కిడ్నీలను సైలెంట్‌గా దెబ్బతీసే 'ప్రోటీన్యూరియా' - పురుషులు గుర్తించాల్సిన కీలక లక్షణాలు ఇవేొ!
మూత్రంలో ప్రొటీన్! - నిర్లక్ష్యం చేయకూడని కిడ్నీ ముప్పు సంకేతాలివే!

Published : July 13, 2026 at 4:51 PM IST
Hidden Sign Of Kidney Damage That Men : చాలామంది పురుషులు శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా, కండరాల నిర్మాణం, గుండె ఆరోగ్యంపై దృష్టి పెడతారు. అయితే, మొత్తం ఆరోగ్యంలో కీలకమైన కిడ్నీల గురించి అసలు పట్టించుకోరు. ఈ క్రమంలో కిడ్నీ సమస్యల ప్రారంభ, అత్యంత సూక్ష్మమైన సంకేతాలలో ఒకటి మూత్రంలో ప్రోటీన్ చెప్పుకుంటారు. దీనినే 'ప్రోటీన్యూరియా' అంటారు. ప్రారంభ దశల్లో దీని లక్షణాలు పెద్దగా కనిపించనప్పటికీ, ప్రోటీన్యూరియా వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని చెప్పడానికి ఒక సంకేతం. దీన్ని అలాగే వదిలేస్తే, తీవ్రమైన ఆరోగ్యమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలో కిడ్నీలను దెబ్బతీసే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
కిడ్నీల పనితీరును అర్ధం చేసుకోవడం : కిడ్నీలు రక్తం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను వడపోసి, వాటిని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలలో గ్లోమెరులి అని పిలిచే ప్రత్యేక వడపోత విభాగాలు ఉంటాయి. ఇవి ప్రొటీన్ వంటి పెద్ద అణువులు మూత్రంలోకి వెళ్లకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.
ప్రోటీన్యూరియా : గ్లోమెరులి దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్యూరియా సంభవిస్తుంది. దీనివల్ల ప్రొటీన్ మూత్రంలోకి లీక్ అవుతుంది. మూత్రంలో నిరంతరం ప్రొటీన్ స్థాయిలు పెరగడం ఆందోళనకరమైన విషయం. ప్రారంభ దశల్లో ప్రోటీన్యూరియా సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని కిడ్ని వ్యాధులకు నిశ్శబ్ద సంకేతంగా పిలుస్తారు. అయితే, మూత్రపిండాల నష్టం పెరిగే కొద్దీ, కాళ్లు, మడమలలో వాపు, అలసట, నురగతో కూడిన మూత్రం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పదేపదే మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపించవచ్చు.
పురుషులను ఎక్కువగా ప్రభావితమవుతారు : పురుషులు కిడ్నీల నష్టానికి, ప్రోటీన్యూరియాకు గురవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
అధిక రక్తపోటు : మహిళలతో పోలిస్తే పురుషులలో, ముఖ్యంగా చిన్న వయస్సులోనే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నియంత్రణలో లేని రక్తపోటు కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం : పురుషులలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ వ్యాధికి మరో ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల కాలక్రమేణా మూత్రపిండాలు దెబ్బతింటాయని అంటున్నారు.
ప్రోస్టేట్ సమస్యలు : వయస్సు పైబడిన పురుషులలో బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా(BPH) లేదా ప్రోస్టేట్ గ్రంథి వాపు సాధారణంగా కనిపిస్తుంది. BPH మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతినే అవకాశం ఉంది.
జీవనశైలి కారణాలు : ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం వంటి మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతిసే అలవాట్లు పురుషులలో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.
ప్రోటీన్యూరియాను గుర్తించడం : ప్రోటీన్యూరియాను గుర్తించడానికి ఉత్తమమైన మార్గం సాధారణ మూత్ర పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణంగా రెగ్యులర్ శారీరక పరీక్షలో భాగంగా చేస్తారట. మూత్రంలో ప్రోటీన్ ఉన్నట్లు తేలితే, కిడ్నీల పనితీరును అంచనా వేయడానికి స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియేటినిన్ రేషియో (UPCR)లేదా 24 గంటల మూత్ర సేకరణ, రక్తపరీక్షలు అవసరం కావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
రక్తపోటు, షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవడం : అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉంటే, మందులు, ఆహారం, వ్యాయామం ద్వారా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బరువు అదుపులో : ఒబెసిటీ వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం.
సమతుల్య ఆహారం తీసుకోవడం : ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడ్‌మీట్, చక్కెర పానీయాలను పరిమితం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
హైడ్రేటెడ్‌గా ఉండటం : మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలని సలహా ఇస్తున్నారు.
మద్యం సేవించడాన్ని పరిమితం చేయడం : మితిమీరిన మద్యపానం మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
ధూమపానం మానేయండి : ధూమపానం వల్ల మూత్రపిండాల్లోని రక్తనాళాలతో సహా శరీరంలోని ఇతర రక్తనాళాలు దెబ్బతింటాయి.
పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించడం : నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి నొప్పి నివారణ మందులను ఎక్కువగా వాడితే మూత్రపిండాలకు హాని కలుగుతుంది.
క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం : ప్రోటీన్యూరియా పరీక్షతో కూడిన రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరిశోధన మూలాలు :
https://www.kidney.org/news-stories/10-common-habits-may-harm-your-kidneys
https://my.clevelandclinic.org/health/symptoms/16428-proteinuria
https://medlineplus.gov/lab-tests/protein-in-urine/
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

