రేగుపండ్లు అంటే ఇష్టమా? - వీటిని తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
రేగుపండ్లను ఔషధాల గనిగా చెబుతోన్న నిపుణులు - వీటిని తినడం వల్ల ఏఏ లాభాలు ఉన్నాయో వివరణ!

Published : January 3, 2026 at 1:52 PM IST
Plum Fruit Benefits: తీపి, పులుపు, వగరు కలగలిసిన రుచితో ఉండే రేగుపండ్లు అంటే అందరికీ ఇష్టమే. ఈ సీజన్లో ఎక్కడ చూసిన బండ్లపై కనిపిస్తుంటాయి. ఈ పండ్లు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిలో ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో రేగుపండ్లు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
రోగనిరోధక శక్తికి : ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. దీంతో శరీరంలో ఉత్పత్తయ్యే హానికర ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే, ఇందులోని లిగ్నిన్ పీచు సైతం యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి రోగనిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడుతుందని తెలియజేస్తున్నారు. తద్వారా శరీరానికి వ్యాధుల మీద తిరగబడే శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ రెండు గుణాలవల్ల రేగుపండు డయాబెటిస్, గుండెజబ్బుల నుంచి రక్షిస్తుందని చెబుతున్నారు. ఇంకా, జలుబూ, ఫ్లూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందంటున్నారు.
కాబోయే అమ్మకు పురిటి నొప్పుల భయం - సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలివే!
నిద్రకి : రేగు పండ్లలో ఉండే 'శాపోనిన్' అనే పదార్థం మెదడును ప్రశాంతపరుస్తుందంటున్నారు నిపుణులు. ఇది సహజంగా నిద్ర పట్టేలా చేసి, నిద్రలేమి (Insomnia) సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా, దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు మంచి ఔషధమని సూచిస్తున్నారు. ఈ పండ్లతో మరిగించిన టీ తాగినా మంచిదంటున్నారు. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో రేగుపండ్లను నిద్రలేమి, ఆందోళన, మరిన్నింటికి నివారణగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారని clevelandclinic అధ్యయనం పేర్కొంది.
క్యాన్సర్లకి: రేగులోని విటమిన్-సికి యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఈ పండ్ల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ను పేగు, గర్భాశయ, అండాశయ, రొమ్ము, చర్మ, కాలేయ క్యాన్సర్ల నివారణలో వాడినప్పుడు.. ఆయా కణాలను నాశనం చేసినట్లు స్పష్టమైందట.
జీర్ణసంబంధిత వ్యాధులకి: రేగు పండ్లలో అధికంగా ఉండే పీచు పొట్ట గోడల్ని సంరక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా హానికర బ్యాక్టీరియా, అల్సర్ల నుంచి కాపాడుతుందంటున్నారు. ఈ పండు మంచి ప్రొబయోటిక్‌గానూ పనిచేసి, పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఫలితంగా, కడుపులో మంటని తగ్గిస్తుందని వివరిస్తున్నారు. వీటి రసం నోటి పుండ్లు, గొంతు మంటనీ నివారిస్తుందని తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ పండ్లు ఆకలినీ తగ్గిస్తాయట. తద్వారా బరువుని నియంత్రించుకోవచ్చని అంటున్నారు.
అందానికి : రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు రేగుపండ్లలో ఉండటంతో చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి ముఖంపై గీతలు, ముడతలను రానివ్వకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతాయని చెబుతున్నారు. అలాగే, ముందస్తు వృద్ధాప్య ఛాయలను దరికి చేరనీయవని తెలియజేస్తున్నారు. వీటిలోని పోషకాలు జుట్టు రాలకుండా కాపాడతాయని పేర్కొంటున్నారు.
ఈ ప్రయోజనాలు కూడా! :
- రేగు పండ్లలో పొటాషియం, ఫ్లోరైడ్, ఇనుము పుష్కలంగా ఉంటుందని researchgate అధ్యయనం పేర్కొంది. పొటాషియం కణాలు, శరీర ద్రవాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండి, హృదయ స్పందన రేటును, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని తెలిపింది.
- ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే ఐరన్, ఫాస్పరస్‌లు రక్తకణ వృద్ధికి తోడ్పడటం ద్వారా రక్తహీనతనీ తగ్గిస్తాయి.
- ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ పండ్లను తీసుకొంటే.. వీటిలోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢంగా ఉంచుతాయని.. కీళ్లకు సంబంధించిన పలురకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు ఔషధంలా పనిచేస్తుందని అంటున్నారు. రేగు పండ్లలోని విటమిన్ సి , విటమిన్ కె, పొటాషియం వంటి పోషకాలు ఎముకలను బలపరుస్తాయని clevelandclinic అధ్యయనం పేర్కొంది.
- రక్తప్రసరణ సజావుగా జరిగి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దరిచేరవు.
- కాలేయానికి సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
- వీటిలోని పీచు జీర్ణాశయం పనితీరును మెరుగుపరిచి అజీర్తిని తగ్గిస్తుంది.
- గర్భిణులకెదురయ్యే వికారం, వాంతులు వంటి సమస్యలకు ఇది ఉపశమనాన్నిస్తుంది.
- మెనోపాజ్‌లోకి అడుగుపెట్టేటప్పుడు డి విటమిన్ తగ్గి ఎదురయ్యే కండరాల సమస్యలకు ఈ పండుతో చెక్ పెట్టొచ్చు. నెలసరిలో అధికస్రావాన్ని ఈ పండు తీసుకోవడం ద్వారా తగ్గించొచ్చని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
'స్మైలింగ్ డిప్రెషన్' కారణాలు ఇవే - ఇలా చేస్తే తరిమికొట్టొచ్చంటున్న నిపుణులు!

