మొలకలొచ్చాక వీటిని తింటున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
ఈ కూరగాయల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు! - ఎందుకో తెలుసా?

Published : November 9, 2025 at 10:08 AM IST
Sprouted Vegetables are Harmful for Health: కొన్ని రకాల కాయగూరల్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటి పైన మొలకలు వస్తుంటాయి. అయితే చాలా మంది వాటిని తొలగించుకొని వంట చేసుకుంటుంటారు. కానీ, ఇలా మొలకలొచ్చిన కాయగూరల్ని తినకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి, మొలకలు వచ్చిన తర్వాత తినకూడని కాయగూరలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
బంగాళాదుంపలు : వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిపై చిన్న చిన్న మొలకలు వచ్చి, క్రమంగా అవి పెద్దవవుతుంటాయి. అయితే, చాలా మంది వాటిని తొలగించి వండుకుంటారు. కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ మొలకల్లో కొన్ని రకాల విషపదార్థాలు ఉంటాయని, ఇవి కడుపులోకి చేరితే వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మొలకెత్తిన దుంపల్ని పక్కన పెట్టేయడమే మేలని సూచిస్తున్నారు. అయితే, ఇలా బంగాళాదుంపలపై మొలకలు రావడానికి వెలుతురు, వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటిని నిల్వ చేయడమే కారణమని పేర్కొంటున్నారు. అదే చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లో దుంపల్ని నిల్వ చేయడం వల్ల వాటిపై మొలకలు రాకుండా నివారించచ్చని సలహా ఇస్తున్నారు. గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తల్లి తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ లోపాలు, ఓరోఫేషియల్ క్లెఫ్ట్‌లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

కాకరకాయ చేదు తగ్గాలా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
ఉల్లి-వెల్లుల్లి : ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసిన ఉల్లిపాయలపై ఉల్లికాడల మాదిరిగా మొలకలు వస్తుంటాయి. కొందరు వీటిని ఉల్లికాడలుగా పొరబడుతుంటారు. వీటినీ కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. కానీ, ఇవి ఆరోగ్యకరం కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిపై మొలకలు రాకూడదంటే చీకటిగా, చల్లగా, తేమ లేని ప్రదేశాల్లో ఉల్లిపాయల్ని నిల్వ చేయాలని సూచిస్తున్నారు. అలాగే, ఉల్లికాడల్ని కూరల్లో వాడాలనుకునేవారు, ప్రత్యేకంగా సాగు చేసిన వాటిని ఎంచుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు వెల్లుల్లి పైనా ఉల్లికాడల మాదిరిగా మొలకలు రావడం గమనిస్తుంటాం. అలాంటి వాటిని ఒలిచి చూస్తే లోపల బ్లాక్ ఫంగస్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలాంటి వాటిని పడేయడమే మంచిదని చెబుతున్నారు.

వీటిని పచ్చిగా తీసుకోవద్దట : మాములుగా మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని పచ్చిగానే తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. కొంతమంది వీటితో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే, కొన్ని రకాల మొలకల్ని పచ్చిగా తీసుకోకపోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఆల్ఫాల్ఫా గింజలతో తయారుచేసిన మొలకలు, చిక్కుళ్ల మొలకలు పచ్చిగా తీసుకోవడం వల్ల కొంతమందిలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలాంటి మొలకల్ని పచ్చిగా కాకుండా బాగా ఉడికించుకొని తీసుకోవడం మంచిదంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, గర్భిణులు, ఆటోఇమ్యూనిటీ వ్యాధులు ఉన్నవారు, మొలకెత్తిన కాయగూరలతో పాటు మొలకెత్తిన గింజలు, విత్తనాలకు దూరంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!
బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా? - జుంబా డ్యాన్స్‌తో ఫన్ అండ్ ఫిట్నెస్!

