ETV Bharat / health

టీ, కాఫీలను అతిగా తాగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనట!

-ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Tea and Coffee
Tea and Coffee (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 10, 2026 at 2:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tea and Coffee Consume Effects: అమృతమైనా సరే అతిగా తీసుకుంటే విషంగా మారుతుంది. కాఫీ, టీ విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. అలసటను పోగొట్టి, శరీరంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే కాఫీ, టీలను అతిగా తాగితే ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పానీయాలను ఎందుకు అతిగా తాగొద్దు? ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

ఎక్కువగా తాగుతున్నారా?: మనం కాఫీ లేదా టీ తాగిన వెంటనే అందులోని కెఫెన్ కేవలం 20 నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆపై నేరుగా మెదడుకు చేరుకుంటుందట. మన శరీరంలో అలసటను గుర్తించి నిద్ర రప్పించే అడినోసిన్ అనే రసాయనాన్ని మొద్దుబార్చేలా బ్లాక్ చేస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల మెదడుకి తాత్కాలికంగా ఉత్సాహాంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే, ఈ కెఫెన్ మోతాదు రోజుకు 400 మి.గ్రాలు అంటే సుమారు 3 నుంచి 4 కప్పులు దాటితే అది శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ అనే ఒత్తిడి హార్మోన్లను విపరీతంగా పెంచుతుందని వివరిస్తున్నారు. టీలోని కెఫెన్ అనేది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది, కొన్నిసార్లు ఇది కడుపు నొప్పి లేదా గుండెల్లో మంటకు దారితీస్తుందని medlineplus పేర్కొంది.

అతిగా కెఫెన్ తీసుకోవడం వల్ల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ అతిగా ఉత్తేజితమై తీవ్రమైన ఆందోళనకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు టీలో ఉండే టానిన్లు, కాఫీలోని ఆమ్లాలు మన జీర్ణాశయంలోని ఎండోమెట్రియం లాంటి సున్నితమైన మ్యూకస్ పొరను దెబ్బతీసి గ్యాస్ట్రిక్ యాసిడ్లను విపరీతంగా పెంచేస్తాయంటున్నారు. దీనివల్ల కడుపులో మంట, తీవ్రమైన ఎసిడిటీ ఇబ్బందిపెడతాయని పేర్కొంటున్నారు. కెఫెన్ ఒక మూత్రవిసర్జనకారి కూడా - ఇది మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుందని harvard.edu పేర్కొంది.

పిల్లల్ని కనడం 'వాయిదా' వేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనట!

కాఫీ లేదా టీ అనేది చేసే పద్ధతిని బట్టి ఆధారపడుతుంది. ఇవి కొంత వరకు మన ఆకలిని తగ్గిస్తాయి. టీ, కాఫీలో పాలు ఎక్కువగా ఉండి, డికాషన్ కొద్దిగా ఉంటే మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది రాదు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పాలలోని క్యాల్షియం, విటమిన్లను శరీరం గ్రహిస్తుంది. అయితే, కేవలం డికాషన్​తో కూడిన కాఫీ, టీలను తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు జంక్​ఫుడ్స్, మసాలాలు ఎక్కువగా తీసుకుంటాం. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి - డా. అంజలీ దేవి, పోషకాహార నిపుణులు

శరీరంలో వచ్చే మార్పులు : అతిగా కెఫెన్​కి అలవాటు పడితే శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఎక్కువగా అలవాటు పడినప్పుడు నిద్రలేమి సమస్యగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోవడం, చేతులు వణకడం, గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే చిరాకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తున్నారు. అంతేకాదు, కాఫీ, టీలోని కెఫెన్ టానిన్ రసాయనాలు మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్, క్యాల్షియంను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు. దీనివల్ల రక్తహీనత, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి : అతి సర్వత్ర వర్జయేత్ అనేది మనకు బాగా తెలిసిందే. కాఫీ, టీ విషయంలో కూడా ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాఫీ, టీలు వ్యసనంగా మారకుండా చూసుకోవాలంటున్నారు. రోజుకు రెండు కప్పుల మించి ఎక్కువ కాఫీ లేదా టీ తాగకూడదని అంటున్నారు. సాయంత్రంపూట అసలు కెఫెన్ జోలికే వెళ్లకూడదని సూచిస్తున్నారు. కాఫీకి బదులుగా గ్రీన్ టీ, లెమన్ టీ లేదా మజ్జిగా, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు. కెఫెన్ వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు. కాబట్టి రోజుకు తగినంత నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. కాఫీ, టీలను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రక్తం, హిమోగ్లోబిన్ పెరగాలంటే - ఏ పండ్లు తినాలో తెలుసా?

తినడానికీ ఓ లెక్కుందట! - ఎప్పుడు? ఎలా తినాలో తెలుసా?