ETV Bharat / health

మొండి పుండ్లకు జెల్ చికిత్స! - తాజా అధ్యయనంలో కీలక విషయాలు!

పుండు మానడంలో ఆక్సిజన్​ది కీలక పాత్ర - పరిశోధకులు ఏం చెప్తున్నారంటే!

Healing Injuries
Healing Injuries (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : March 4, 2026 at 3:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Oxygen Delivering Gel Capable of Healing Injuries : ఎంతకీ మానని మొండి పుండ్లు పెద్ద సమస్య. వీటికి చికిత్స చేయటం చాలా కష్టం. ఒకవేళ పుండ్లు మానకపోతే పాదాలు, వేళ్లు తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. రోజు రోజుకీ వృద్ధులు, డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మొండి పుండ్ల కొత్త చికిత్సలకూ ప్రాధాన్యం ఏర్పడుతోంది. దీని విషయంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌ (UCR) రూపొందించిన జెల్‌ పట్టీ వ్యవస్థ కొత్త ఆశలు రేపుతోంది. గాయమైన చోట లేదా పుండ్లు ఉన్న చోట నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా చేయటం ద్వారా పుండ్లు మానేలా చేయటం దీని ప్రత్యేకత. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆక్సిజన్‌ పాత్ర : మాములుగా నాలుగు వారాల్లోపు నయం కాని పుండ్లను మొండిపుండ్లుగా భావిస్తుంటారు. ఈ రకం పుండ్లు నెలల కొద్దీ మానకుండా వేధిస్తుంటాయి. వీటితో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావటం, హాస్పిటల్​లో చేరాల్సి రావటం వంటి జరుగుతుంటాయి. కొన్ని సార్లు కాళ్లూ, చేతుల వంటివి తొలగించాల్సిన పరిస్థితీ కూడా ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.2 కోట్ల మంది మొండి పుండ్ల బారినపడుతున్నారని నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీరిలో సుమారు 20 శాతం మందికి పాదాలు, వేళ్ల వంటివి తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నాయి. పుండ్లు మానకపోవటానికి ఒక ప్రధాన కారణం.. ఆ భాగానికి తగినంతగా, స్థిరంగా ఆక్సిజన్‌ అందకపోవటమే అంటున్నారు నిపుణులు.

సాధారణంగా పుండు 4 దశలు ద్వారా మానుతుంటున్నారు నిపుణులు. ముందు వాపు ప్రక్రియ తలెత్తుతుందని, ఆ తర్వాత కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయని పేర్కొంటున్నారు. అనంతరం కణజాలం తిరిగి కుదురుకుంటుందని తెలియజేస్తున్నారు. ఆఖరికి కొత్త కణజాలం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని దశల్లోనూ ఆక్సిజన్‌ పాత్ర కీలకమంటున్నారు. ఆక్సిజన్‌ తగినంత అందకపోతే వాపు ప్రక్రియ ఎక్కువ కాలం కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తటానికి అనువైన వాతావరణం కల్పిస్తుందని తెలియజేస్తున్నారు. మరోవైపు కణజాలం తిరిగి కోలుకునే ప్రక్రియ కూడా నిలిచిపోతుందని వెల్లడిస్తున్నారు. దెబ్బతిన్న కణజాలం లోతుల్లోకి ఆక్సిజన్‌ చేరకపోతే మరింత సమస్యంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని పరిష్కరించటానికే UCR పరిశోధకులు కొత్త జెల్‌ వ్యవస్థను రూపొందించారు. మెత్తగా, మృదువుగా ఉండే ఇది గాయమైన భాగం వద్దే నిరంతరం నేరుగా ఆక్సిజన్‌ను సృష్టిస్తుందంటున్నారు పరిశోధకులు.

SMA ఒక ప్రాణాంతక వ్యాధి - ఎవరికి వస్తుందో తెలుసా?

ఎలా పనిచేస్తుంది? : జెల్‌ పట్టీలో నీరు, కొలిన్‌ ఆధారిత ద్రవం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. యాంటీ బ్యాక్టీరియా గుణం గల కొలిన్‌ ఆధారిత ద్రవం సురక్షితమైందని, తనకు తానే క్షీణిస్తుందని అంటున్నారు. వినికిడి సాధనాల్లో ఉండేటువంటి చిన్న బ్యాటరీతో అనుసంధానమైనప్పుడు ఈ వ్యవస్థ చిన్న విద్యుత్‌ రసాయన పరికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అప్పుడు నీటి అణువులు విడిపోయి నెమ్మదిగా, అవసరమైనంత మేరకు ఆక్సిజన్‌ పుట్టుకొస్తూ ఉంటుందని వివరిస్తున్నారు. ద్రవాలను పీల్చుకునే లేదా యాంటీ మైక్రోబియల్‌ పదార్థాలతో కూడిన సంప్రదాయ పుండ్ల పట్టీల మాదిరిగా కాకుండా ఇది ఆక్సిజన్‌ లేమి సమస్యను పరిష్కరించటం ద్వారా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. ముందుగా పుండు ఆకారాన్ని కచ్చితంగా మార్చి, ఆక్సిజన్‌ మోతాదులు తక్కువగా ఉన్నచోట పగుళ్లను పూడ్చివేస్తుందని చెబుతున్నారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా కావటం వల్ల రక్తనాళాలూ త్వరగా పుట్టుకొస్తాయని, ఫలితంగా పుండు వేగంగా మానుతుందని సూచిస్తున్నారు.

ఆశాజనక ఫలితాలు : వినూత్న జెల్‌ పట్టీని డయాబెటిస్ గల, వృద్ధ ఎలుకల మీద ప్రయోగించి, పరిశీలించారు పరిశోధకులు. ఎందుకంటే, వీటి పుండ్లు వృద్ధుల్లో తలెత్తే దీర్ఘకాల పుండ్లనే పోలి ఉన్నాయంటున్నారు. చికిత్స చేయకపోతే పుండు మానదని, ప్రాణాంతకంగానూ పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఎలుకలకు వారానికి ఒకోసారి పట్టీని మార్చుతూ, సుమారు 23 రోజుల పాటు చికిత్స చేశారని వివరిస్తున్నారు. అన్నీ జీవించి ఉన్నాయని తెలియజేస్తున్నారు. తద్వారా పట్టీ మంచి ఫలితం చూపుతున్నట్టు దీని ద్వారా రుజువైందని చెబుతున్నారు. ల్యాబ్​లో కణజాలాలు, అవయవాలను వృద్ధి చేయటంలోనూ ఆక్సిజన్, పోషకాలు అందేలా చూడటం కీలకమంటున్నారు. ఇలాంటి వాటికీ జెల్ పట్టీ ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'కళ్లు తిరగడం, తలనొప్పి'గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!

కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - ఈ చిట్కాలు పాటిస్తే మేలంటున్న నిపుణులు!