కండర బలానికి "ప్రొటీన్" ఒక్కటే సరిపోదు - ఇంకేం కావాలంటే!
కండరాలు బలంగా ఉండాలంటే? - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిదంటున్న నిపుణులు!

Published : April 29, 2026 at 3:32 PM IST
Beyond Protein and Other Nutrients that Help Prevent Muscle Loss : వయసు మీద పడుతున్న కొద్దీ కండరాల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది. దీన్ని నిలువరించకపోతే రోజువారీ పనులు సరిగా చేసుకోలేకపోవటం, కింద పడిపోవటం, ఎముకలు విరగటం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావటం వంటి ఇబ్బందులకు దారి తీస్తుంది. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలతో కండరాలను కాపాడుకునే వీలుండటం, సమతులాహారం తినటంతో పాటు తగినంత వ్యాయామం చేయటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకు ప్రొటీన్‌తో పాటు ఇతర కీలక పోషకాల మీదా దృష్టి సారించటం మంచిదని Harvard Health Publishing సూచిస్తుంది. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
కార్బోహైడ్రేట్లు : శరీరానికి ప్రధానమైన శక్తి వనరులు ఇవే. మనం ఆహారం ద్వారా తీసుకున్న కార్బోహైడ్రేట్లలో కొంత కండరాల్లో గ్లైకోజన్ నిల్వ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దీన్ని భర్తీ చేస్తుంది. ఒకవేళ తగినంత పిండి పదార్థం తీసుకోకపోతే శరీరం శక్తి కోసం కండర కణజాలాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది కండర క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, గింజ ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, పప్పులతో లభించే నాణ్యమైన పిండి పదార్థాన్ని తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.
మెగ్నీషియం : ఇది శరీరంలో 300కు పైగా జీవ రసాయన చర్యల్లో పాలు పంచుకుంటుంది. వీటిల్లో చాలా వరకూ కండర ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉంటాయి. కండరాల సంకోచం, వ్యాకోచం వంటి పనులు సజావుగా సాగటానికి మెగ్నీషియం అవసరమంటున్నారు నిపుణులు. ఇది ప్రొటీన్లు ఉత్పత్తి కావటానికి, వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఇలా కండర మరమ్మతు ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ క్రమంలో నిండు గింజ ధాన్యాలు, విత్తనాలు, పప్పులు, చిక్కుళ్లు, ఆకుకూరలు లాంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అయితే, ఆకలి, పోషకాలను శోషించుకునే సామర్థ్యం తగ్గటం వల్ల వృద్ధుల్లో చాలా మందికి ఆహారం ద్వారా తగినంత మెగ్నీషియం అందదు.
మండే ఎండల్లో "చల్లచల్లని జ్యూస్" తాగుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఐరన్ : రక్తం ద్వారా ఆక్సిజన్‌ను చేరవేయటం, శక్తి ఉత్పత్తి చేయటం ద్వారా ఐరన్ కండరాల పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని మోతాదులు తగ్గితే కండర కణాల్లో ఆక్సిజన్‌ను నిల్వ చేసే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్‌ను సరిగా ఉత్పత్తి కాదంటున్నారు నిపుణులు. దీంతో కండర సామర్థ్యం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. ఐరన్ లోపం ఎనీమియాకూ (రక్తహీనత) దారితీస్తుంది. ఇందులో కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ఎర్ర రక్తకణాల సంఖ్య, హీమోగ్లోబిన్ మోతాదులు పడిపోతాయట. దీనివల్ల కండర సామర్థ్యం తగ్గిపోతుంది. పప్పులు, టోపు, చేపలు, మాంసం, చికెన్ లాంటి వాటితో ఐరన్ లభిస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు : ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయనే విషయం అందరికి తెలిసిందే. మంచి కొవ్వుల తరగతికి చెందిన వీటి వాపు నివారణ గుణాలు కండరాలకూ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ప్రొటీన్ల ఉత్పత్తి, కణజాలాల మరమ్మత్తు మెరుగవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.అవకాడో, అక్రోట్లు, అవిసె గింజలు, సాల్మన్, సార్డైన్, మాకెరల్ వంటి చేపలు ఈ కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. మధ్య వయసువారు, వృద్ధులు వారానికి రెండు సార్లు చేపలు తింటే కండర మోతాదు, పిడికిలి పట్టు, శరీరం కుదురుగా ఉండటం గణనీయంగా పెరుగుతుంది.
విటమిన్ డి : ఇది కండరాల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని గ్రాహకాలు కండర కణాల్లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ శరీరంలో విటమిన్ డి మోతాదు తగ్గితే కండర బలహీనత, నడక వేగం తగ్గటం, కింద పడిపోవడం వంటి ముప్పు పెరుగుతాయంటున్నారు నిపుణులు. అలాగే, కండర సంకోచానికి తోడ్పడే క్యాల్షియంను శరీరం సంగ్రహించుకోవాటానికి తోడ్పడుతుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. కానీ, చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య వయసు మీద పడుతున్న కొద్దీ దీని లోపం మరింత పెరుగుతూ వస్తుంది. కాబట్టి, ఆహారం, ఎండ, మందుల ద్వారా విధిగా లభించేలా చూసుకోవాలి. అందుకే, విటమిన్ డి కోసం పాలు, పాల పదార్థాలతో పాటు కొవ్వుతో కూడిన చేపలు తీసుకోవాలి.
నీరు : మనం జీవించి ఉండటానికి నీరు తప్పనిసరి. కండర మోతాదులో 76 శాతం వరకూ నీరే ఉంటుంది. అందువల్ల కండర సామర్థ్యం పెరగాలన్నా, సజావుగా పని చేయాలన్నా, కండరాలు క్షీణించకుండా ఉండాలన్నా తగినంత నీరు తాగటం ముఖ్యం. ఈ క్రమంలో నీరు సరిగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఇది కండర ప్రొటీన్ విచ్ఛిన్నమయ్యే ముప్పు పెరిగేలా చేస్తున్నట్టూ పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, కేవలం భోజనం చేసినప్పుడే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజుకు 10 నిమిషాల పరుగుతో ఇన్ని లాభాలా!
పాదాల్లో మంటగా అనిపిస్తోందా? - అయితే మీ బాడీలో ఈ సమస్యలు ఉండొచ్చట!

