ETV Bharat / health

'సైలెంట్ కిల్లర్స్' - మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న అలవాట్లు ఇవేనట!

- నెమ్మదిగా ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి - వాటి నుంచి ఇలా బయట పడొచ్చంటున్న నిపుణులు

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 18, 2026 at 1:46 PM IST

5 Min Read
Choose ETV Bharat

Small Habits that Ruin your Mental Peace : మన జీవితంలో ఏదైనా పెద్ద విషాదం లేదా పనిలో భరించలేని సంక్షోభం ఎదురైనప్పుడు మాత్రమే ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదట. చాలాసార్లు, మనం తేలికగా తీసుకునే చిన్న చిన్న రోజువారీ అలవాట్లే మనకు తెలియకుండానే మన ప్రశాంతతను దెబ్బతీస్తుంటాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మనసును నెమ్మదిగా ఒత్తిడికి గురిచేసే ఆ అలవాట్లు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం!

మనం మనసుకు ఇచ్చే 'ఆహారం' సరైనదేనా? : శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం మనం ఎంతగానో శ్రద్ధ వహిస్తాము. మార్కెట్‌కు వెళ్తే కూరగాయలు, పండ్లు ఎంత నాణ్యమైనవో చూసి మరీ కొంటాము. కానీ, ప్రతిరోజూ మన మనస్సులోకి ఎలాంటి విషయాలను పంపుతున్నామో.. ఎప్పుడైనా గమనించామా? ఈ క్రమంలో నేటి ఆధునిక యుగంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అవగాహన కలిగి ఉండటం కచ్చితంగా ముఖ్యమే. కానీ, దానికి ఒక పరిమితి ఉండాలంటున్నారు నిపుణులు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన మొబైల్ ఫోన్లలో భయపెట్టే వార్తలు, హింసాత్మక సంఘటనలు లేదా ప్రతికూల సమాచారాన్ని నిరంతరం చూస్తూ ఉంటామని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన మెదడు ఎప్పుడూ ఒక రకమైన భయం, అభద్రతాభావానికి లోనవుతుందంటున్నారు. ప్రతికూల విషయాలతో రోజును ప్రారంభించడం వల్ల మానసిక స్థితి, సృజనాత్మకత, ఉత్పాదకత, ఆత్మవిశ్వాసం తగ్గుతాయని Fielding Graduate University పేర్కొంది.

"ప్రెగ్నెన్సీ"లో నిద్ర పట్టడం లేదా? - ఇలా చేస్తే మంచిదట!

ఏం చేయాలి : సోషల్ మీడియాలో నిరంతరం వచ్చే అప్​డేట్​లు, రీల్స్, నోటిఫికేషన్​లు మన మనసుకు ఒక్క క్షణం కూడా విశ్రాంతినివ్వవని పేర్కొంటున్నారు. ఫలితంగా, మనకు తెలియకుండానే లోలోపల ఒక తీవ్రమైన అశాంతి, ఒత్తిడి మనల్ని ఆవహిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే, మొబైల్​ఫోన్ చూడటానికి, సోషల్ మీడియాను ఉపయోగించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇతరులతో పోల్చుకోవడం : ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇతరుల విదేశీ పర్యటనలు, కొత్త కార్ల కొనుగోళ్లు, విలాసవంతమైన రెస్టారెంట్లకు వెళ్లడం లేదా వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫోటోలు మన టైమ్​లైన్​లో కనిపిస్తూనే ఉంటాయి. మనం వీటిని ఊరికే సరదాగా చూస్తున్నామనుకుంటాం. కానీ, మనకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన ఉచ్చులో పడిపోతామంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇతరుల పోస్టులను చూసినప్పుడు, మన జీవితాన్ని వారి లైఫ్​తో పోల్చుకోవడం మొదలుపెడతామని చెబుతున్నారు. 'వారు ఎంత సంతోషంగా ఉన్నారు. మనమెందుకు ఇలా ఉండిపోయాం?' అనే ఆలోచనలు వస్తాయని తెలియజేస్తున్నారు. ఈ ఒక్క ఆలోచన చాలు.. మన మనశ్శాంతిని పూర్తిగా నాశనం చేసి, మనలో అసంతృప్తిని, నిరాశను పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్ వాడకానికి, డిప్రెషన్, ప్రతికూల భావోద్వేగాలకు సంబంధం ఉన్నట్లు sciencedirect పేర్కొంది.

