ETV Bharat / health

ఎక్సర్​సైజ్​ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన!

-వ్యాయామంతో పాటు భద్రత ముఖ్యమని సూచన -ఎక్సర్​సైజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Precautions for Exercise
Precautions for Exercise (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 11, 2026 at 7:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

Precautions for Exercise: ఫిట్‌నెస్‌ బాగుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. దీనికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాకింగ్​, రన్నింగ్​, బస్కీలు, పుషప్స్​ వంటి ఎక్సర్​సైజ్​లు శారీరక సామర్థ్యం పెరగడానికి బెస్ట్​. అయితే వీటిని సక్రమంగా చేయటం ముఖ్యం అంటున్నారు నిపుణులు. వ్యాయామాలు మొదలుపెట్టేటప్పుడైనా, ముందు నుంచీ చేస్తున్నా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే గాయాల పాలవ్వకుండా.. వ్యాయామ ప్రయోజనాలను మరింత ఎక్కువగా పొందొచ్చంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్సర్​సైజ్​లు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం

సన్నద్ధత ముఖ్యం: వ్యాయామాలు మొదలు పెట్టే 10 నిమిషాల ముందు శరీరాన్ని అందుకు తగినట్లుగా ప్రిపేర్​ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్​ హెల్త్​ పబ్లిషింగ్​ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే శరీరాన్ని ముందుకూ వెనక్కూ, అటూ ఇటూ వంచటం, సాగదీయటం మంచిదంటున్నారు. మోకాలును పైకెత్తి కడుపు వద్దకు తేవటం, చేతులను చాచి పక్కలకు తిప్పటం వంటివీ చేయొచ్చంటున్నారు. ఇలా చేయడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్‌ మరింతగా అందుతుందని, బిగుసుకున్న కండరాలు, కీళ్లు వదులవుతాయంటున్నారు. అలాగే కదలికలు సాఫీగా సాగుతాయని వివరిస్తున్నారు.

నొప్పి లేకుండా: కాళ్లు, చేతులను కదిలించేటప్పుడు ఆరంభంలో సౌకర్యంగా ఉండేలా, నొప్పి పుట్టకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నొప్పి లేనంతవరకు కదలికలను పెంచుకోవచ్చని, కానీ నొప్పి అనిపిస్తే మాత్రం అక్కడి వరకు పరిమితం చేసుకోవాలంటున్నారు. సామర్థ్యం పెరిగిన కొద్దీ క్రమంగా పెంచుకుంటూ రావొచ్చని సూచిస్తున్నారు.

నెమ్మదిగా: చేయాలి కదా అని ఫాస్ట్​ఫాస్ట్​గా ఎక్సర్​సైజ్​లు మొదలుపెట్టకూడదని, వ్యాయామాలను ఎప్పుడైనా నెమ్మదిగానే ఆరంభించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కదలికలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉన్నట్టుండి, అదిరినట్టుగా కదిలితే కండరాలు, కండర బంధనాలు పట్టేయొచ్చని హెచ్చరిస్తున్నారు.

దృష్టి పెట్టాలి: వ్యాయామాలు చేస్తున్నప్పుడు దృష్టిని మళ్లించరాదని హెచ్చరిస్చున్నారు నిపుణులు. ఏకాగ్రతతో గమనిస్తూ చేస్తే శరీర భంగిమ, అమరిక గతి తప్పకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.

శ్వాసను ఆపొద్దు: బ్యాండుతో లాగటం వంటి రెసిస్టెన్స్‌ వ్యాయామాలు చేసేటప్పుడు చాలామంది శ్వాసను ఆపుతుంటారు. కానీ ఇలా చేయొద్దంటున్నారు. ఎందుకంటే శ్వాసను ఆపితే రక్తపోటు పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే బరువు ఎత్తటం వంటివి చేస్తున్నప్పుడు శ్వాసను వదలాలని.. బరువు దించుతున్నప్పుడు శ్వాస తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలసట వస్తే ఆపెయ్యాలి: వ్యాయామం అతిగా చేస్తున్నారనటానికి అలసట, నీరసం సంకేతం కావొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే ఆపెయ్యాలని సూచిస్తున్నారు.

నెమ్మదిగా ముగించాలి: వ్యాయామాలను ఉన్నట్టుండి ఆపేయ్యొద్దని, నెమ్మది నెమ్మదిగా ముగించాలని తెలుపుతున్నారు. ఉన్నట్టుండి ఆపేస్తే తల తేలిపోతున్నట్టు, తూలినట్టు అనిపించొచ్చని.. దీంతో కింద పడే ప్రమాదముందంటున్నారు. కాబట్టి కండరాలను సాగదీస్తూ వ్యాయామం ఆపాలని చెబుతున్నారు.

కీళ్లు వదులుగా: కాళ్లను, చేతులను తిన్నగా సాగదీసినప్పుడు మోకాళ్లు, మోచేతులు కాస్త వంగి ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మరీ అతిగా సాగదీస్తే కీళ్ల చుట్టూ ఉండే కండర బంధనాలు ఒత్తిడికి గురవుతాయని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆరోగ్యానికి "నడక" మంచిదే - కానీ ఈ పద్ధతుల్లో నడిస్తే మరికొన్ని ప్రయోజనాలు!

షుగర్ పేషెంట్లకు అలర్ట్ - "డిన్నర్" టైంలో ఇవి చాలా ప్రమాదకరమట!