రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
- షుగర్ లెవల్స్ పెరగడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

Published : April 17, 2026 at 2:50 PM IST
Health Problems Arise from Eating Late at Night : ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు పెద్దలు. అయితే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. సమయానికి ఆహారం తీసుకోవాలి. కానీ, కొంతమంది మాత్రం రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. ఫలితంగా, జీవక్రియ మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందంటున్నారు నిపుణులు, ఈ క్రమంలో రాత్రివేళ ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
జీర్ణక్రియ సమస్యలు : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంలో జీవక్రియ మందగించి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పడుకునే ముందు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని అంటున్నారు. దీనివల్ల కడుపులో లేదా గుండెల్లో మంటగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, జీర్ణవ్యవస్థ మందగించడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ అన్నవాహికలోకి రావొచ్చు, దీనివల్ల అసౌకర్యం, చికాకు కలుగుతాయని University of Rochester Medicine పేర్కొంది.
షుగర్ బారిన పడకుండా - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!
గుండెపై ప్రభావం : రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇవి రక్త నాళాల్లో పేరుకుపోయి, రక్తం సాఫీగా సరఫరా కాకుండా అడ్డుపడతాయని చెబుతున్నారు. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని National Library of Medicine పేర్కొంది.
బరువు పెరగడం : రాత్రిపూట మన శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆలస్యంగా తినడం వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు పెరిగి, క్యాలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తాయంటున్నారు. ఆలస్యంగా తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరగడం, శరీరంలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని Harvard Medical School పేర్కొంది.
నిద్ర లేమి : తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ వెనక్కి తన్ని, గుండెలో మంట లేదా అసౌకర్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, శరీరం నిద్రపోవడానికి బదులు ఆహారాన్ని అరిగించడానికి శక్తిని ఖర్చు చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల గాఢనిద్ర పట్టదని, నిద్ర మధ్యలో మెలకువ రావడం లేదా ఉదయాన్నే అలసటగా అనిపించడం జరుగుతుందని వివరిస్తున్నారు.
రక్తంలో గ్లూకోజ్ : రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీసి, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
- ముందస్తు భోజనం : రాత్రి 7 నుంచి 8 గంటల లోపు భోజనాన్ని ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- గ్యాప్ ఇవ్వడం : రాత్రి భోజనాన్ని నిద్రపోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే ముగించడం మంచిదంటున్నారు.
- తేలికపాటి ఆహారం : రాత్రిపూట ఆయిల్ ఫుడ్స్, మసాలా ఆహారాలకు బదులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
- వాకింగ్ : భోజనం చేసిన తర్వాత చిన్నపాటి నడక జీర్ణక్రియ, షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు నిత్యం 'అజీర్తిగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చట!

