ETV Bharat / health

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

- మహిళలు 40, 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

Women’s Health and Wellness
Women’s Health and Wellness (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 18, 2026 at 5:40 PM IST

|

Updated : July 18, 2026 at 5:50 PM IST

5 Min Read
Choose ETV Bharat

Women’s Health and Wellness at Every Stage of Your Life : మహిళల శరీరం తన జీవితకాలంలో ఎన్నో అసాధారణ మార్పులకు లోనవుతుంది. ఇరవైల వయసులో ఉండే ఉత్సాహం, నలభైలలో ఉండదు. హార్మోన్లలో మార్పులు, అరవైల నాటి వృద్ధాప్యం.. ఇలా ప్రతి దశలోనూ మహిళల శరీరం నిరంతరం మారుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ వయసులో ఉన్నా మహిళల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసేది మాత్రం పోషకాహార లోపం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మహిళలకు ఏ వయసులో ఎలాంటి పోషకాలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం!

వయసును బట్టి శరీరానికి కావలసిన పోషకాలు మారుతుంటాయి. కాలేజీ రోజుల్లో అవసరమైన ఆహారం నలభై ఏళ్లులోను లేదా వృద్ధాప్యంలో సరిపోదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం పాడైన తర్వాత బాధపడటం కంటే, ముందే జాగ్రత్త పడటం ముఖ్యమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది మహిళలు తరచూ వచ్చే అలసట, విరిగిపోయే గోళ్లు లేదా కారణం లేకుండా మారే మూడ్ స్వింగ్స్ వంటి వాటిని బిజీ లైఫ్ వల్ల వచ్చే సమస్యలని పొరబడతారు. కానీ, నిజానికి ఇవి శరీరంలో పోషకాహరం లోపం ఉందని చెప్పడానికి మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.

20 ఏళ్లలో : ఈ వయసులో ఉన్నవాళ్లు.. తాము దేన్నైనా సాధించగలమనే బలమైన నమ్మకంతో ఉంటారు. అలాగే, దీర్ఘకాలిక శారీరక దృఢత్వానికి పునాది ఈ దశలోనే పడుతుందంటున్నారు నిపుణులు. ఈ వయస్సులో కనిపించే పోషకాహార లోపాలు ఎక్కువగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, శక్తి, జీవక్రియలకు సంబంధించి ఉంటాయని చెబుతున్నారు.

Women’s Health and Wellness
Women’s Health and Wellness (Getty Images)

ఐరన్​ : నాటి నుంచి నేటి వరకూ మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుందట. ఇది రక్తహీనతకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. శరీరమంతటా ఆక్సిజన్​ను రవాణా చేసే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్​కు ఐరన్ ప్రధానమైన మూలకమని చెబుతున్నారు. అయితే, శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు.. మహిళలు తీవ్రమైన అలసట, మానసిక సమస్యలు, ఏకాగ్రత తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లీన్ మీట్, పప్పుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు.. ఇలా ఐరన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. అంతేకాదు, శరీరం ఐరన్​ను గ్రహించడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Women’s Health and Wellness
Women’s Health and Wellness (Getty Images)

విటమిన్ B9 (ఫోలేట్) : పిల్లలు పుట్టే వయసులో ఉన్న మహిళలకు అత్యంత కీలకమైన విటమిన్లలో ఫోలేట్ ఒకటి. ఇది కణ విభజనకు, DNA సంశ్లేషణకు చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరంలో తగినంత ఫోలేట్ స్థాయిలు ఉంటే.. ఎదుగుతున్న పిండాలలో వచ్చే తీవ్రమైన నరాల లోపాలను నివారించవచ్చని చెబుతున్నారు. అందుకు, తమ రోజువారీ ఆహారంలో సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, అవకాడోలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్లు B9, B12 గర్భధారణకు ముందే మహిళలకు అందించాలని పేర్కొంటుంది. Annals of the National Academy of Medical Sciences (ఇండియా)లో ప్రచురితమైన Prevention of Neural Tube Defects in India నివేదికలో దీన్ని వివరించారు.

'సైలెంట్ కిల్లర్స్' - మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న అలవాట్లు ఇవేనట!

