ETV Bharat / health

కండరాల నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? - ఈ లక్షణాలు ఉంటే ప్రమాదకరమంటున్న నిపుణులు

ప్రాణాంతకంగా మారే కండరాల వాపు - 'కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్' లక్షణాలు ఇవే!

Muscle Pain
Muscle Pain (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 6, 2026 at 5:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

This Kind Of Muscle Pain Should Not Be Ignored : వ్యాయామం చేయడం వల్ల సాధారణంగా కండరాల నొప్పులు, కండరం పట్టేయడం వల్ల లేదా దెబ్బ తగలడం వల్ల వస్తాయి. ఈ నొప్పులు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. అయితే, కొన్ని కండరాల నొప్పులూ అంత సాదాసీదావి కావు! అవి కొన్ని తీవ్రమైన పరిణామాలకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కండరాల నొప్పి ప్రమాదమైనదా? కాదా? అని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం!

డాక్టర్​ని సంప్రదించాల్సిన లక్షణాలు :

  • కాలు లేదా చేతి లోపల ఏదో వేడిగా ఉన్నట్లు అనిపించడం
  • కండరాల లోతుల్లో చాలా తీవ్రంగా అనిపించే 'తీవ్రమైన నొప్పి'
  • నొప్పి ఉన్న శరీర భాగాన్ని కదల్చడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి మరింత ఎక్కువైతే అది ఒక పెద్ద ప్రమాద సంకేతం. ఈ లక్షణాలు ఉంటే, అది కంపార్ట్​మెంట్ సిండ్రోమ్ అనే తీవ్రమైన సమస్య కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

కంపార్ట్​మెంట్ సిండ్రోమ్ అంటే : మన కండరాలు, రక్తనాళాలు, నరాలను కలిపి గట్టిగా పట్టి ఉంచే ఒక బలమైన, సన్నని పొర ఉంటుంది. దీన్నే ఫాసియా అంటారు. ఇది అసలు సాగదు. దీన్నే ఒక కంపార్ట్​మెంట్ (గది) అనుకోవచ్చు. అయితే, దీనికి ఏదైనా గాయం లేదా దెబ్బ తగిలినప్పుడు, ఆ కంపార్ట్​మెంట్ లోపల విపరీతంగా వాపు రావడం లేదా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. తద్వారా దీని చుట్టూ ఉన్న పొర గట్టిగా ఉండటం వల్ల, లోపల వచ్చిన వాపు బయటకు రాలేక లోపల ఉన్న నరాలు, రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల కండరాలకు అందాల్సిన ఆక్సిజన్, రక్తం పూర్తిగా ఆగిపోతాయి. వ్యర్థాలు బయటకు వెళ్లలేవు. దీనివల్ల లోపల ఉన్న కండరాలు కుళ్లిపోవడం లేదా చనిపోవడం మొదలవుతుంది. ఇదే తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది.

ప్రాణాంతక క్యాన్సర్ 'మైలోమా' - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

కంపార్ట్​మెంట్ సిండ్రోమ్ లక్షణాలు :

తీవ్రమైన నొప్పి : సాధారణ నొప్పి కంటే ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కండరాల లోపల లోతైన, మంటతో కూడిన నొప్పిలా అనిపించవచ్చు.

కదలికలతో నొప్పి ఎక్కువ కావడం : నొప్పి ఉన్న చేయి లేదా కాలును కదల్చడానికి ప్రయత్నిస్తే, నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

వాపు : కండరం ఉబ్బినట్లు అనిపించడం లేదా తాకినప్పుడు రాయిలా గట్టిగా లేదా బిగుతుగా అనిపించవచ్చు.

వింత అనుభూతులు : చేతులు లేదా కాళ్లు మొద్దుబారడం. పిన్స్, సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది.

చికిత్స ఎలా చేస్తారు? : కంపార్ట్​మెంట్ సిండ్రోమ్​ అకస్మాత్తుగా, తీవ్రంగా ఉంటే, అతి అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు డాక్టర్లును వెంటనే సంప్రదించాలంటున్నారు నిపుణులు

ఫాసియోటమీ : కంపార్ట్​మెంట్ సిండ్రోమ్ చికిత్స అనేది అది ఎంత తీవ్రంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు కండరాల భాగాలలో ఒత్తిడి పెరిగి, రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలాంటప్పుడు సర్జన్ ఒత్తిడిని తగ్గించడానికి ప్రభావిత ప్రాంతంలోని చర్మాన్ని, కండరాల పొరను కట్ చేస్తారు. దీనివల్ల కండరాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది.

వ్యాయామం వల్ల ఈ నొప్పి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :

  • నొప్పిని ప్రేరేపించే పనులను ఆపివేయండి. ఎలాగంటే, రన్నింగ్ చేయడం వల్ల నొప్పి వస్తే, దానికి బదులుగా సైకిల్ తొక్కడం లేదా ఈత కొట్టడం లాంటివి చేయాలి.
  • అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇబుప్రొఫెన్ వంటి యాంటీ ఇన్​ఫ్లమేటరీ మందులను ఉపయోగించాలంటున్నారు నిపుణులు.
  • మీరు రన్నింగ్ చేసే వారైతే, ప్రత్యేకమైన షూ ఇన్సర్ట్​లను ధరించాలి.

పరిశోధన మూలాలు :

https://my.clevelandclinic.org/health/diseases/15315-compartment-syndrome

https://www.ncbi.nlm.nih.gov/books/NBK448124/

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC4071472/

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? - ఈ వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిందే!

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!