కడుపుబ్బరంగా అనిపిస్తోందా? - సహజసిద్ధ పరిష్కారాలు ఇవేనట!
- జీర్ణ సమస్యల నియంత్రణకు ఇవి ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు

Published : July 17, 2026 at 2:31 PM IST
|Updated : July 17, 2026 at 2:43 PM IST
Lifestyle Changes to Reduce Bloating : ఇష్టమైన ఆహారం ఎక్కువగా తిన్నా, మలబద్ధకం ఉన్నా, కడుపులో గ్యాస్ ఏర్పడినా, నీళ్లు ఎక్కువగా తాగినా.. ఇలా పలు సందర్భాల్లో కడుపు ఉబ్బరంగా అనిపించడం మామూలే! దీంతో తలెత్తే అసౌకర్యం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టలేం. అయితే, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి : ఫైబర్, ద్రవాహారం తక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి మలబద్ధకానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య వల్ల కడుపుబ్బరం రావచ్చని చెబుతున్నారు. అందుకే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, నట్స్, గింజల్లో లాంటి వాటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు. వీటితోపాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలని తెలియజేస్తున్నారు.
గబగబా తినేస్తున్నారా? : సమయం లేదనో, ఇతర కారణాల వల్ల కొంతమంది గబగబా భోజనం చేసేస్తుంటారు. కడుపులో గ్యాస్, ఉబ్బరానికి ఇది కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇలా గబగబాగా తినడం వల్ల ఆహారంతోపాటు గాలి కూడా కడుపులోకి వెళ్లిపోతుందట. దీనివల్ల కడుపుబ్బరం వస్తుందని చెబుతున్నారు. అందుకే, భోజనానికి కనీసం అరగంటైనా కేటాయించాలని సూచిస్తున్నారు. అలాగే, ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా చురుగ్గా ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే, ఎక్కువ ఆహారం తీసుకోకుండా జాగ్రత్తపడచ్చని పేర్కొంటున్నారు. వేగంగా తినడం వల్ల గాలిని మింగడం జరిగి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యానికి దారితీస్తుందని clevelandclinic పేర్కొంది.
"అలర్ట్" శరీరం పంపే సంకేతాలను మీరు గుర్తిస్తున్నారా? - నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు!
వీటితో ఉపశమనం :
పెరుగు లేదా మజ్జిగ : కడుపులోని మంచి బ్యాక్టీరియా ఉబ్బరాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగా వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.
అల్లం టీ : అల్లం కడుపులో యాసిడ్ స్థాయిని క్రమబద్ధీకరించడం ద్వారా అజీర్ణం, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి ఇది ఒక సహజ నివారణగా పనిచేస్తుందని చెబుతున్నారు. అల్లం ఎగువ జీర్ణశయాంతర లక్షణాలను మెరుగుపరుస్తుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
పుదీనా టీ : పుదీనాలో ఉండే మెంథాల్ జీర్ణవ్యవస్థ కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు గ్యాస్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ముఖ్యమైన నూనెలు కడుపు ఉబ్బరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలని తగ్గిస్తాయని అంటున్నారు. స్వల్పకాలిక జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పెప్పర్‌మింట్ టీ విస్తృతంగా ఉపయోగిస్తారని National Library of Medicine పేర్కొంది.
ప్రశాంతంగా నిద్రపోవడం : రాత్రుళ్లు ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి దాటాక పడుకోవడం వల్ల నిద్ర సరిపోదంటున్నారు నిపుణులు. తద్వారా తీసుకున్న అరక్కపోవడం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే త్వరగా తినడం, వేళకు పడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది
గోరుచుట్టు వేధిస్తోందా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
బీపీకే కాదు, షుగర్ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

