చిన్న చిన్న వాటికే భయపడుతున్నారా? - ఈ సలహాలు పాటిస్తే ఫోబియా నుంచి బయటపడవచ్చట!
-ఆ భయాలు తొలగిపోవాలంటే - శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!

Published : November 8, 2025 at 12:46 PM IST
Phobia Types and Treatment: పైకి ఎంత గంభీరంగా కనిపించినా, భయంలేని మనుషులే ఉండరు. కొంతమందిలో మాత్రం అది తీవ్రమై ఫోబియాగా మారుతుంది. మనసు పొరల్లో అలజడి రేపి ఆత్మహత్మ దాకా తీసుకెళుతుంది. అందుకే అతిగా భయపడేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఫోబియాతో బాధపడుతున్నవారు ఏ దశలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వివాహితకు ఎప్పటి నుంచో చీమలను చూస్తే అంతులేని ఆందోళన. చివరకు ఈ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారు. చీమలకు అంతలా భయపడాలా అని చాలా మంది అనుకోవచ్చు. అయితే, ఈ భయం ఒక మానసిక రుగ్మత అని అంటున్నారు నిపుణులు. కొందరికి బల్లులంటే, మరికొందరికి బొద్దింకలంటే, ఇంకొందరికి చీకటి అంటే భయం. ఇలా చాలా మందిని ఏదో ఒక భయం వెంటాడుతుందని చెబుతున్నారు.
కానీ, ఈ ఫోబియాలతో కొందరు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. చివరికి కుంగుబాటుకు గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. వాస్తవానికి, చిన్నప్పుడే ఈ ఫోబియాలు ప్రారంభమవుతాయంటున్నారు నిపుణులు. చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతాయని వెల్లడిస్తున్నారు. మరికొందరిలో మెదడు పొరల్లో నాటుకుపోయి వయసుతో పాటు పెరిగి తీవ్రమవుతాయని తెలియజేస్తున్నారు. చిన్న వయసు నుంచే సరైన చికిత్స అందించడం ద్వారా ఇలాంటి భయాలను పూర్తిగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.

డాక్సీసైక్లిన్తో 'స్కిజోఫ్రీనియా' ముప్పు తగ్గుతుందా? - తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
ఫోబియా రకాలు :
అరాక్నో ఫోబియా : సాలెపురుగులంటే భయం
సైనో ఫోబియా : కుక్కలంటే భయం
ఎంటమో ఫోబియా : కీటకాలను చూస్తే భయం
ఓఫిడియో ఫోబియా : పాములంటే భయం
మిర్మికో ఫోబియా : చీమలను చూస్తే భయం
ఆక్రో ఫోబియా : ఎత్తయిన ప్రదేశాలంటే భయం
అగోరా ఫోబియా : బహిరంగ ప్రదేశాల్లో భయం
ఆస్ట్రో ఫోబియా : ఉరుములు, మెరుపులు చూస్తే భయం

ఫోబియా లక్షణాలు :
- హృదయ స్పందన పెరగడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- శరీరంలో వణుకు
- చెమటలు పట్టడం
- స్పృహ కోల్పోవడం
- తీవ్రమైన మానసిక ఆందోళన
వయసుల వారీగా :
- యుక్త వయసు వారిలో - 16 %
- మధ్య వయసులో - 2-6 %
- 60 ఏళ్లు దాటిన వారిలో - 3-5 %
ఫోబియాలకు చిన్న వయసులోనే బీజం పడుతుంది. చంటి పిల్లాడు మారం చేస్తే, అదిగో చీకట్లో బూచోడు ఉన్నాడని, తినకపోతే దయ్యం తీసుకుపోతుందని ఇలా పిల్లలకు పదేపదే చెప్పడం వల్ల పిల్లల్లో అనవసర భయాలు నాటుకుంటాయి. కొందరిలో పెద్దయినా అవిపోవు, మరికొందరిలో తీవ్రమైన ఫోబియాగా మారతాయి. సాధ్యమైనంత వరకు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం అలవాటు చేయడంతో అనవసర భయాలు, భ్రమలకు లోనుకారు. సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఎక్స్పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సూచిస్తాం-డాక్టర్ అనిత, సూపరింటెండెంట్, ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం

ఏ దశలో, ఏ చికిత్స :
- కొన్ని ఫోబియాలు అవి అనుభవంలోకి వచ్చినప్పుడే మొదలవుతాయి. తర్వాత ఈ పరిస్థితి ఉండదు. కొన్ని మాత్రం నిరంతరం వెంటాడుతూ ఉంటాయి.
- ఒక దశలో తీవ్ర కుంగుబాటుకు గురవుతారు. పదేపదే భ్రమలోకి జారి పోతుంటారు. నాకే ఇలా ఎందుకు జరుగుతోందని అనుకుంటూ, తీవ్ర ఆవేదన చెందుతుంటారు.
- సమస్య తీవ్రతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. తరచూ భయపడడం, కుంగుబాటుకు గురికావడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి
- ఎక్స్ఫోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్స్ఫోజర్ థెరపీలో భయపడే విషయాలపై నెమ్మదిగా రోగిని ఎక్స్పోజ్ చేస్తారు. తొలుత వీడియాలు చూపించడం, తర్వాత వాటితో కొంత సమయం గడిపేలా చేయడం ద్వారా భయం పోగొడతారు.
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ చికిత్సలో భాగంగా ఏది వాస్తవం, ఏదీ భ్రమ అనేది రోగికి తెలిసేలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ భయం నుంచి భయట పడతారు. ఆందోళన, భయం తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రం మందుల ద్వారా చికిత్స అందిస్తారు.
- చురుగ్గా ఉండడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మద్యం, మద్యక ద్రవ్యాల జోలికి వెళ్లకపోవడం, ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావడం వల్ల క్రమేపీ ఈ ఫోబియాలను నుంచి దూరం కావచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎప్పుడూ టీ, కాఫీలనే తాగుతున్నారా? - ఈ "హెర్బల్ టీ" లు ట్రై చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందట!
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి? - నిపుణుల సమాధానమిదే!

