ETV Bharat / health

మధ్య వయసులోనూ 'బ్రెయిన్ స్ట్రోక్' ముప్పు - ICMR అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

బ్రెయిన్​ స్ట్రోక్ ప్రధాన కారణాలు ఇవేనట! - జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచనలు!

Stroke Patients in India
Stroke Patients in India (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : March 10, 2026 at 3:17 PM IST

4 Min Read
Choose ETV Bharat

Stroke Patients in India Under 45 Years : ఒకప్పుడు పక్షవాతం అంటే పెద్ద వయసులో వచ్చే ఓ వ్యాధి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాలుగు పదులు కూడా రాకుండానే బ్రెయిన్​స్ట్రోక్​కు గురవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక వెల్లడించింది. చాలామంది అవగాహన లేమితో గోల్డెన్ అవర్​నూ కోల్పోతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో బ్రెయిన్​ స్ట్రోక్​కు ప్రధాన కారణాలు? ఎప్పుడు సందేహించాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ఊరికే 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!

గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండెకు రక్త ప్రసరణ తక్కువైతే దాన్ని 'గుండెపోటు' అంటారు. ఇదే సమస్య మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అంటారు. మారుతున్న జీవనశైలి ప్రభావం పలు రూపాల్లో కనిపిస్తోందంటున్నారు నిపుణులు. శారీరక శ్రమ తగ్గిపోవడం, పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్​ఫుడ్ తీసుకోవడం పెరిగిపోయింది. దీంతో మానసిక ఒత్తిడి అధికమైంది. నిద్ర కరవైంది. ఫలితంగా, పాతికేళ్లు నిండకుండానే డయాబెటిస్, హైబీపీ, LDL (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండడం వంటి జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పొగాకు వినియోగం, మోతాదుకు మించి మద్యపానం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. వీటిని నియంత్రించుకోలేని సందర్భాల్లో, నడి వయసు రాకముందే గుండెపోటు, మెదడు పోటు వంటి ప్రమాదకరమైన జబ్బుల బారినపడుతున్నారు.

ప్రతి ఏడుగురిలో ఒకరు

ఇటీవల విడుదలైన ICMR- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్​ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ (NCDIR) నేతృత్వంలో నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం, స్ట్రోక్ బాధితుల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు 45 ఏళ్లలోపు వయసు వారే కావడం గమనార్హం. 2020-2022 వరకు 30 ఆసుపత్రుల్లో నమోదైన 34,792 కేసులను ఈ అధ్యయనం విశ్లేషించింది. 'ఇంటర్నేషనల్ జర్నల్​ ఆఫ్ స్ట్రోక్' ఈ నివేదికను ప్రచురించింది. బ్రెయిన్​ స్ట్రోక్ నమూనాలు, ముప్పు కారణాలు, ఫలితాలను విశ్లేషించింది.

ICMR-NCDIR అధ్యయనం ప్రకారం :

45 ఏళ్ల లోపు వారే : ప్రతి ఏడుగురు పక్షవాతం బాధితుల్లో ఒకరు

20 శాతం : గోల్డెన్ అవర్​లో వచ్చేవారు

4.6 శాతం : వీరిలోనూ థ్రాంబోలైసిస్ చికిత్స పొందుతున్నది.

Centers for Disease Control and Prevention, ప్రకారం ఎప్పుడు సందేహించాలి? :

  • గతంలో ఎప్పుడూ లేనంతగా తలనొప్పి రావడం
  • మాట తడబడడం, పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం
  • అయోమయ స్థితి
  • ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం
  • ఒకవైపు లేదా రెండు వైపులా బలహీనంగా ఉండడం
  • చూపులో అసృష్టత
  • అడుగులు తడబడడం. కళ్లు తిరిగినట్లుగా ఉండడం

బాధితులు :

  • సగటు వయసు 59.4 ఏళ్లు
  • వీరిలో 45 ఏళ్ల లోపున్నవారు 13.8 శాతం
  • గ్రామీణులు 72.1 శాతం

ప్రధాన కారణాలు :

  • అధిక రక్తపోటు - 74.5 శాతం
  • మధుమేహం - 27.3 శాతం
  • ధూమపానం - 22.6 శాతం
  • పొగాకు నమలడం - 28.5 శాతం
  • మద్యం - 20.2 శాతం

బ్రెయిన్​ స్ట్రోక్​ తీవ్రమైన సమస్యగా మారుతోంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా ముప్పు తీవ్రతను తగ్గించుకోవడం. అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్​కు చికిత్స పొందుతున్నవారు.. వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే, చక్కెర, ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లో-ఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించాలి. డాక్టర్లు సూచనల మేరకు మందులను టైంకు తీసుకోవాలి. శారీరక వ్యాయామాన్ని నియమంగా పెట్టుకోవాలి. రోజుకు కనీసం అరగంట అయినా నడవాలి. యోగా, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి సులభంగా అలవాటు చేసుకోవచ్చు. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పొగాకు, మద్యం అలవాట్లు ఉండే మానేయాలి. ఎందుకంటే, పొగాకు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. మద్యం ఎక్కువ తాగాడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది. మద్యం ఎక్కువ తాగడం కూడా ముప్పును పెంచుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై త్వరగా గుర్తించి, సాధ్యమైనంత వేగంగా చికిత్స అందించగలిగితే, 80% స్ట్రోక్స్​ను నివారించవచ్చు- డాక్టర్ రంజిత్.జి, న్యూరాలజిస్ట్

తీవ్రతను గుర్తించడమే అసలు సమస్య :

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ప్రారంభమైన తర్వాత ఎంత వేగంగా చికిత్స పొందితే, ఫలితం అంత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 4,5 గంటల్లో హాస్పిటల్​కి చేరుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయట. కానీ, 37.8 % మంది 24 గంటల తర్వాతే వస్తున్నారు. అతి తక్కువ మందికి మాత్రమే 'థ్రాంబోలైసిస్' (Thrombolysis) చికిత్స అందుతోంది. తద్వారా మరణాలు నమోదవుతున్నాయి. వైకల్యం బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బ్రెయిన్​ స్ట్రోక్ చికిత్స పొందుతున్న వారిలో మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశాలు 1.1 శాతం ఉన్నాయి. చికిత్సకు ఆలస్యానికి కారణాలను విశ్లేషిస్తే, లక్షణాలను తీవ్రమైనవిగా రోగి, కుటుంబ సభ్యులు, సమీపంలో ఉన్నవారు గుర్తించలేకపోవడం ఒకటైతే, ఆసుపత్రిలో వైద్యులు ఆ లక్షణాల తీవ్రతను అంచనా వేయలేకపోవడం మరోటి. అంబులెన్సు సేవలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, హాస్పిటల్​ల్లో సీటీ, ఎంఆర్​ఐ స్కాన్ అందుబాటులో లేకపోవడంతో, నిర్ధారణ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావడంతో, గోల్డెన్ అవర్ కాస్తా ప్రమాద ఘంటికగా మారుతోంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

మోనోపాజ్ తర్వాత 'క్యాన్సర్ ముప్పు'! - స్క్రీనింగ్ తప్పనిసరంటున్న నిపుణులు!

మీ గట్ హెల్త్​ బాగుండాలా? - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!