ఎప్పుడూ టీ, కాఫీలనే తాగుతున్నారా? - ఈ "హెర్బల్ టీ" లు ట్రై చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందట!
-టీ, కాఫీల కంటే హెర్బల్ టీ మేలు - కొలెస్ట్రాల్ తగ్గడం సహా ఈ ప్రయోజనాలు లభిస్తాయంటున్న నిపుణులు!

Published : November 7, 2025 at 2:24 PM IST
Herbal Teas to Lower Cholesterol Naturally: చాలా మంది కాలంతో సంబంధం లేకుండా ఉదయం లేవగానే టీ లేదా కాఫీలను తాగుతుంటారు. కానీ, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అందుకే, సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే, కాఫీ, టీలో ఉండే కెఫెన్ అనేది హెర్బల్ టీలో ఉండదని పేర్కొంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు. మరి, అలాంటి హెర్బల్ టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
గ్రీన్ టీ : గ్రీన్ టీలో కాటెచిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వాపు తగ్గుతుందని అంటున్నారు. అలాగే, బరువు నియంత్రణలో ఉండానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. గ్రీన్ టీ పానీయాలు లేదా సారాలు తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL-కొలెస్ట్రాల్ సాంద్రతలు గణనీయంగా తగ్గాయని sciencedirect అధ్యయనం పేర్కొంది.

మీ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!
మందార టీ : ముదురు ఎరుపు రంగు కలిగిన మందార టీ గుండెకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మందార టీ లేదా సారం తీసుకోవడం వల్ల చెడు LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.

చమోమిలే టీ : చమోమిలే టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన హెర్బల్ టీలలో ఒకటి. ఇది మనస్సుకు హాయిని కలిగించడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, ఒత్తిడిని తగ్గించడం ద్వారా పరోక్షంగా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని వివరిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అపిజెనిన్, లూటిన్, క్వెర్సెటిన్ వంటివి వాపును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయని వివరిస్తున్నారు.

అల్లం టీ : అల్లంలోని జింజెరాల్‌కు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ కప్పు అల్లం టీ తాగితే, అధిక బరువు అదుపులో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇందులోని పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుందని వివరిస్తున్నారు. అల్లం అనేది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో గర్భిణులు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగడం సురక్షితమేనా అని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.
హెర్బల్ టీలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులకు మద్దతుగా మాత్రమే పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు మందులకు బదులుగా వీటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ క్రమంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఆహరం, జీవనశైలిలో మార్పులు చేసుకునే ముందు సంబంధిత డాక్టర్లుని సంప్రదించాలని సూచిస్తున్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్ ఉందని సూచించే సంకేతాలు: శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. అయితే, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఛాతీ నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు లేదా చర్మం చుట్టూ పసుపు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి? - నిపుణుల సమాధానమిదే!
"నానబెట్టిన మెంతులు" ఆరోగ్యానికి మంచిదేనా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

