ETV Bharat / health

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే "కడుపు క్యాన్సర్" కావొచ్చట!

విస్తరిస్తున్న కడుపు క్యాన్సర్ - లక్షణాలు వెల్లడించిన నిపుణులు

Stomach Cancer
Stomach Cancer (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : March 4, 2026 at 2:23 PM IST

4 Min Read
Choose ETV Bharat

Stomach Cancer Symptoms : ఎసిడిటీ, గ్యాస్ బాధల్ని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోము. ఏదో ఒక యాంటాసిడ్ మాత్ర వేసుకుంటాము. అయితే, ఇవే బాధలు దీర్ఘకాలికంగా కొనసాగుతుండటం, వీటికి తోడు తరచూ పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకర క్యాన్సర్లు దాగి ఉండే ప్రమాదం ఉందని హెచ్చస్తున్నారు. ఈ క్రమంలో కడుపు క్యాన్సర్​ సూచించే హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

కడుపు క్యాన్సర్​ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. కడుపులో క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది కడుపులోని ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే, చాలా సందర్భాలలో, కడుపు ప్రధాన భాగంలో ఇది కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి సాధారణంగా నెమ్మదిగా మొదలవుతాయి. దీని ప్రారంభ సంకేతాలు ఎసిడిటీ, అజీర్ణం లేదా అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పి వంటి సాధారణ జీర్ణక్రియ సమస్యలను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం చాలా కష్టం. అయితే, హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స ఫలితాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు.

SMA ఒక ప్రాణాంతక వ్యాధి - ఎవరికి వస్తుందో తెలుసా?

నిరంతర అజీర్ణం : ఉదర పై భాగంలో స్వల్పంగా ఎసిడిటీ లేదా మంట కలగడం సాధారణం. అయితే, ఇది పదేపదే లేదా నిరంతరం వస్తున్నప్పుడు, అది కడుపు క్యాన్సర్ సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సాధారణంగా మంట లేదా అసౌకర్యమనేది బొడ్డు పైన అనిపిస్తుందట. సాధారణ యాంటాసిడ్లు లేదా జీవనశైలి మార్పులతో ఇది తగ్గకపోవచ్చట. ఎటువంటి స్పష్టమైన కారణం లేనప్పటికీ, ఈ రకమైన అజీర్ణం వారాల పాటు లేదా నెలల తరబడి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది.

కడుపు నిండినట్లు అనిపించడం : తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకున్నప్పటికీ, కడుపు నిండినట్లు అనిపిస్తుందని nhs.uk అధ్యయనం పేర్కొంది. కడుపు విపరీతంగా నిండిపోయినట్లు, బిగుతుగా లేదా బరువుగా అనిపించడం వల్ల వ్యక్తి భోజనం మధ్యలోనే తినడం ఆపేయవచ్చంటున్నారు నిపుణులు. కడుపు పై భాగం లేదా మధ్య భాగంలో గడ్డ పెరగడం వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు.

కారణం లేకుండా బరువు తగ్గడం : డైటింగ్ లేదా వ్యాయామం చేయకుండానే బరువు తగ్గడం ఆందోళకరమైన విషయం. కడుపు క్యాన్సర్​లో గడ్డలు అనేవి జీర్ణక్రియకు, పోషకాల శోషణకు అడ్డుపడటం వల్ల క్రమంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆకలిని కూడా తగ్గిస్తుందట. దీనివల్ల వ్యక్తి తక్కువగా తినొచ్చు. శరీరం క్యాలరీలను, పోషకాలను సమర్థవంతంగా గ్రహించలేకపోవచ్చట. ఇది శరీరం కృశించిపోవడానికి, బలహీనతకు, కండరాల క్షీణతకు దారితీస్తుందట.

నిరంతర కడుపు నొప్పి లేదా అసౌకర్యం : కడుపు పైభాగంలో మొండిగా, నిరంతరంగా వచ్చే నొప్పి లేదా అసౌకర్యం మరొక ముఖ్యమైన సంకేతమని betterhealth.vic.gov. అధ్యయనం పేర్కొంది. తిన్న ఆహారం సరిపడక అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పిలా కాకుండా, ఈ నొప్పి తగ్గకుండా వస్తుందట. అలాగే, కాలక్రమేణా నెమ్మదిగా తీవ్రమవుతుందట. ఇది సాధారణంగా బొడ్డుకు సరిగ్గా పై భాగంలో అనిపిస్తుందని చెబుతున్నారు. ఈ నొప్పి గడ్డ వల్ల గానీ, కడుపు లోపలి పొరపై పుండ్లు ఏర్పడటం వల్ల గానీ లేదా సమీపంలోని ఇతర అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల గానీ రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి రాత్రి సమయాల్లో లేదా భోజనం చేసిన తర్వాత మరింత ఎక్కువగా అనిపిస్తుందట.

వికారం, వాంతులు : తరచుగా వికారం అనిపించడం లేదా భోజనం చేసిన తర్వాత పదేపదే వాంతులు కావడం కడుపులో సమస్య ఉన్నదనడానికి సంకేతం కావచ్చని clevelandclinic అధ్యయనం పేర్కొంది. కడుపు క్యాన్సర్ ఉన్న కొన్ని సందర్భాల్లో, గడ్డ ఉదర ద్వారం వద్ద అడ్డుపడటం వల్ల పదేపదే వాంతులు అవుతాయని చెబుతున్నారు

నల్లటి లేదా తారు రంగు మల విసర్జన లేదా మలంలో రక్తం : నల్లగా, తారు రంగులో ఉండే మలం అనేది కడుపుతో సహా జీర్ణవ్యవస్థ పైభాగంలో రక్తస్రావం జరుగుతోందనడానికి సంకేతమంటున్నారు నిపుణులు. రక్తం ప్రేగుల గుండా ప్రయాణించేటప్పుడు నల్లగా మారుతుంది, ఇది కడుపులోని గడ్డ వల్ల కలిగే పుండును సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ రక్తస్రావం చాలా నెమ్మదిగా జరిగి బయటకు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల చర్మం పాలిపోవడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. మలంలో రక్తం నేరుగా కనిపించడం కూడా ఒక ప్రమాదకరమైన హెచ్చరిక సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఊరికే 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!

'కళ్లు తిరగడం, తలనొప్పి'గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!