చలికాలంలో బరువు పెరుగుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!
- శరీరానికి ఎండ తగలకపోయినా బరువు పెరిగే అవకాశం ఉందట! - చిన్న చిన్న టిప్స్‌తోనే పెద్ద మార్పును చూడొచ్చంటున్న ఎక్స్పర్ట్స్

Published : January 1, 2026 at 2:31 PM IST
Winter Weight Gain And Common Causes : చలి కాలంలో ఉదయం లేవడానికి మనసొప్పదు. దేహాన్ని బద్ధకం ఆవహిస్తుంది. దీనికి తోడు జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, చర్మం పొడిబారడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, వీటితోపాటు ఈ సీజన్లో కొంతమంది బరువు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
అదే కారణమా? : ఈ కాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్‌నెస్ రొటీన్ అదుపు తప్పుతుందంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే మన శరీరంలోకి చేరిన క్యాలరీలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయని చెబుతున్నారు. ఫలితంగా, బరువు పెరుగుతామని తెలియజేస్తున్నారు. అందుకే, బరువును అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదా స్నేహితురాలిని మీతోపాటు కలిసి వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. తద్వారా వ్యాయామంపై ఆసక్తి పెరుగుతుందని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని mayoclinic అధ్యయనం పేర్కొంది.
కాబోయే అమ్మకు పురిటి నొప్పుల భయం - సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలివే!
ఎండ తగలకపోయినా : శీతాకాలంలో కొన్నిసార్లు శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)’ సమస్య తలెత్తే అవకాశం ఉందని clevelandclinic అధ్యయనం పేర్కొంది. ఇదీ ఒక రకమైన డిప్రెషన్ లాంటిదంటున్నారు నిపుణులు. దీని కారణంగా ఆహారపు కోరికలు పెరగడం, ఫలితంగా మోతాదుకు మించి ఆహారం తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఈ అలవాట్లు బరువు పెరిగేందుకు కారణమవుతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి, ఉదయం ఎండ లేకపోయినా, మధ్యాహ్నం వేళ కాసేపు ఎండలో గడపడం మంచిదని సూచిస్తున్నారు. ఇది పరోక్షంగా బరువును అదుపులో ఉంచేందుకు సహకరిస్తుందని వివరిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు.
హార్మోన్ల అసమతుల్యత : హార్మోన్ల అసమతుల్యత కూడా అధిక బరువుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని అంటున్నారు. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదించడంతో పాటు ఆహారపు కోరికలు పెరుగుతాయని వెల్లడిస్తున్నారు. కాబట్టి, హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు డాక్టర్ సలహాలూ పాటించడం మంచిదని పేర్కొంటున్నారు.
అర్ధరాత్రి ఆకలేస్తే : చలికాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో డిన్నర్ త్వరగా ముగించాల్సి వస్తుంది. దీంతోపాటు తేలికపాటి ఆహారం తీసుకోవడం, రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండడం వంటి కారణాలతో కొన్నిసార్లు అర్ధరాత్రి ఆకలేస్తుంటుంది. అలాంటప్పుడు, చాలామంది చాక్లెట్స్, కుకీస్, బిస్కట్స్, పాప్‌కార్న్, చిప్స్ వంటివి తింటారు. ఈ అలవాట్లు అధిక బరువుకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రాత్రి ఎక్కువగా ఆకలేసినప్పుడు డ్రై ఫ్రూట్స్, నట్స్, తాజా పండ్లు వంటివి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్ఛని సూచిస్తున్నారు.
వీటితో పాటు శరీరంలో నీటి శాతం తగ్గకుండా నీరు తాగడం, సీజనల్ పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం, గుడ్లు, నట్స్, గింజలు వంటి ప్రొటీన్లు అధికంగా లభించే పదార్థాలు.. ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మహిళలు రోజుకు సగటున 9 కప్పులు, పురుషులు సగటున 13 కప్పుల నీటిని తాగాలని NIH అధ్యయనం పేర్కొంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

