ETV Bharat / health

అలా చేస్తే పంచదార నీళ్లైనా ప్రమాదమే! - పసికందు ఆరోగ్యానికి పాటించాల్సిన నియమాలు ఇవి!

'న్యూ బార్న్ బేబీ కేర్ గైడ్' - మొదటి ఆరు నెలలు ముఖ్యం - శిశువుల సంరక్షణలో ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

Baby Care Guide
Baby Care Guide (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 20, 2026 at 5:21 PM IST

4 Min Read
Choose ETV Bharat

Parents and Grandparents Baby Care Guide : ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా బాడంగిలో ఆరోగ్యంగా పుట్టిన శిశువు ఏడుస్తున్నాడని ఇటీవల కుటుంబ సభ్యులు పటిక పంచదార నీరు తాగించారు. నీరు పట్టే విధానం సక్రమంగా లేకపోవడంతో, ఆ నీరు శిశువు ఊపిరితిత్తుల్లోకి చేరి, ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో శిశు సంరక్షణపై అవగాహన లేక ఆయుష్షు ఆదిలోనే తీరిపోయింది. చిన్నారుల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. నవజాత శిశు సంరక్షణలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అయితే, శిశువు జన్మించిన తర్వాత మొదటి ఆరు నెలల కాలంలో చిన్నారుల సంరక్షణలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు ఏం చేయాలి? ఏం చేయకూడదో? లాంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

Baby Care Guide
Baby Care Guide (Getty Images)

పాలు ఎలా పట్టాలి? : మొదటి ఆరునెలల పాటు శిశువుకు కచ్చితంగా తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. అయితే, గంట గంటకూ అక్కర్లేదు. చిన్నారులు ఏడ్చినప్పుడు లేదా ప్రతి 2-3 గంటలకు ఒకసారి పాలు పడితే చాలు. ఒకవేళ తల్లిపాలు లేకపోతే, డాక్టర్ సలహా మేరకు ఫార్ములా ఫీడ్ అంటే పాలపొడి వంటివి ఇవ్వాలి. అంతేకానీ, ప్యాకెట్ పాలు లేదా చక్కెర నీళ్లు వంటివి అసలు ఇవ్వకూడదు. ఒకవేళ బాటిల్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తే 100 శాతం ఫ్లాట్​గా పడుకోబెట్టి ఇవ్వొద్దు. అలాగే, బాటిల్​ను శుభ్రంగా కడిగి వాడుకోవాలంటున్నారు నిపుణులు.

తల్లి పడుకుని బిడ్డకు పాలు పట్టడం అత్యంత ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అవి ముక్కు లేదా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఎప్పుడూ కూర్చునే ఇవ్వాలట. పాలు ఇచ్చేటప్పుడు శిశువు తల భాగం 45 డిగ్రీల కోణంలో (కొద్దిగా పైకి) ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో తల్లి రొమ్ముపై ఉండే నల్లటి భాగం శిశువు నోటికి పూర్తిగా అందేలా పడితే పాలు బాగా వస్తాయి.

గది వాతావరణం, దుస్తులు : శిశువు ఉండే గదిలో ఫ్యాన్​ లేదా AC వాడుకోవచ్చు. కానీ, AC ఉష్ణోగ్రతను 26 డిగ్రీల కంటే తక్కువగా అసలు తగ్గించకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గది ఉష్ణోగ్రత మరీ చల్లగా లేదా వేడిగా ఉంచొద్దట. ఎప్పుడూ 25-26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, గదిలో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూసుకోవాలి. చిన్నారులకు దుస్తులను గట్టిగా బిగించి చుట్టకూడదు.

ఒత్తిడి వల్ల శరీరం విశ్రాంతి కోల్పోతుందా? - నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే మార్గాలు ఇవేనట!

Baby Care Guide
Baby Care Guide (Getty Images)

డాక్టర్​ని ఎప్పుడు సంప్రదించాలి? :

  • మాములుగా శిశువు 15-20 నిమిషాలు పాలు తాగితే సరిపోతుంది. అలాకాకుండా, శిశువు సరిగ్గా పాలు తాగకపోవడం, సగం కంటే తక్కువ తాగడం
  • మనం ఎంత బుజ్జగించినా, శిశువు గుక్కపట్టి ఏడవడం
  • జ్వరం రావడం
  • శరీరం, పెదవులు, నీలం రంగులోకి మారడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
  • పాలు తాగినా ప్రతిసారి పెద్ద మొత్తంలో వాంతులు చేసుకోవడం, కడుపు ఉబ్బిపోవడం
  • కడుపుపై చేయివేస్తే విపరీతంగా ఏడవడం
  • బొడ్డు నుంచి చీము కారడం లేదా రక్తం రావడం

శిశువు బరువు 2.5 కిలోల దాటిన తర్వాత రోజూ స్నానం చేయించొచ్చు. చిన్న ప్లాస్టిక్ టబ్​లో కూర్చోబెట్టి చేయించడం మంచిది. సంప్రదాయ పద్ధతి ప్రకారం, కాళ్లపై పడుకోబెట్టి స్నానం చేయించడం వల్ల ముక్కు, నోరు, చెవుల్లోకి నీరు వెళ్లే ప్రమాదముంది. 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను తల్లి తన గుండెలకు హత్తుకుని ఉంచాలి. ఇది శిశువుకు వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది తల్లిబిడ్డల మధ్య బంధాన్ని పెంచడమే కాకుండా, తల్లిలో పాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడుతుంది. - డాక్టర్​ పి. రవీందర్ రెడ్డి, సీనియర్ పిడియాట్రిషియన్

Baby Care Guide
Baby Care Guide (Getty Images)

శుభ్రత, సంప్రదాయ పద్ధతులు :

  • శిశువును తాకే ముందే ఇంట్లో ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకోవాలి లేదా శానిటైజర్ వాడాలి.
  • పసికందు ముక్కు, చెవులు, ప్రైవేట్ భాగాల్లో నూనెలు పోయడం లాంటివి అసలు చేయకూడదు.
  • కాటుక చిన్నారి శరీరం మీద ఎక్కడైనా పెట్టొచ్చు. కానీ కళ్లలో వద్దు.
  • బొడ్డు ఊడిపోయే వరకు దాన్ని పొడిగా ఉంచాలి. దానిపై ఆయిల్స్, లోషన్స్ లేదా పౌడర్లు రాయకూడదు.
  • సాంబ్రాణి పొగ వంటివి వేయవద్దు. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శిశువు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంటుంది.
Baby Care Guide
Baby Care Guide (Getty Images)

ఇలా పడుకోబెట్టండి :

  • వీలైతే శిశువు కోసం ప్రత్యేకంగా ఉండే ఊయల లేదా చిన్న బేబీకాట్ ఉపయోగించడం మంచిది.
  • ఒకవేళ మంచంపై తల్లి పక్కన పడుకోబెట్టుకున్నా, శిశువును గోడ వైపుగా ఉంచితే మేలు
  • ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటివి ఉంటే, అలాంటి వారు శిశువుకు దూరంగా ఉండాలి.
  • బేబీ ఫేస్​పై ఎవరూ ముద్దులు పెట్టొద్దు.
  • పెంపుడు జంతువుల్ని శిశువు ఉండే గదిలోకి రానివ్వకూడదు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

'సైలెంట్ కిల్లర్స్' - మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న అలవాట్లు ఇవేనట!