ETV Bharat / health

మరోసారి "నిఫా" వైరస్ కలకలం - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

తీవ్రమైన జ్వరం, తలనొప్పి కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించడం తప్పనిసరి

Nipah Alert
Nipah Alert (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : January 17, 2026 at 2:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nipah Alert : పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో నిఫా వైరస్ లక్షణాలతో మరో ఇద్దరు నర్సులు చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. బర్ద్వాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఈ వైరస్ సోకిన ఒక ఆరోగ్య కార్యకర్తకు చికిత్స అందించిన వారిలో వీరు కూడా ఉన్నారు. ఈ క్రమంలో నిఫా వైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఎందుకు ప్రమాదకరమో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

నిఫా వైరస్ : నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది ప్రధానంగా గబ్బిలాల (Fruit Bats) ద్వారా వ్యాపిస్తుంది. అలాగే పందులు, మేకలు, గుర్రాలు, కుక్కలు లేదా పిల్లుల ద్వారా కూడా ఇది సోకవచ్చు. గబ్బిలాల నుంచి వీటికి ఎలా సోకుతుందనేది ఇంకా కచ్చితంగా తెలియదు. అయితే, గబ్బిలాల మలమూత్రాలు, లాలాజాలాన్ని తాకటం ద్వారా ఇది నేరుగా జంతువులకు, మనుషులకు సోకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు, మనుషుల్లోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకోవచ్చు.

మధ్యవయసు కుంగుబాటుతో "డిమెన్షియా" రిస్క్ - తాజా పరిశోధనలో కీలక విషయాలు!

Nipah virus precautions
Nipah virus precautions (Ministry of Health And Family welfare)

వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

  • వైరస్ సోకిన జంతువుల రక్తం, మలమూత్రాలు లేదా లాలాజలం వంటి శారీరక ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు.
  • జంతువుల ద్వారా కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు.
  • వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండి చికిత్స అందించడం లేదా సంరక్షణ చేయడం ద్వారా.

లక్షణాలు :

  • తీవ్రమైన జ్వరం, తలనొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • దగ్గు, గొంతు నొప్పి
  • విరేచనాలు, వాంతులు
  • కండరాల నొప్పులు, బలహీనత

ఎందుకింత ప్రమాదకరం : నిఫా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక ఐదు రోజుల నుంచి రెండు వారాల మధ్యలో ఇన్​ఫెక్షన్​గా మారుతుంది. ఇది చాలా తీవ్రమైన మెదడు వాపును తెచ్చిపెట్టటం పెద్ద సమస్యగా మారుతుంది. నిజానికి, తొలిదశలో జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తాయి. తర్వాత మగత, తికమక తలెత్తుతాయి. ఒకటి లేదా రెండు రోజుల్లోనే కోమాలోకి లేదా ప్రాణాపాయమూ సంభవించొచ్చు. నిఫా వైరస్ కేసు మరణాల రేటు 40% నుంచి 75% వరకు ఉంటుందని World Health Organization అధ్యయనం పేర్కొంది.

ప్రత్యేక చికిత్స లేదు : ప్రస్తుతానికి ఈ వైరస్​కు ఎలాంటి టీకా లేదు. ఇన్​ఫెక్షన్​ను పూర్తిగా నయం చేసే ప్రత్యేక చికిత్స ఏమీ లేదు. ఆయా లక్షణాలు తగ్గటానికి వైద్యులు తగు చికిత్స చేస్తుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా, నిఫా వైరస్ బారినపడ్డవారిని ఇతరులతో కలవకుండా విడిగా ఉంచి, అత్యవసర చికిత్స గదిలో సత్వరం చికిత్స అందిస్తుంటారు.

Nipah virus precautions
Nipah virus precautions (Ministry of Health And Family welfare)

క్లినికల్ ట్రయల్స్ : నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను మనదేశంలోనే తయారుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రోగుల శరీరంలోని నిఫా వైరస్‌ను నిర్వీర్యం చేసే మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను ఐసీఎంఆర్ ఇప్పటికే అభివృద్ధి చేసింది. వాటితో జంతువులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు వాటిని మన దేశంలో తయారు చేసే వాణిజ్య భాగస్వాముల కోసం ICMR అన్వేషిస్తోంది. ఈ వైరస్ ప్రబలే సీజన్లలో అత్యవసర ప్రాతిపదికన మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను తయారుచేసి అందించగల కంపెనీలతో జట్టు కట్టేందుకు సిద్ధం అవుతోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • అనారోగ్యంతో ఉన్న జంతువులకు దూరంగా ఉండాలి.
  • గబ్బిలాలు నివసించే చెట్లు లేదా పొదలకు దూరంగా ఉండాలి.
  • నేలపై పడిన లేదా గబ్బిలాలు కొరికిన పండ్లను తినకూడదు.
  • కలుషితమయ్యే అవకాశం ఉన్న తాటి కల్లు లేదా ఇతర పానీయాలను నివారించాలి.
  • వైరస్ సోకిన జంతువులు, రోగులకు దూరంగా ఉండాలి.
  • హాస్పిటల్​లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, రక్షణ దుస్తులను ధరించాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్ర ఎక్కువైనా అనర్థమే - రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి? - పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే!

తరచూ కాళ్లలో "తిమ్మిర్లు" వస్తున్నాయా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?