"చెవిలో మోత" అధిక రక్తపోటుకు రిలేటివ్? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
చెవిలో అదే పనిగా 'మోత' మోగుతోందా? - హైబీపీ, రక్తప్రసరణ లోపాలు కారణం కావొచ్చట!

Published : July 14, 2026 at 4:28 PM IST
Could Ringing Ears Be Linked To BP Or Poor Circulation : బయట ఎలాంటి శబ్దం ఉండదు. కానీ, గర్జన, క్లిక్ మనే శబ్దం, బుసలు కొట్టినట్లు, గుసగుసలాడినట్లు లేదా తీవ్రమైన పిచ్ శబ్దంగా వినిపిస్తుంటుంది. చెవిలో మోత ఇలాగే వేధిస్తుంది. ఈ పరిస్థితిని టినిటస్ (Tinnitus)అని అంటారు. ఇది రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. శబ్ద కాలుష్యం, వయస్సు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపం ప్రధానమైనవి. ఈ క్రమంలో టినిటస్ అనేది అధిక రక్తపోటు లేదా రక్త ప్రసరణ సమస్యలతో కూడా ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
టినిటస్, అధిక రక్తపోటు మధ్య ఉన్న సంబంధం : అధిక రక్తపోటు కొన్నిసార్లు చెవుల్లో రింగింగ్ లేదా టినిటస్కు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే, రక్తపోటు పెరిగినప్పుడు, ఆ ఒత్తిడి చెవుల దగ్గర ఉండే సున్నితమైన రక్తనాళాల ద్వారా జరిగే రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అయితే, రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ నాళాల్లో వెళ్లే రక్తం వేగం పెరుగుతుందట. ఇది ఒక పల్సింగ్ లేదా రింగింగ్ శబ్దాన్ని సృష్టిస్తుంది. దీనిని పల్సటైల్ టినిటస్ అని అంటారు.
నిశ్శబ్ద వాతావరణంలో లేదా పడుకున్నప్పుడు ఈ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో, నియంత్రణ లేని రక్తపోటు రక్తనాళాలను దెబ్బతీస్తుందంటున్నారు. వాటి స్థితిస్థాపకతను తగ్గించడంతో పాటు లోపలి చెవికి రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది టినిటస్ను మరింత తీవ్రం చేస్తుంది.
రక్తప్రసరణ సమస్యల వల్లనే శబ్దం వస్తుందని ఎలా తెలుసుకోవాలి? : లోపలి చెవి సరిగ్గా పనిచేయడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం సరఫరా కావాలి. కాబట్టి, రక్త ప్రసరణ సమస్యలు కూడా చెవి రింగింగ్కు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల నాళాలు ఇరుకుగా మారడం (Atherosclerosis) వంటి పరిస్థితులు చెవి దగ్గర రక్త ప్రవాహంలో అడ్డంకులను సృష్టిస్తాయంటున్నారు. తద్వారా పల్సటైల్ టినిటస్కు కారణమవుతాయని పేర్కొంటున్నారు. తల, మెడ చుట్టూ ఉన్న రక్తనాళాలలో రక్త గడ్డకట్టడం, పుట్టుకతో వచ్చే రక్తనాళాల నిర్మాణ లోపాలు(వాస్యులర్ మాల్ ఫార్మేషన్లు) లేదా రక్తనాళాల గోడలు బలహీనపడటం (అనూరిజమ్స్) కూడా వినికిడిని ప్రభావితం చేయవచ్చు. ఆక్సిజన్ సరఫరాను తగ్గించే రక్తహీనత కూడా చెవులలో శబ్దాలను ప్రేరేపించవచ్చు. అంతేకాకుండా, మధుమేహం లేదా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల పేలవమైన రక్త ప్రసరణ లక్షణాలను మరింత దెబ్బతీస్తుంది.
డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకునేదెలా? - నిపుణులు ఏమంటున్నారంటే!
టినిటస్ గుండెకు సంబంధించినదని తెలిపే హెచ్చరిక సంకేతాలు : చెవుల్లో వచ్చే రింగింగ్ శబ్దం, గుండె కొట్టుకునే వేగానికి అనుగుణంగా, ఒక నిర్దిష్ట లయతో కూడిన పల్సింగ్ లక్షణాన్ని కలిగి ఉంటే, ఆ టినిటస్ గుండెకు సంబంధించినది కావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని పల్సటైల్ టినిటస్ అంటారు. రక్తప్రసరణ మార్పుల వల్ల ఈ శబ్దం మరింత ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా, పడుకున్నప్పుడు, ముందుకు వంగినప్పుడు లేదా శారీరక శ్రమ చేసిన తర్వాత ఈ రకమైన శబ్దం మరింత సృష్టంగా వినిపిస్తుందని పేర్కొంటున్నారు.
ఇతర హెచ్చరిక సంకేతాలు :
- రెండు చెవులపై ప్రభావం చూపడం
- కళ్లు తిరగడం
- శ్వాస ఆడకపోవడం
- ఛాతీ నొప్పి
- క్రమరహిత గుండె కొట్టుకోవడం
- వినికిడిలో అకస్మాత్తుగా మార్పులు రావడం
చెవులలో వచ్చే శబ్దం పల్స్ రేటుతో వస్తే, ముఖ్యంగా ఇది అకస్మాత్తుగా ప్రారంభమైనా లేదా వేగంగా తీవ్రమైన, అది అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ (రక్తనాళాలు గట్టిపడటం), లేదా రక్తనాళాల సమస్యల వంటి గుండె, రక్తప్రసరణకు సంబంధించిన లోపాలను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పరిశోధన మూలాలు :
https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC5050200/
https://my.clevelandclinic.org/health/diseases/23422-pulsatile-tinnitus
https://iamacf.org/can-hypertension-cause-tinnitus-signs-causes-and-remedies/
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కిడ్నీలను సైలెంట్‌గా దెబ్బతీసే 'ప్రోటీన్యూరియా' - పురుషులు గుర్తించాల్సిన కీలక లక్షణాలు ఇవేొ!
చదువు ఒత్తిడిలో అధిక ఆహారం - ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్న నిపుణులు!

