నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న వైద్యులు!
కాళ్లకు రక్తం కొరత - తీవ్రమైన కొద్దీ ప్రమాదకరమంటున్న నిపుణులు

Published : October 24, 2025 at 8:50 AM IST
Lack of Blood to the Legs : చాలా మందికి నడుస్తున్నప్పుడు కాళ్లు, పిక్కల్లో ఒక మాదిరి నుంచి తీవ్రమైన నొప్పి. నడక ఆపేస్తే వెంటనే తగ్గిపోతుంది. మళ్లీ నడక మొదలెట్టగానే తిరిగి నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు పాదం వేళ్లు రంగు మారి, నల్లగా అవ్వచ్చు. కాళ్ల వాపూ తలెత్తొచ్చు. పాదాల మీద పుండ్లూ పడుతుంటాయి. మలాములు, క్రీములు ఎన్ని రాసినా ఒక పట్టాన మానవు. నెలలు, ఏళ్ల కొద్దీ వేధిస్తూ వస్తుంటాయి. ఏమైందో తెలియక చాలామంది చిట్కాలను, నాటు వైద్యాలను ఆశ్రయిస్తుంటారు. ఫలితం కనిపించక డాక్టర్లనూ మారుస్తుంటారు. ఇంతకీ ఈ సమస్యలకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మన శరీరం సజావుగా పనిచేయటానికి అన్ని అవయవాలకూ రక్తం సరఫరా కావటం చాలా ముఖ్యం. రక్తనాళ వ్యవస్థ సరిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ పూడికలతో రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకున్నా, పూర్తిగా మూసుకున్నా చిక్కులు తప్పవంటున్నారు నిపుణులు. కాలి రక్తనాళాల్లో ఇలాంటివి తలెత్తితే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని పరిధీయ ధమని వ్యాధి(PAD) ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఇందుకు పొగ తాగటం, డయాబెటిస్ దగ్గరి నుంచి పాత పుండ్ల వరకూ రకరకాల అంశాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు.
మధుమేహంతో : ఈ సమస్య ఉన్నవారికి నాడులు, రక్తనాళాలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. దీంతో పాదాలు తిమ్మిరెక్కినట్టు, సూదుల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పిగా ఉంటుందని mayoclinic అధ్యయనం పేర్కొంది. దీంతో రక్త సరఫరా గణనీయంగా తగ్గిపోయిందని భావించాలని సూచిస్తున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో రక్తనాళాల గోడల్లో నిరంతరం క్యాల్షియం, కొలెస్ట్రాల్ పోగుపడుతూ వస్తుంటుందని పేర్కొంటున్నారు. ఇవి పూడికలుగా ఏర్పడటం వల్ల కాళ్లకు రక్త సరఫరా తగ్గుతుందని వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళం పూర్తిగా మూసుకుపోవచ్చని, ఇది తీవ్రమైన నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ మెల్లిటస్ ఉండటం PAD ప్రమాదాన్ని బాగా పెంచుతుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
కాళ్లు ఉబ్బినా సంకేతమే : సిరల ద్వారా చెడు రక్తం గుండెకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్లి, ఆక్సిజన్‌ను నింపుకొని తిరిగి గుండెకు చేరుకుంటుంది. ఇది ధమనుల ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతుంది. ఈ ప్రక్రియ శరీరంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ కాలి సిరల్లో అడ్డకులు ఏర్పడినా, కుంచించుకు పోయినా చెడు రక్తం పైకి చేరటం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాళ్లు ఉబ్బటం మొదలవుతుందని అంటున్నారు. కాళ్లుకు రక్త సరఫరా తక్కువగా ఉంటే పాదాలు లేదా వేళ్లపై నయం కాని పుండ్లు ఏర్పడతాయని clevelandclinic అధ్యయనం పేర్కొంది.
నడుంనొప్పి వస్తోందా? : పొగ తాగేవారిలో, పొగాకు నమిలేవారిలో, మధుమేహం గలవారిలో కొందరు నడుస్తున్నప్పుడు వెన్నులో లేదా తొడలో నొప్పి వస్తుంటుందని చెబుతుంటారు. వీరిలో చాలా మందిలో కడుపు వద్ద బృహద్ధమని మూసుకోవటం లేదా కుంచించు పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రధాన రక్తనాళం కుంచించుకున్నా, పూర్తిగా మూసుకున్నా వీపు కండరాలకు రక్త సరఫరా తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా, నడుం నొప్పి వస్తుందని అంటున్నారు. వీపు కండరాలకు రక్త సరఫరా తగ్గితే పాదాలకూ తగ్గుతుందని తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు నడుం నొప్పితో పాటు పాదాల్లోనూ నొప్పి పుడుతుందని వివరిస్తున్నారు.
రక్తనాళ గోడల వాపుతోనూ : కొంతమందిలో రక్తనాళాల గోడల్లో వాపు తలెత్తొచ్చు. దీంతో లోపలి మార్గం సన్నబడుతుందంటున్నారు నిపుణులు. దీంతో రక్త ప్రసరణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రక్త ప్రసరణ మెరుగవ్వటానికి సమయానికి తగు చర్యలు తీసుకోకపోతే పాదం వేళ్ల చర్మం రంగు మారుతుందని తెలియజేస్తున్నారు. ఎందుకంటే, రక్త సరఫరా కాకపోవటం వల్ల వేళ్లు కుళ్లిపోతాయని పేర్కొంటున్నారు. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంటుందని తెలియజేస్తున్నారు.
కాలి రక్తనాళాలు సంకోచించినా, పూర్తిగా మూసుకున్నా వెంటనే వ్యాస్కులర్ సర్జన్‌ను సంప్రదించాలి. సమస్య తీవ్రతను బట్టి చికిత్సను నిర్ణయిస్తాం. రక్తాన్ని పలుచగా చేసే మందులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు, నొప్పి మందులు మేలు చేస్తాయి. వీటితో ఫలితం రాకపోతే సర్జరీ అవసరం. రక్తనాళంలో కొద్ది భాగంలోనే పూడికలు ఉంటే స్టెంట్ వేస్తాం. దీని ద్వారా పాదాలకు తిరిగి రక్త సరఫరా పుంజుకుంటుంది. ఒకవేళ పూడిక ఎక్కువగా ఉండే బైపాస్ సర్జరీ అవసరం. ఇందులో వేరే చోటు నుంచి రక్తనాళాన్ని తెచ్చి, పూడికకు అటూ, ఇటూ అతికిస్తాం. దీంతో రక్త సరఫరా మెరుగవుతుంది. వయసు, సమస్య తీవ్రత, ఇతర జబ్బులను పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తాం - డా.కె.కె పాండే, వ్యాస్కులర్ & కార్డియోథొరాసిడ్ సర్జన్
తీవ్రమైన కొద్దీ ఇబ్బందీ : నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వస్తోందంటే కాళ్లకు గణనీయంగా రక్త ప్రసరణ తగ్గిందనే అనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు పాదాలు నొప్పి పుడుతున్నాయంటే సమస్య ప్రమాదకర స్థితికి చేరిందని హెచ్చరిస్తున్నారు. పాదాలకు 90% వరకూ రక్త ప్రసరణ తగ్గిందనే అనుకోవాలని, పరిస్థితి అలాగే కొనసాగితే వేళ్లు, పాదాలకు రక్త సరఫరా నిలిచిపోయి, ఆ భాగాలు కుళ్లిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే ఆయా భాగాలను తొలగించాల్సి వస్తుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"అధిక కొలెస్ట్రాల్"తో బాధపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!
కీళ్ల వాపుతో బాధపడుతున్నారా? - తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనట!