ఏం చేయాలి : సోషల్ మీడియాలో కనిపించేది ఎప్పటికీ పూర్తి జీవితం కాదంటున్నారు నిపుణులు. ఎవరైనా సరే తమ జీవితంలోని అత్యంత సంతోషకరమైన, అందమైన క్షణాలను మాత్రమే కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెడతారని అర్ధం చేసుకోవాలట. వారి జీవితంలో ఉండే బాధలు, కష్టాలు, అప్పులు, గొడవలను ఎవరూ సోషలో మీడియాలో పోస్ట్ చేయారని మనం ఆలోచించాలని చెబుతున్నారు.

అశాంతమైన నిద్ర : నిద్ర అనేది మన శరీరానికి, మనస్సుకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం. కానీ, రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడటం వల్ల నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. "ఇంకొక్క వీడియో చూసి పడుకుందాం" అనే ఆలోచనతో మొదలై, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫోన్ చూస్తూనే ఉంటామట. దీనివల్ల మన శరీరం, మనస్సు తీవ్ర అలసటకు గురవుతాయని అంటున్నారు. మనకు తగినంత నిద్ర లేనప్పుడు, మరుసటి రోజు చిన్న విషయాలకే కోపం, చిరాకు, గురవుతామని తెలియజేస్తున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తీవ్రతరం చేసి, దీర్ఘకాలిక భావోద్వేగ అస్తవ్యస్తతకు దోహదపడుతుందని International Journal of Psychology పేర్కొంది.

ఏం చేయాలి : నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందే మొబైల్ ఫోన్​కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. బెడ్​రూమ్​లోకి మొబైల్ ఉంచుకోకుండా, చేతికి అందనంత దూరంలో లేదా వేరే గదిలో ఫోన్​ పెట్టాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం దాటిన తర్వాత ఫోన్​లో బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్​మోడ్ ఆన్ చేయడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.

వాయిదా వేయడం - ఒక మానసిక భారం : మనం ఏదైనా ఒక కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు లేదా మనకు నచ్చని విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దానిని రేపటికి వాయిదా వేస్తుంటాము. అలా వాయిదా వేయడం వల్ల ఆ క్షణానికి మనకు కొంత తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. కానీ, వాస్తవానికి ఆ సమస్య పరిష్కారం కాకుండా మన మనస్సులో ఏదో ఒక మూల అలానే ఉండిపోతుంది. "అయ్యో... నేను ఇంకా ఆ పని పూర్తి చేయలేదు, నేను ఇంకా వారితో మాట్లాడలేదు" అనే ఆలోచన నిరంతరం మనల్ని వేధిస్తూ, ప్రశాంతంగా నిద్రపోనివ్వదంటున్నారు నిపుణులు.

ఏం చేయాలి : ఏ సవాలునైనా వాయిదా వేయకుండా, వెంటనే ఎదుర్కోవడం వల్ల మానసిక భారం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

మన శక్తిని హరించే వ్యక్తులు : మరేదానికన్నా ఎక్కువగా, మన చుట్టూ ఉన్నవారి ఆలోచనలు, ప్రవర్తన మన మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారు, మానసికంగా కుంగదీసేవారు లేదా ప్రతి చిన్న విషయంలోనూ ప్రతికూలతను మాత్రమే చూసే వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే, మనకు తెలియకుండానే మన మనస్సు నీరసించిపోతుందని చెబుతున్నారు. మనలోని సానుకూల శక్తి తగ్గిపోతుందట.

ఏం చేయాలి? : మనకు ఆత్మీయులైన వారికి అండగా ఉండటం ఎంత ముఖ్యమో, మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు. మనల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే సానుకూల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మనస్సుకు కొత్త ఉత్సాహం, సరికొత్త శక్తి లభిస్తాయని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రొమ్ము క్యాన్సర్ ముప్పు - ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయట!

కడుపుబ్బరంగా అనిపిస్తోందా? - సహజసిద్ధ పరిష్కారాలు ఇవేనట!