ETV Bharat / health

చెవిలో అదే పనిగా 'మోత' మోగుతోందా? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు!

టినిటస్​ అంటే ఏంటి? - ఈ సమస్య ఎందుకు వస్తుంది?

Tinnitus
Tinnitus (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : January 8, 2026 at 5:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tinnitus Symptoms and Causes: బయట ఎలాంటి చప్పుడూ ఉండదు. కానీ, ఏదో మోగుతున్నట్టు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. దాని మీదికి దృష్టి మళ్లితే చాలు, ఇంకాస్త ఎక్కువగానూ వినిపిస్తుంటుంది. చెవిలో మోత ఇలాగే వేధిస్తుంది. ఈ పరిస్థితిని టినిటస్‌ అని అంటారు. దీనివల్ల నిద్ర సరిగా పట్టకపోవటం, ఏకాగ్రత కొరవడటం, కుంగుబాటు, నిరాశ, చిరాకు, ఆందోళన వంటి వాటికి దారితీస్తుంది. అంతేకాదు, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీంతో కొంతమంది నలుగురిలో కలవలేక ఒంటరిగానూ ఉండిపోతుంటారు. టినిటస్ నయం చేయటం అన్నిసార్లూ సాధ్యం కాకపోయినా కొన్ని జాగ్రత్తలతో లక్షణాలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

కారణాలను తెలుసుకోవటం : టినిటస్‌ను సాధారణంగా రింగింగ్ శబ్దంగా వర్ణిస్తారు, కానీ కొంతమంది గర్జించడం లేదా బజ్ చేయడం వంటి ఇతర రకాల శబ్దాలను వింటారని National Institutes of Health అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా, వినికిడి లోపం గలవారిలో టినిటస్ తరచూ కనిపిస్తుంటుంది. దీనికి కొన్నిరకాల మందుల ప్రభావం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అలాగే, అరుదుగా శ్రవణ నాడిని నొక్కే కణితులతోనూ రావొచ్చని చెబుతున్నారు. కాబట్టి, చెవి, గొంతు, ముక్కు డాక్టర్లను సంప్రదించి కారణాలను గుర్తించటం మంచిదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టినిటస్ చికిత్స తీసుకుంటే మోత నయం కావొచ్చు లేదా తీవ్రతైనా తగ్గించుకోవచ్చు.

Tinnitus
Tinnitus (Getty Images)

'స్మైలింగ్ డిప్రెషన్' కారణాలు ఇవే - ఇలా చేస్తే తరిమికొట్టొచ్చంటున్న నిపుణులు!

వినికిడి సాధనాలు : వినికిడి లోపం గలవారు వినికిడి పరికరాలను వాడుకుంటే మేలు. ఇవి బాగా వినిపించేలా చేయటమే కాకుండా మోత తగ్గటానికీ తోడ్పడతాయంటున్నారు.

మాస్కింగ్‌ పరికరం : వినికిడి సాధనంగా కనిపించే మాస్కింగ్‌ పరికరాలు సహజ శబ్దాలను పుట్టించటం ద్వారా మోత మరుగున పడేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ శబ్దాలు మెదడు ధ్వాసను మళ్లించి, మోత తగ్గిన భావన కలిగిస్తాయి. వినికిడి సాధనంతో కూడిన మాస్కింగ్‌ పరికరాలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పరికరం వద్దనుకుంటే ఈజీ టిప్స్ పాటించొచ్చని చెబుతున్నారు. రాత్రివేళ మంచం పక్కన స్మార్ట్​ఫోన్, రేడియో వంటి వాటితో ఇష్టమైన సంగీతాన్ని వినొచ్చు. ఈ క్రమంలో మెదడును దారి మళ్లించే శబ్దాలు ఏవైనా ఉపయోగపడతాయని గుర్తించాలి. వైట్ నాయిస్, ప్రకృతి శబ్దాలు లేదా పరిసర సౌండ్‌స్కేప్‌లు వంటివి మెదడును దృష్టి మరల్చడంలో, టినిటస్‌ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని clevelandclinic అధ్యయనం పేర్కొంది.

ప్రేరకాల గుర్తింపు : ఎలాంటి పరిస్థితుల్లో చెవిలో మోత ఎక్కువగా బాధిస్తోందో గుర్తించి, వాటి జాబితా రాసుకోవాలి. దీంతో మోత ఎప్పుడు వేధిస్తుందో అంచనా వేసి, దాన్ని నివారించుకోవచ్చంటున్నారు నిపుణులు. కెఫిన్, ఆల్కహాల్, ధూమపానం అలాంటి వాటికి దూరంగా ఉంటే మోతను తగ్గించుకునే అవకాశముందని medlineplus అధ్యయనం పేర్కొంది.

Tinnitus
Tinnitus (Getty Images)

వ్యాయామం : క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మోత తీవ్రత, దీంతో కలిగే అసౌకర్యం తగ్గుతాయి. వ్యాయామంతో మొత్తంగా ఆరోగ్యం మెరుగవుతుందని, కంటి నిండా నిద్ర పడుతుందంటున్నారు నిపుణులు. ఇవి రెండూ చెవి మోత తగ్గటానికి తోడ్పడతాయని చెబుతున్నారు.

ధ్యానం, ప్రాణాయామం : మనసును కుదురుగా నిలిపే ప్రాణాయామం, ధ్యానం కూడా మేలు చేస్తాయి. ఇవి నిరాశ, ఆందోళన, కుంగుబాటు తగ్గిస్తాయి. అందరితో కలివిడితనం పెరుగుతుంది. చెవిలో మోత గల వారిలో మానసిక ఆరోగ్యం మెరుగవటానికివి సహాయపడతాయి.

ఒత్తిడి తగ్గించుకోవాలి : మానసిక ఒత్తిడి చెవిలో మోత భావన పెరిగేలా, దానికి అతిగా స్పందించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని nhs.uk అధ్యయనం పేర్కొంది.

Tinnitus
Tinnitus (Getty Images)

నలుగురితో కలివిడిగా : కొన్ని సందర్భాల్లో చెవి మోత భరించలేని స్థితికి చేరుకోవచ్చు. ఇది ఒంటరితనానికి, మోత మీద ధ్యాస మరింత ఎక్కువగా పెట్టటానికి దారి తీస్తుంది. కాబట్టి, మనసుకు ఆనందం కలిగించే వారితో సమయం గడిపేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. కనీసం ఫోన్‌లో మాట్లాడినా, మెసేజ్‌లతో చర్చించినా చాలని చెబుతున్నారు. దీంతో మోత మీది నుంచి ధ్వాస మళ్లుతుంది. తద్వారా ప్రశాంతత, ఆనందం, ఆశావహ దృక్పథం పెరుగుతాయి.

కౌన్సెలింగ్‌ : టినిటస్‌ మరీ ఇబ్బంది పెడుతుంటే మానసిక నిపుణులను సంప్రదించి, కౌన్సెలింగ్‌ తీసుకోవటం మంచిదట. ఇందులో మోతకు సంబంధించిన ప్రతికూల ఆలోచలను విధానాన్ని, మోతకు స్పందించే తీరును మార్చుకునేలా శిక్షణ ఇస్తారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుండె ఆరోగ్యం "స్పెషల్ డైట్" - నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్లు ఇవే!

పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?