ETV Bharat / health

కాబోయే అమ్మకు 'ఈ పోషకాలు' అందాల్సిందేనట! - ఎందుకో తెలుసా?

-ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం ఆహారం విషయంలో ఈ నియమాలు పాటించాలట! -

Pregnant and Lactating Women
Pregnant and Lactating Women (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 24, 2025 at 3:49 PM IST

4 Min Read
Choose ETV Bharat

Nutrients for Pregnant and Breastfeeding Women: మహిళలు గర్భం దాల్చగానే ఇంట్లో వాళ్లందరి ఫోకస్ ఆమె మీదే ఉంటుంది. ఇది తిను, అది వద్దు అంటూ సవాలక్ష సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. బిడ్డ పుట్టాక కూడా ఇదే వరుస. ఇద్దరికీ సరిపడా ఆహారం తినాలని అంటారు. ఈ క్రమంలో గర్భిణులు, బాలింతలు రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

గర్భిణులు, బాలింతలకీ అదనపు పోషకాలు తప్పనిసరి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకూ అంటే, 270 రోజులు, ఆ తరవాత బిడ్డకి రెండో ఏడాది నిండేవరకూ అంటే, 730 రోజులు, మొత్తం 1000 రోజులు తల్లి పోషకాహారంపై ఆధారపడి ఉంటుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఈ ఆహారమే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పోషకాహార లోపం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అలా ఉన్న పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడటం, ఎత్తు తక్కువగా ఉండటం, పెద్దయ్యాక డయాబెటిస్, బీపీలతో పాటు గుండె, జీవక్రియా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇలాంటప్పుడు తల్లికి సమతులాహారం తప్పనిసరని సూచిస్తున్నారు. సాధారణ బరువున్న వాళ్లు సుమారు 10 నుంచి 12 కిలోల వరకూ బరువు పెరగొచ్చని తెలియజేస్తున్నారు.

"అధిక కొలెస్ట్రాల్​"తో బాధపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!

ఏమేమి అవసరమంటే : 2 నుంచి 3 నెల వరకూ గర్భిణీకి రోజువారీ ఆహారంలో 350 క్యాలరీల శక్తి అవసరమవుతుందని ఐసీఎంఆర్-ఎన్​ఐఎన్ సీనియర్ రిటైర్డ్ సైంటిస్ట్ కె. దమయంతి చెబుతున్నారు. ఆహారంలో 8- 18 గ్రా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. పాలిచ్చేటప్పుడయితే మొదటి ఆరు నెలల్లో రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. 6-12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6గ్రా ప్రొటీన్‌ ఉండాలని పేర్కొంటున్నారు. మహిళలు ప్రసవం తర్వాత మొదటి సంవత్సరం పాటు ప్రతిరోజూ 290 మైక్రోగ్రాములు అయోడిన్, 550 మిల్లీగ్రాముల కోలిన్ తీసుకోవాలని CDC అధ్యయనం పేర్కొంది.

ఇవి కూడా ముఖ్యమే : గర్భిణులకీ సూక్ష్మ పోషకాలూ కీలకమే. గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీ లోపాలు తలెత్తకుండా చేయడంతో పాటు తల్లిలో రక్తహీనతనూ తగ్గిస్తుందని కె. దమయంతి అంటున్నారు. రక్తకణాల నిర్మాణానికి తల్లికీ బిడ్డకీ ఐరన్‌ కూడా అదనంగా కావాలని, ఐరన్‌ లోపిస్తే తల్లికి ప్రాణాపాయ పరిస్థితి, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌-డి, కాల్షియం అవసరమని, ఇవి సమృద్ధిగా అందితే భవిష్యత్తులో తల్లికి ఆస్టియోపొరొసిస్‌ సమస్య రాదని వివరిస్తున్నారు. విటమిన్‌-ఎ, అయొడిన్‌లు శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని తెలియజేస్తున్నారు. వీటితో పాటు బి12, సి తగుపాళ్లలో అవసరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి, ఆహారంతో పాటు డాక్టర్లు సూచనల మేరకు గర్భంతో ఉన్నప్పుడే కాదు, చనుబాలిచ్చేటప్పుడు కూడా ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి సప్లిమెంట్లు వాడాలని సూచిస్తున్నారు.

ఇవి తినాలి : గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారంలో తగినంత శక్తి, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్, గింజలు, పాశ్చరైజ్డ్ పాల ఉత్పత్తులు, పండ్లతో సహా వివిధ రకాల ఆహార పదార్థాల వినియోగం ద్వారా లభిస్తాయని World Health Organization అధ్యయనం పేర్కొంది.

  • ఖనిజాలు, విటమిన్ల కోసం బీన్స్, డ్రైఫ్రూట్స్ మంచి వనరులని కె. దమయంతి తెలియజేస్తున్నారు. ఆకుకూరలు, చిక్కుళ్లు, నట్స్, కాలేయం ఫోలిక్‌ ఆమ్లానికి మంచి వనరులని, వీటితో పాటు మొదటి మూడు నెలల్లో 0.5 మి.గ్రా ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్‌ తీసుకోవడం మేలని వివరిస్తున్నారు.
  • మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ఎండిన పండ్లలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.
  • జామ, పైనాపిల్, సిట్రస్‌ పండ్లలో విటమిన్‌-సి అధికంగా ఉంటుందని, వీటివల్ల ఐరన్‌ శోషణ కూడా బాగుంటుందంటున్నారు. మరీ ముఖ్యంగా ఆకు కూరలు, పప్పు లేదా గుడ్డు లాంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

మరికొన్ని జాగ్రత్తలు :

  • రోజుకు రెండు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీలు అనేవి ఐరన్​ను గ్రహించేందుకు అడ్డుపడతాయి.
  • ఫైబర్ ఎక్కువున్న కూరగాయలు తీసుకోవాలి. 1000 క్యాలరీల ఆహారంలో 25 గ్రా. ఫైబర్ ఉండాలి.
  • నిల్వ ఉన్నవి, శుభ్రత లోపించిన వాటికి దూరంగా ఉండాలి.
  • ఎక్కువగా షుగర్, ఉప్పు ఉన్నవి పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
  • భోజనానికి ముందూ లేదా భోజన సమయంలో సప్లిమెంట్లను తీసుకోరాదు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న వైద్యులు!

"ఉప్పు" విషయంలో ఆ తప్పు చేయకండి! - మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?