ETV Bharat / health

'కళ్లు తిరగడం, తలనొప్పి'గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!

-డీహైడ్రేషన్ లక్షణాలు - రోజుకు ఎంత వాటర్ తాగాలి?

Dehydration
Dehydration (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : March 2, 2026 at 3:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Silent Dehydration: శరీరానికి తగినంత నీరు అవసరమని డాక్టర్లు పదేపదే చెబుతుంటారు. రోజుకు కనీసం 1.5 నుంచి 2 లీటర్లు నీళ్లు తాగాలంటున్నారు. కానీ, ఈ ఉరుగులు, పరుగుల జీవితంలో చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో డీహైడ్రేషన్​కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం తదితర సమస్యలతో ఇబ్బందలుపడుతున్నారు. అయితే డీహైడ్రైషన్​కు గురైనప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

నిరంతర అలసట : చాలా మంది రాత్రిళ్లు బాగా నిద్రపోయినప్పటికీ.. ఉదయం అలసటగా ఫీల్ అవుతుంటారు. అందుకు శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడమే కారణం అంటున్నారు నిపుణులు. నీరు తగ్గినప్పుడు రక్త పరిమాణం తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

నెమ్మదిగా మొదలయ్యే తలనొప్పి : శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు, మెదడు కణజాలం తాత్కాలికంగా కుంచించుకుపోవచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల ఏర్పడే ఒత్తిడి మార్పులు తలనొప్పికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. అయితే, నీరు సరిగా తాగడం వల్ల ఇలాంటి తలనొప్పులు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరం డీహైడ్రేషన్​కు గురైనప్పుడు తలనొప్పి, అలసట, ఆకలి లేకపోవడం లేదా చక్కెర తినాలనే కోరిక, కండరాల తిమ్మిరి, మలబద్ధకం లాంటి లక్షణాలు కనిపిస్తాయని clevelandclinic అధ్యయనం పేర్కొంది.

కండరాలు బలంగా ఉండాలా? - నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!

పొడిబారిన చర్మం : చర్మం మన శరీరంలో అతిపెద్ద అవయవం. డీహైడ్రేషన్​గా ఉన్నప్పుడు చర్మం కాంతివిహీనంగా లేదా తక్కువ సాగే గుణంతో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై చిన్న చిన్న గీతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు.

ముదురు రంగు మూత్రం : మూత్రం రంగు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. లేత గడ్డి రంగులో ఉంటే హైడ్రేషన్​గా ఉన్నట్లు, ముదురు పసుపు రంగులో ఉంటే శరీరానికి మరిన్ని ద్రవాలు అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.

మలబద్ధకం : జీర్ణక్రియ సాఫీగా సాగడానికి నీరు చాలా ముఖ్యం. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు, వ్యర్థాల నుంచి పేగులు నీటిని పీల్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మలం గట్టిపడి మలబద్ధకం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

అకస్మాత్తుగా తీపి పదార్థాలు తినాలనిపించడం : తీపి కోరికలు ఎప్పుడూ ఆకలి వల్లనే కలగవు. కాలేయం శక్తి కోసం గ్లూకోజ్‌ను విడుదల చేయాలంటే నీరు అవసరం. హైడ్రేషన్ తగ్గినప్పుడు ఈ ప్రక్రియ మందగిస్తుందంటున్నారు నిపుణులు. దీంతో మెదడు చక్కెర అవసరమని తప్పుగా అర్థం చేసుకుంటుందని చెబుతున్నారు.

కండరాల తిమ్మిర్లు, కళ్లు తిరగడం : సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత నీటిపై ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే కండరాలు సులభంగా తిమ్మిర్లకు గురవుతాయంటున్నారు నిపుణులు. అలాగే, త్వరగా లేచి నిలబడినప్పుడు కళ్లు తిరిగినట్లు అనిపించవచ్చని వివరిస్తున్నారు.

ఎంత నీరు తాగాలి?: శరీరానికి ఎంత నీరు అవసరమనేది.. వయస్సు, వాతావరణం, శ్రమను బట్టి మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెద్దలు రోజుకు 2 నుంచి 3 లీటర్ల ద్రవాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థిరమైన శక్తి, లేత రంగు మూత్రం, క్రమబద్ధమైన మూత్ర విసర్జన వంటివి మీరు తగినంత హైడ్రేటెడ్‌గా ఉన్నారని చెప్పే స్పష్టమైన సంకేతాలని తెలియజేస్తున్నారు. మాములుగా మహిళలు రోజుకు సగటున 9 కప్పులు, పురుషులు సగటున 13 కప్పుల నీటిని తాగాలని National Institutes of Health అధ్యయనం పేర్కొంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

SMA ఒక ప్రాణాంతక వ్యాధి - ఎవరికి వస్తుందో తెలుసా?

కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - ఈ చిట్కాలు పాటిస్తే మేలంటున్న నిపుణులు!