ETV Bharat / health

ఎముకలు బలహీనమవుతున్నాయా? - ఈ సలహాలు పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

-క్రమక్రమంగా పెరుగుతోన్న "ఆస్టియోపీనియా" సమస్య - ఎముకల బలం తగ్గితే ఏం చేయాలో సూచిస్తున్న నిపుణులు!

Bone Health
Bone Health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 30, 2025 at 11:11 AM IST

|

Updated : October 30, 2025 at 11:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

Tips for Bone Health: మన శరీరం శక్తిమంతంగా ఉండి, పనులను సవ్యంగా చేసుకోవాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే, వయసు మీద పడతున్న కొద్దీ ఎముకలు పలు రకాల అనారోగ్యాలకు గురవుతూ, బలహీనపడుతుంటాయి. మరికొందరికి వయసుతో సంబంధం లేకుండా ఎముకలు క్షీణిస్తాయి. సాధారణంగా కన్నా ఎక్కువ క్షీణిస్తే 'ఆస్టియోపీనియా' అంటారు. దీన్ని మామూలుగా వృద్ధుల్లో చూస్తుంటామని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, 65 ఏళ్లు పైబడ్డ మహిళల్లో ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. శారీరక శ్రమ చేయకపోవటం, క్యాల్షియం, విటమిన్ డి లోపం, మధుమేహం, కీళ్లవాతం లాంటి జబ్బులతో పాటు మద్యం, పొగ అలవాట్లు కూడా ఎముక సాంద్రత తగ్గేలా చేయొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ఎముకల పటుత్వం తగ్గితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆరోగ్య సమస్యలు అనగానే ఎంతసేపూ గుండెపోటు, క్యాన్సర్, కిడ్నీ వంటి తీవ్ర జబ్బులే గుర్తుకొస్తాయి. కానీ, ఆస్టియోపీనియా తక్కువేమీ కాదంటున్నారు నిపుణులు. ఇందులో ఎముక ఆకృతి, నాణ్యత తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే, ఎముకలు గుల్లబారినవారికి చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరుగుతుంటాయని వివరిస్తున్నారు. ప్రధానంగా తుంటి, వెన్నెముక, మణికట్టు విరుగుతుంటాయంటున్నారు. అందుకే, డాక్టర్లు ఎముక సాంద్రతను తెలుసుకోవటానికి డెక్సా పరీక్ష చేయిస్తారని తెలియజేస్తున్నారు. ఈ పరీక్ష అనేది ఎముకల్లోని క్యాల్షియం, ఇతర ఖనిజాల మోతాదులను లెక్కించటం ద్వారా ఎముక పటుత్వాన్ని తెలియజేస్తుందని అంటున్నారు.

నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న వైద్యులు!

ఎందుకు చేయిస్తారు? :

  • ఎముక క్షీణత, గుల్లబారటాన్ని నిర్ధారించటానికి
  • భవిష్యత్తులో ఎముక విరిగే ముప్పును అంచనా వేయడానికి
  • ఎముకల పటుత్వానికి చేసే చికిత్స పనితీరును తెలుసుకోవటానికి

ఎవరికి అవసరం :

  • బరువు మరీ తక్కువగా ఉన్నవారికి
  • 50 ఏళ్ల తర్వాత ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎముక విరిగినవారికి
  • ఎముక అనేది, ఏడాదిలో అర అంగుళం లేదా అంతకన్నా ఎక్కువగా పొడవు తగ్గినవారికి
  • కుటుంబంలో ఎవరికైనా ఎముక క్షీణత వచ్చి ఉన్నప్పుడు

ఎముక సాంద్రతను నిర్ణయించడానికి ప్రధాన మార్గం ఏమిటంటే, ఎముకలోని ఖనిజ పదార్థాన్ని కొలిచే డ్యూయల్ -ఎనర్జీ ఎక్స్-రే అబ్సార్ప్టియోమెట్రీ (DXA), నాన్-ఇన్వాసివ్ పరీక్షలని harvard.edu అధ్యయనం పేర్కొంది. ఈ పరీక్ష ఫలితాలను సాధారణంగా T-స్కోర్ రూపంలో ఇస్తారని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్న, 20ల్లో లేదా 30ల్లో సగటు వ్యక్తి ఎముక సాంద్రతతోనూ పోల్చి (జెడ్‌-స్కోర్‌) చూస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. T-స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఎముక అంత బలంగా ఉందని, తక్కువ స్కోర్‌ ఉంటే ఎముక విరిగే ముప్పు ఎక్కువ అని అంటున్నారు. నెగెటివ్‌ నంబరుతోనూ ఫలితాలను సూచిస్తారని, T- స్కోర్‌ సున్నాకు ఎంత దగ్గరగా ఉంటే ఎముక అంత బలంగా ఉన్నట్టు అర్థం.

  • 0 నుంచి -1, అంతకన్నా ఎక్కువుంటే ఎముక సాంద్రత ఆరోగ్యంగా ఉన్నట్టు.
  • -1 నుంచి -2.5 లోపుంటే ఎముక క్షీణిస్తున్నట్టు.
  • -2.5, అంతకన్నా తగ్గితే ఎముకలు గుల్లబారినట్టు.

తగ్గితే ఏం చేయాలి? : ఎముకలను బలంగా ఉంచుకోవడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి, కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమమని medlineplus అధ్యయనం పేర్కొంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, మద్యం పరిమితం చేయడం, ధూమపానం మానేయడం కూడా సహాయపడుతుందని తెలిపింది. తగినంత తినడం, సరైన రకాల విటమిన్లు, ఖనిజాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయని clevelandclinic అధ్యయనం తెలిపింది.

ఎక్సర్​సైజ్​లు :

  • ఎరోబిక్స్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎముకలకు ఒత్తిడి కలిగించకుండా దృఢంగా మారుస్తాయి.
  • చిన్నపాటి బరువులు ఎత్తడం, ఎలాస్టిక్ బ్యాండ్లతో వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు, కండరాలకు బలం చేకూరుతుంది.
  • బ్యాలెన్సింగ్ ఎక్సర్​సైజ్ చేసినా మంచిదే. దీని వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఆ ప్రభావం ఎముకలపై పడదు.
  • గ్రావిటీకి వ్యతిరేకంగా బరువుని ఆపుతూ రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
  • స్క్వాట్స్, పుషవ్స్ వంటివీ ఎముకలను దృఢంగా మారుస్తాయి. చిన్న వయసు నుంచే పోషకాహారం తప్పనిసరి.
  • కాళ్ల కండరాలపై ఒత్తిడి తెచ్చే పనులు, వ్యాయామాల లాంటివి కీళ్లకు బలాన్నిస్తాయి.
  • గ్రావిటీకి వ్యతిరేకంగా నడిస్తే ఎముకలు బలపడతాయి. దీని కోసం మెట్లు, కొండలు ఎక్కడం వంటివి చేయాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? - తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

'దగ్గు'ను ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? - డాక్టర్ దగ్గరికి వెళ్లాలా?- అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

Last Updated : October 30, 2025 at 11:55 AM IST