ETV Bharat / health

డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకునేదెలా? - నిపుణులు ఏమంటున్నారంటే!

- ప్రెగ్నెన్సీ తర్వాత శారీరక, మానసిక మార్పులు - ఆహారంతోపాటు వ్యాయామమూ ముఖ్యమంటున్న నిపుణులు!

Postpartum Tummy
Postpartum Tummy (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 12, 2026 at 6:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Postpartum Tummy Reduction Tips : ప్రసవమయ్యాక కూడా పొట్ట కాస్త ఎత్తుగా ఉండడం చాలామందిని అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇది తగ్గి తిరిగి పూర్వపు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ, కొంతమందిలో ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్య అలాగే ఉండిపోతుంది. వీరు పొట్టను తగ్గించుకోవడానికి ఆహారం తక్కువగా తీసుకోవడం, డైటింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ, ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ తర్వాత పొట్టను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

పొట్ట ఎందుకు వస్తుందంటే? : ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదుగుదలకు తగ్గట్టుగా పొట్ట కండరాలు సాగుతాయంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చీపురుపల్లి వసుంధర. వాటికి తగ్గట్టుగానే శరీరంలో కొవ్వు నిల్వలూ పెరుగుతాయని చెబుతున్నారు. బిడ్డ పుట్టాక పాలు తయారవ్వాలన్నా, తగినంత గ్లూకోజ్ అందాలన్నా ఈ కొవ్వు తప్పనిసరని పేర్కొంటున్నారు. అందుకే, పొట్ట దగ్గర మందంగా తయారవుతుందని తెలియజేస్తున్నారు.

అయితే ప్రసవమయ్యాక పొట్ట తగ్గడానికి చాలా మార్గాలున్నాయని డాక్టర్ చీపురుపల్లి వసుంధర చెబుతున్నారు. బిడ్డకి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు వరకు పాలు ఇచ్చే వాళ్లలో సహజంగానే బరువు, పొట్ట తగ్గుతుందని చెబుతున్నారు. తల్లి శరీరంలో కెలోరీలు, కొవ్వు నిల్వలను కరిగిస్తూ చనుబాలు సిద్ధమవుతాయని తెలియజేస్తున్నారు. అందుకే, పిల్లలకు ఎక్కువకాలం పాలు ఇచ్చినప్పుడు వాళ్లంతట వాళ్లే తగ్గుతారని పేర్కొంటున్నారు.

గృహహింసకు - మెనోపాజ్​కు సంబంధం ఏంటి? - 20 నెలల ముందే రుతుక్రమం ఎందుకు ఆగిపోతుంది?

డైట్ ఒకటే సరిపోదు : కొంతమంది శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు మాత్రమే తల్లిపాలు ఇస్తుంటారు. ఆ తర్వాత మానేస్తుంటారు. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి ఆహారం తగ్గించుకోవడం, కఠినమైన డైట్ పాటిస్తుంటారు. ఇలా చేస్తే సరిపోదంటున్నారు డాక్టర్ చీపురుపల్లి వసుంధర. గర్భధారణ సమయంలో సాగిన పొట్ట కండరాలు తిరిగి మామూలు స్థితికి చేరాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొట్ట సంబంధిత వ్యాయామాలు చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, కొంతమందిలో శరీరతత్వం కూడా కారణమై ఉండొచ్చని తెలియజేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నిపుణులు సాయం తీసుకోవాలని అంటున్నారు. వ్యాయామం, యోగాతో కూడిన సరైన శారీరక శ్రమలో పాల్గొనడం బరువు నిర్వహణకు, కండరాల బలం పెంచడానికి సహాయపడుతుందని, తద్వారా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని National Library of Medicine పేర్కొంది.

సర్జరీ చేయించుకోవచ్చా? : కొంతమంది ఎంత ప్రయత్నించినా పొట్ట మాత్రం తగ్గదు. అలాంటి వారికి టమీ టకింగ్ అనే సర్జరీ చేస్తారని డాక్టర్ చీపురుపల్లి వసుంధర చెబుతున్నారు. దీనిలో పేరుకుపోయిన కొవ్వును తీసి, సాగిన పొట్ట కండరాలను సరిచేస్తారని అంటున్నారు. అయితే,ఆహారం దగ్గర నుంచి వ్యాయామం వరకూ అన్ని కఠిన నియమాలూ పాటించాలని పేర్కొంటున్నారు. చాలా ఏళ్ల పాటు ప్రయత్నించినా ఫలితం లేదు అన్నప్పుడే ఈ సర్జరీ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు పీల్చే గాలి సురక్షితమైనా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

ఒక్కొక్క అలవాటు ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తోందట! - మరి ఆ హ్యాబిట్స్​ ఏంటో తెలుసా?