ETV Bharat / health

ఈ కొత్త పరీక్ష - మీ శరీరతత్వానికి సరిపడే ఆహారమేదో చెప్పేస్తుంది!

- ఆరోగ్యానికి సరికొత్త బాట చూపుతున్న "న్యూట్రి జినోమిక్స్"! - ఎన్నో విషయాలు ముందుగానే తెలుసుకోవచ్చంటున్న నిపుణులు

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : September 2, 2026 at 3:11 PM IST

4 Min Read
Choose ETV Bharat

Nutrigenomics Test for Weight Loss : బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పనిచేసే అఖిల్ (28) బరువు తగ్గేందుకు నిపుణులు చెప్పినవన్నీ చేశాడు. ఫలితం లేదు. చివరికి లాలాజల నమూనాను ఇచ్చి న్యూట్రి-జినోమిక్స్ పరీక్ష చేయించుకున్నాడు. అతని శరీరానికి 'హై-ఫ్యాట్' కీటో డైట్ సరిపడదని, లో-ఫ్యాట్, హై-ఫైబర్ ఉన్న రాగులు, జొన్నలు వంటివి తింటేనే జీవక్రియ వేగవంతం అవుతుందని తేలింది. ఇంకేం, ఆ విధంగా తిండి మార్చగానే 2 నెలల్లోనే ఊహించని మార్పు వచ్చింది.

అందరూ తింటున్నారని బ్రౌన్​ రైస్ తినడం, ఎవరినో చూసి కీటో డైట్ పాటించడం ఇవన్నీ పాత ధోరణులు. అసలు మన శరీరతత్వం ఏమిటి? పిండి పదార్థాలను ఎంతమేర తీసుకుంటుంది? కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​లో వేటిని, ఎంత మేర కావాలంటోంది లాంటి విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

పాతకాలం ఆహార ధోరణి :

  • అందరిలా ఒకే ఆహారం తినడం
  • బరువు తగ్గడం లేదా పెరగడమే లక్ష్యం.
  • ఖర్చు తక్కువ

జన్యు ఆధారిత ఆహార ప్రణాళిక :

  • జన్యువులకు అనువైన ఆహారం మాత్రమే తినడం
  • ఏఐ విశ్లేషణతో వ్యాధులను అడ్డుకోవడం
  • కాస్త ఖరీదు

'BP' పెరిగితే తలనొప్పి?, షుగర్ పేషెంట్లకు తేనె! - 'అపోహలను' నమ్మొద్దంటున్న నిపుణులు!

మనకంటూ ప్రత్యేకమైన జన్యు నిర్మాణం ఎలాంటి ఆహారాన్ని కోరుకుంటుందో తెలుసుకుని తింటే బాగుంటుంది కదా. ఆ విషయాన్ని చెప్పేదే న్యూట్రి - జినోమిక్స్ (పోషక జన్యుశాస్త్రం). ఇందులో మన DNA (జన్యు నిర్మాణాన్ని) పరిశీలించి ఎలాంటి ఆహారం, ఏ మోతాదులో తింటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా 'జన్యు ఆధారిత వ్యక్తిగత ఆహార ప్రణాళికను రూపొందించుకొనే ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అంటున్నారు.