40 ఏళ్లలో : ఈ వయసులోకి ప్రవేశించడం వల్ల పెరి మెనోపాజ్ అనే సంక్లిష్టమైన దశ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో జీవక్రియల రేటు మందగించడం ప్రారంభమవుతుందంటున్నారు. కండరాల ద్రవ్యరాశి సహజంగా తగ్గుతుందట. ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే హెచ్చుతగ్గులు శరీరం అంతటా శారీరక మార్పులను ప్రేరేపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో 40 ఏళ్ల వయసులో పోషకాహార పరంగా.. కణాల రక్షణ, ఒత్తిడి నిర్వహణ, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. 40, 50 వయస్సులో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాల నుంచి ప్రతిరోజూ 25 - 31 గ్రాముల పీచుపదార్థం తీసుకోవాలని Stanford Medicine పేర్కొంది.

Women’s Health and Wellness
Women’s Health and Wellness (Getty Images)

మెగ్నీషియం : ఇది శరీరంలో 300 కంటే ఎక్కువ బయోకెమికల్ ప్రక్రియలను నియంత్రిస్తుందట. 40 ఏళ్లులో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలు తీవ్రమైన నిద్రలేమి సమస్యలు, కండరాల నొప్పులు, పెరిగిన ఆందోళనను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం సహజంగానే నరాల వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని అంటున్నారు. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో గుమ్మడికాయ గింజలు, బాదం, డార్క్​ డాకెట్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ దశలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలియజేస్తున్నారు.

విటమిన్ D3, క్యాల్షియం : ఈస్ట్రోజెన్ స్థాయిలు క్రమంగా తగ్గడం ప్రారంభమవడంతోపాటు ఎముకల క్షీణత వేగంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఈ దశలో మహిళల్లో కనిపించే విటమిన్ D లోప లక్షణాలను గమనిస్తూ ఉండాలంటున్నారు. తగినంత విటమిన్ D3 లేకపోతే, శరీరం ఆహారం నుంచి క్యాల్షియం సమర్థవంతంగా గ్రహించలేదని వివరిస్తున్నారు. ఇది ఆస్టియోపీనియా ప్రారంభ దశలను వేగవంతం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎండలో గడపడం, గుడ్లు, డాక్టర్లు సలహాలతో సప్లిమెంట్లను తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

60 ఏళ్లులో : ఈ వయస్సులో దీర్ఘాయువు, రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యానికి కచ్చితమైన జాగ్రత్తలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఎందుకంటే, ఈ వయస్సులో సాధారణ ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుందని తెలియజేస్తున్నారు. రుతువిరతి తర్వాత మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని clevelandclinic పేర్కొంది.

విటమిన్ B12 : వయసు పెరుగుతున్న కొద్ది.. కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల మనం తినే ఆహారంలోని ప్రొటీన్ల నుంచి విటమిన్ B12 లోపం వల్ల నరాల దెబ్బతినడం, చిత్తవైకల్యం లాంటి మానసిక క్షీణత, దీర్ఘకాలిక అలసట వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శాకాహారం తీసుకునే మహిళలు అయితే.. నరాల బలహీనతను నివారించడానికి 40, 60 ఏళ్లు పైబడిన వారి అవసరమైన సప్లిమెంట్ల కోసం డాక్టర్లు సంప్రదించడం మంచిదట. జీర్ణాశయంలోని ఆమ్ల స్థాయిలు తగ్గడం వల్ల, జంతు ప్రోటీన్ల నుంచి B12ను విడగొట్టే శరీర సామర్థ్యం దెబ్బతింటుంది, దీనివల్ల నాడీ వ్యవస్థ క్షీణించడం, జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని National Library of Medicine పేర్కొంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : 60 ఏళ్లు పైబడిన మహిళలు.. సరైన ఆహార ప్రణాళికలో గుండె, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతమైన యాంటీ ఇన్​ఫ్లమేటరీ కారకాలుగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, కీళ్ల నొప్పులను నియంత్రిస్తాయని తెలియజేస్తున్నారు. అంతేకాదు, మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు. శారీరక కదలికలు సులభంగా ఉండటానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి.. వాల్​నట్స్, అవిసె గింజలు, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను రోజువారీ ఆహారంలో ముఖ్యభాగంగా చేసుకోవాలని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రొమ్ము క్యాన్సర్ ముప్పు - ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయట!

కడుపుబ్బరంగా అనిపిస్తోందా? - సహజసిద్ధ పరిష్కారాలు ఇవేనట!

Last Updated : July 18, 2026 at 5:50 PM IST