా అయ్యే ప్రాణవాయువు శాతం తగ్గడంతో దాని పనితనం దెబ్బతింటుంది. చలిగా ఉందని చాలా మంది శారీరక శ్రమ లేదా వ్యాయామం తగ్గిస్తారు. దీనివల్ల గుండె సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలున్న వారు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. ఉదయం కాస్త ఎండ వచ్చాక వ్యాయామం కొనసాగించాలి. జన సమూహంలోకి వెళ్లినపుడు మాస్కులు ధరించాలి. కొవ్వు పదార్థాలను తినకూడదు. చక్కెర ఎక్కువ కలిగిన ఆహారాన్ని నిషేధించాలి. ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యులను వెంటనే సంప్రదించాలి.
- డాక్టర్ అజయ్, గుండె వైద్యుడు, కిమ్స్ ఆసుపత్రి, హైదరాబాద్
ఆహారం, వ్యాయామం : ఈ సీజన్లో వ్యాధుల బారిన పడకుండా నిపుణుల సూచనలు
- అనారోగ్యకరమైన చిరుతిళ్లు జోలికి వెళ్లకుండా వేడి ఆహారాన్ని, ముఖ్యంగా ఆకుకూరలను భోజనంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, పిండి వంటలను కట్టిడి చేయాలని పేర్కొంటున్నారు. వేడివేడి సూప్‌లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- ఈ కాలంలో దాహం లేదని పిల్లలు మంచి నీళ్లు ఎక్కువగా తాగరు. దీనివల్ల చర్మం, పెదవులు పొడిబారి రక్తస్రావం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి దాహంగా అనిపించకున్నా నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు.
- రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చర్మానికి మాయిశ్చరైజర్లు రాసి పొడిబారకుండాచూసుకోవాలంటున్నారు.
- చలి ఎక్కువగా ఉంటే వ్యాయామం ఇంటి లోపల చేయొచ్చని చెబుతున్నారు. కాస్త ఎండ వచ్చాక నడక, ఇతర శారీరక శ్రమ కలిగించే ఎక్సర్సైజ్లు తప్పనిసరంటున్నారు.
- ఉన్ని దుస్తులతో చలి తగలకుండా వెచ్చగా ఉండడం అందరికీ మేలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బహుళభాషా నైపుణ్యంతో మెదడుకెంతో మేలు! - తాజా పరిశోధనలో కీలక విషయాలు!
ఆహారాన్ని ఉడికిస్తున్నారా?, ఫ్రై చేస్తున్నారా? - ఆరోగ్యానికి ఏది మంచిదంటే!