  • మీ ఫ్రెండ్​ రోజుకు 4 కప్పుల కాఫీ తాగినా హాయిగా ఉంటాడు. మీరు ఓ కప్పు తాగినా గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే, మీ DNA ప్రభావం వల్ల శరీరంలో కెఫీన్​ను కరిగించే జీవక్రియ వేగం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • కొందరు ఎండలో ఎంత తిరిగినా, విటమిన్ డి మాత్రలు వేసుకున్నా శరీరానికి పట్టదట. జన్యువుల్లోని లోపం వల్ల విటమిన్లను శరీరం గ్రహించలేదని నిపుణులు చెబుతున్నారు. దానికి ప్రత్యేకమైన సప్లిమెంట్ రూట్ మ్యాప్ కావాలని సూచిస్తున్నారు.
  • మీ ఇంట్లో వంశపారంపర్యంగా ఎవరికైనా డయాబెటిస్, కిడ్నీ, గుండె సమస్యలు ఉంటే, ఆ జీన్స్ మీలోనూ క్రియాశీలకంగా ఉన్నాయా? వాటిని ఏ ఆహారంతో నియంత్రణలో ఉంచవచ్చో ఈ నయా సైన్స్ ముందే చెబుతుందంటున్నారు నిపుణులు. తర్వాతి తరాన్ని ఈ జన్యు రుగ్మతల నుంచి కాపాడుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
  • ప్రస్తుతం శరీరంలో ఏ చిన్న లోపం ఉన్నా మల్టీ విటమిన్ మాత్రలు మింగేస్తున్నాం. కానీ, ఇందులో అవసరానికి తగ్గట్టుగా ఏ విటమిన్​ను ఎంత మోతాదులో తీసుకోవాలో, వేటిని మినహాయించాలో తెలుస్తుందని పేర్కొంటున్నారు.
  • కొందరికి పాలు పడకపోతే, మరికొందరికి గ్లూటెన్ పదార్థాలు తింటే అలర్జీలు వస్తుంటాయి. అలాంటి లోపాలు ముందే గుర్తించొచ్చు.

సైన్స్​ ప్లస్​ ఏఐ : గతంలో DNA పరీక్ష అంటే కేవలం ల్యాబ్ రిపోర్టులు చూసి చదువుకోవడం మాత్రమే. ఇప్పుడు మీ న్యూట్రి - జినోమిక్స్ పరీక్ష రిపోర్టును ఏఐ ఆధారిత యాప్స్ విశ్లేషిస్తున్నాయి. మీ జీన్స్ తత్వాన్ని పరిశీలించి, ఈ రోజు మధ్యాహ్న భోజనంలో ఎన్ని గ్రాముల పిండి పదార్థాలు, ప్రొటీన్స్ తినాలో చెప్పేస్తున్నాయి.

  • ఒకసారి మీ శరీరతత్వం అర్థమైతే నెలవారీగా తెచ్చుకునే పచారీ సరకుల జాబితా కూడా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మనకు ఏవి అవసరమో అవి కొంటాం, తింటాం అని సూచిస్తున్నారు.
  • శరీరానికి తగ్గట్టుగా దీర్ఘకాలిక ఆహార ప్రణాళికను మార్చుకుంటే గుండె సమస్యలు, సంతానలేమి వంటివీ తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.

ఎక్కువ అన్నం తినేవారు సన్నగా ఉండటం, తక్కువ తినేవారు లావుగా ఉండటం చూస్తుంటాం. అంటే, వారి జీవక్రియల వేగంలో తేడా ఉందన్న మాట. సాంకేతికతతో చేయించే ఈ జన్యు పరీక్ష మీ శరీరతత్వాన్ని చెప్పే ఓ మార్గసూచీ లాంటిది. న్యూట్రి-జెనోమిక్స్ నివేదికను పాటించడంతో పాటు వ్యాయామం, ప్రశాంతమైన నిద్ర తోడైతేనే, అద్భుతాలు జరుగుతాయి.- టీఈ నాగలక్ష్మి, డైటీషియన్

ఎవరికి కావాలి : ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గనివారు లేదా పెరగని వారు, ఏది తిన్నా కడుపు ఉబ్బరం వచ్చేవారు, వంశపారంపర్య రోగాల భయం ఉన్నవారు ఈ స్మార్ట్ మార్గాన్ని ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లోనే ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయట. అయితే, ఆన్​లైన్​లో బుక్​ చేసుకుంటే వచ్చి నమూనా తీసుకెళ్లే సౌకర్యం చాలా పట్టణాలకు విస్తరించిందని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'లేట్ నైట్ స్క్రీన్స్, ఎర్లీ మార్నింగ్ అలారమ్స్' - మీ శరీరంలో జరిగేది ఇదే!

'క్యాన్సర్'​ ముప్పును ఎదుర్కోవచ్చా? - కొన్ని అలవాట్లతో చెక్ పెట్టొచ్చట!