బరువు తగ్గాలని మందులు వాడుతున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
-'జీఎల్పీ 1 ఎనలాగ్' మాత్రలతో బరువు తగ్గినా, మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు!

Published : January 10, 2026 at 3:59 PM IST
Weight Loss Medications: అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌గా కనిపించడానికి ఒక్కొక్కరూ ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు లాంటివి చేస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం, ఇంటర్నెట్లో బరువు తగ్గడానికి వినియోగించే మందుల గురించి ఆరాతీస్తుంటారు. ఈ క్రమంలో సరైన డాక్టర్ల సలహా లేకుండా వాడే మందులే ప్రాణాంతకమవుతాయంటున్నారు నిపుణులు. మంచి అలవాట్లు, చక్కటి వ్యాయామ ప్రణాళికతో చక్కటి శరీరాకృతి సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం
'30 రోజుల్లో 10 కిలోలు తగ్గా, జీరోసైజ్ సాధించేశా, దానికి ఫలానా మందులు వాడా' అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి కొందరు ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులతో కాకుండా ఔషధాలతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ యువతి ఇదే పద్ధతిని ఫాలో అయ్యింది. 5 కిలోల బరువు పెరగడంతో డాక్టర్ని సంప్రదిస్తే ఎక్సర్సైజ్, ఆహారంతో బరువు తగ్గాలని సూచించారు. కానీ, ఆమె ఇంటర్నేట్లో బరువు తగ్గడానికి వినియోగించే ఔషధాల గురించి తెలుసుకుంది. 'జీఎల్పీ 1 ఎనలాగ్' మాత్రలు వాడింది. రెండు నెలల్లో బరువు కొద్దిగా తగ్గింది. మందులు మానేసిన 4 నెలల్లో మళ్లీ బరువు పెరిగింది. ఎంతలా అంటే ఉండాల్సిన బరువు కంటే ఏకంగా 10 కిలోలు అధికమైంది. తీవ్ర అలసటతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఈ పద్ధతి ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అసలు జీఎల్పీ 1 ఎనలాగ్ అంటే ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

చెవిలో అదే పనిగా 'మోత' మోగుతోందా? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు!
జీఎల్పీ1 ఎనలాగ్స్ అంటే : 'జీఎల్పీ 1 ఎన్లాగ్' ఓ ఔషధం. ఇది 'జీఎల్పీ' అనే హార్మోన్‌పై నేరుగా పనిచేసి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఈ ఔషధం, ఆకలిని తగ్గించేస్తుందట. కొంచెం తినగానే ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీంతో ఇన్సులిన్ పనితీరు మెరుగై షుగర్ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చని తేలడంతో ఒబెసిటీతో బాధపడేవారు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, షుగర్, ఒబెసిటీ.. రెండూ ఉన్నవారిలో ఇది బాగా పనిచేస్తుందంటున్నారు.
- అయితే దీనిని డాక్టర్లు సలహా లేకుండా వాడకూడదట. కానీ, కొందరు యువత ప్రిస్కిప్షన్ లేకుండా, ఇష్టానుసారంగా మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. బరువు తగ్గించుకోవడానికి మూడు లేదా నాలుగు ఇంజక్షన్లు తీసుకోవడం, తర్వాత ఆపేయడం చేస్తున్నారు. ఫలితంగా, తాత్కాలికంగా బరువు తగ్గినా, మందులు ఆపేయగానే.. ఆకలి రెట్టింపై, ఎక్కువ తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరుగుతున్నారు. మందులు వాడి 2 కిలోలు తగ్గితే, ఆపేసిన తర్వాత 5 కిలోలు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మందులు ఆపేసిన తర్వాత బరువు తిరిగి పొందడం నెలకు సుమారు 0.3 కిలోలు (0.7 పౌండ్లు) వేగంగా ఉందని University of Oxford అధ్యయనం పేర్కొంది.

సైడ్ ఎఫెక్ట్లు చాలా?:
- కండర పుష్ఠి దెబ్బతినే అవకాశం ఉంది.
- బాగా నీరసంగా అనిపిస్తుంది.
- కఠిన వ్యాయామాలు చేయలేరు.
- కడుపు ఉబ్బరం, తేన్పులు, వికారం
- తీవ్రమైన నీరసం, మలబద్ధకం
- పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే జీర్ణకోశ సమస్యలున్న వారు ఈ మందులు అసలు తీసుకోకపోవడం మంచిది.
- ఎక్కువ రోజులు వాడితే కొందరిలో 'ఆప్టిక్ న్యూరెటిస్' అనే కంటి సమస్య కూడా వస్తుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
- పిల్లలకు ఈ ఔషధాలను వినియోగించడం మంచిది కాదు. థైరాయిడ్ క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్ ఉన్నవారు కూడా ఈ మందులను వాడొద్దంటున్నారు నిపుణులు.
బరువు తగ్గించుకోవడం కోసం 'జీఎల్పీ-1 ఎనలాగ్' ఔషధాలను ఇప్పుడు వినియోగించడం ట్రెండ్‌గా మారింది. వీటితో ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. ఆపేస్తే అంతకంటే వేగంగా తిరిగి బరువు పెరుగుతారు. దీనివల్ల ప్రయోజనం కంటే, అనర్థాలే ఎక్కువ. 80-90 శాతం మంది యువత ఊబకాయాన్ని సాధారణ పద్ధతుల ద్వారానే తగ్గించుకోవచ్చు. వీరిలో జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. అందుకే సహజసిద్ధంగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలే తప్ప, ఇలాంటి మందుల జోలికి వెళ్లొద్దు. ఒకవేళ ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే, వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాలి- డాక్టర్ రాకేశ్ కలపాల, ఏఐజీ హాస్పిటల్స్‌లో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్

సహజ మార్గాలే మేలు :
- ప్రొటీన్స్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండే సమతులాహారాన్ని తీసుకోవాలి.
- సాధ్యమైనంత వరకూ జంక్‌ఫుడ్‌కు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
- రోజూ క్రమం తప్పకుండా కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి
- నిద్ర, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే 3-6 నెలల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - హార్ట్ ఫెయిల్యూర్ వార్నింగ్స్ కావొచ్చట!
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలా? - ఆహారం విషయంలో ఈ పొరపాట్లు వద్దంటున్న నిపుణులు!

