ETV Bharat / health

పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

- ఇవి రోజూ తింటే మంచిదంటున్న నిపుణులు! - పప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని సూచన

Pulses can Control Diabetes
Pulses can Control Diabetes (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : January 2, 2026 at 3:51 PM IST

4 Min Read
Choose ETV Bharat

Pulses can Control Diabetes : పెసర్లు, శనగలు, కందులు, బఠానీలు.. పప్పులు ఏవైనా సరే రుచిగానే ఉంటాయి. రుచిలో మాత్రమే కాకుండా, పోషకాల్లోనూ ముందుంటాయి. ప్రొటీన్ దండిగా ఉండే పప్పులతో కండ పుష్టి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, డయాబెటిస్ నిర్వహణలో కూడా పప్పులు, తృణధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందించడమే కాకుండా, వీటిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. శరీరంలోని కొవ్వును, కేలరీలను తగ్గించడంలో పీచు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పప్పుధాన్యాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్నే షుగర్ జబ్బు అంటారు. ఇది పెరిగితే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు మొదలు.. దృష్టి లోపం, ఊబకాయం వరకు ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి. పప్పుధాన్యాలు ఆహారంలో భాగం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా ఉంటుందని, తద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే, వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.

అన్నీ మర్చిపోతున్నారా? - ప్రతీది గుర్తుపెట్టుకోవాలంటే నిపుణుల సలహాలివే!

డయాబెటిస్ పేషెంట్స్​కి కలిగే ప్రయోజనం : భారతీయ ఆహారంలో పప్పులు ఒక ముఖ్యమైన భాగం. వీటిలో కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచవని అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్ చక్కెర నిదానంగా విడుదలయ్యేలా చేస్తాయని, ఇది గ్లైసెమిక్ నియంత్రణకు మేలు చేస్తుందని చెబుతున్నారు. మాంసాహారం తీసుకోని వారికి ప్రొటీన్ లభించడానికి పప్పులు ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. పప్పుధాన్యాలలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్‌గా మెల్లగా మారుతాయని diabetes.org.uk అధ్యయనం పేర్కొంది. అందువల్ల గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయని తెలిపింది.

ఏ పప్పులు మేలు చేస్తాయి? : ఈ రోజుల్లో అధిక బరువు, మధుమేహాన్ని అదుపు చేయడమే పెద్ద సవాలుగా మారింది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 55 కంటే తక్కువగా సూచించే ధాన్యాలను తీసుకుంటే బరువుతోపాటు డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పప్పుధాన్యాలు ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్, సంబంధిత సమస్యలను నివారించగలవని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

డయాబెటిస్ ఉన్నవారికి ఏ పప్పులు మేలు చేస్తాయి? :

శనగ పప్పు (chana dal) : దీని GI కేవలం 8 మాత్రమే. ఇందులో ప్రొటీన్లు, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయని తెలియజేస్తున్నారు.

రాజ్మా : దీని GI 19. ఇవి చర్మం, కళ్ల ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. ఇవి బీపీని నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడతాయని పేర్కొంటున్నారు.

పెసర పప్పు : ఇది అత్యంత ఆరోగ్యకరమైన పప్పులలో ఒకటి. గర్భిణులు, వృద్ధులు, ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిదంటున్నారు . ఇందులో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని సూచిస్తున్నారు.

శనగలు (Chickpeas/Chole): ఇవి రుచికరమైనవి. వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయంటున్నారు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 42 ఉంటుందని herringtonmc, Nhs.uk అధ్యయనం పేర్కొంది.

ఇవి కూడా :

బార్లీ : GI 25-30 మధ్యలో ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గట్​ హెల్త్​ని ఆరోగ్యంగా ఉంచుతూ అధిక బరువుని అదుపు చేస్తాయని చెబుతున్నారు.

కొర్రలు : వీటిని ఆయుర్వేదంలో శ్రీధాన్యాలుగా పిలుస్తారు. కొర్రల్లో GI 30-35 మాత్రమే. టైప్ 2 డయాబెటిస్​ని అదుపు చేసేందుకు ఇవి చక్కగా దోహదపడతాయని పేర్కొంటున్నారు. ఫైబర్, ఐరన్​తో పాటు కాల్షియం అందిస్తాయని తెలియజేస్తున్నారు. బ్రౌన్ టాప్(అండు కొర్రలు) మిల్లెట్​లో గ్లైసెమిక్ GI 20 మాత్రమే. వీటిల్లో అనేక మైక్రోన్యూట్రియెంట్లు ఉంటాయని, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయని తెలియజేస్తున్నారు. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయని పేర్కొంటున్నారు.

సామలు : ఇవి అనేక పోషకాలను అందిస్తాయి. 50-52 మాత్రమే ఉండే GI గ్లూకోజ్ గ్రాహకాలను అదుపు చేస్తాయని చెబుతున్నారు. మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి వంటి వాటిని అందిస్తాయంటున్నారు. అంతేకాదు, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంతో పాటు బరువుని తగ్గిస్తాయని వివరిస్తున్నారు.

ఊదలు : 41-50 వరకూ GI ఉంటుంది. వీటిల్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని చెబుతున్నారు. పూర్తి ఆరోగ్యాన్ని సమకూర్చడంతోపాటు మధుమేహాన్ని అదుపు చేస్తాయని తెలియజేస్తున్నారు.

ఎమ్మెర్ గోధుమ (ఖప్లీ గోధుమ) : GI 40-45 సూచిస్తుంది. మధ్యాహ్నం భోజనానికి వీటితో చేసిన రొట్టెలను తీసుకుంటే బరువు, షుగర్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇతర ధాన్యాల పిండితో కలిపి కూడా దీన్ని ఉపయోగించొచ్చని సలహా ఇస్తున్నారు.

బక్వీట్ (కుట్టుగోధమ) : GI 45-51. పీచు పదార్థం అధికంగా ఉంటుందట. రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయని, నెమ్మదిగా జీర్ణమవుతాయని తెలియజేస్తున్నారు. మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'స్మైలింగ్ డిప్రెషన్' కారణాలు ఇవే - ఇలా చేస్తే తరిమికొట్టొచ్చంటున్న నిపుణులు!

"పీరియడ్స్​ పెయిన్" భరించలేకున్నారా? - ఆ టైంలో ఏం చేయాలంటే!