కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? - ఈ చిట్కాలు పాటిస్తే మేలంటున్న నిపుణులు!
- వంటింటి పదార్థాలతో "కొలెస్ట్రాల్" నియంత్రణ - గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయట

Published : February 28, 2026 at 3:22 PM IST
Natural Remedies to Bring Down Cholesterol Levels : రక్తనాళాల్లో పూడికల్ని పోగేసి, చివరికి గుండెపోటు, స్ట్రోక్‌ను తెచ్చిపెట్టే కొలెస్ట్రాల్ అంటే అందరికీ భయమే. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి మన ఆహారపు అలవాట్లుతో పాటు జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ధనియాలు : ధనియాలను వంటల్లోనే కాకుండా వైద్యంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ధనియాల నీరు లేదా వాటి సారం, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి, గుండెను రక్షించడానికి తోడ్పడతాయని చెబుతున్నారు. వీటిని వంటల్లో లేదా కూరల్లో వాడుకోవడమే కాకుండా, ఉదయాన్నే ధనియాల నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ సులభమైన ఇంటి చిట్కా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు.
విటమిన్ 'కె' లోపంతో చాలా ఆరోగ్య సమస్యలు! - ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాలంటున్న నిపుణులు!
అవిసె గింజలు : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని అంటున్నారు. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వెల్లడిస్తున్నారు.
కరిగే పీచు పదార్థం పేగులలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ALA వాపును తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పొడి చేసిన అవిసె గింజలు లేదా అవిసె నూనె వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో రోజువారీ ఆహారంలో స్మూతీలు, తృణధాన్యాలు లేదా బేక్ చేసిన పదార్థాలలో అవిసె గింజలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ద్రాక్ష గింజల సారం : ద్రాక్ష గింజల సారంలో (Grape seed extract) 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తనాళాలను సంరక్షించడమే కాకుండా గుండెకు చేదోడుగా నిలుస్తాయంటున్నారు. ద్రాక్ష గింజల సారం మొత్తం కొలెస్ట్రాల్‌ను, LDL ను తగ్గించగలదని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఆపిల్స్, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, సిట్రస్ పండ్లు పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది LDL తగ్గించే ఒక రకమైన కరిగే ఫైబర్ అని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.
అంతేకాకుండా, ఇది రక్తనాళాలను మరింత దృఢంగా మారుస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ శక్తి కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. దీనివల్ల ధమనులు దెబ్బతినకుండా ఉంటాయని పేర్కొంటున్నారు. ద్రాక్ష గింజల సారానికి సంబంధించిన సప్లిమెంట్లను తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్య సూచికలు మెరుగుపడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్రీన్ టీ : గ్రీన్ టీలో 'కాటెచిన్స్' (catechins) అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి LDLను, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయంటున్నారు. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయని, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా, ప్రతిరోజూ చక్కెర కలపని కొన్ని కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందట.
దాల్చిన చెక్క : దాల్చిన చెక్క అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. దీని సువాసనతోపాటు, దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది మొత్తం కొలెస్ట్రాల్, LDL, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు, దాల్చిన చెక్క HDL స్థాయిలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. దీనికి కారణం దాల్చిన చెక్కలో ఉండే పాలీఫెనాల్స్ కారణమట. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి గుండె జబ్బులకు దారితీసే వాపు, కణాల నష్టాన్ని అరికట్టడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అయితే, ఏదైనా ఆరోగ్య మార్పుల కోసం దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిదంటున్నారు.
పసుపు : పసుపు ప్రతిరోజూ పసుపు లేదా కర్కుమిన్ తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL తగ్గుతాయని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు లేదా పాలు, టీ వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, పసుపు సప్లిమెంట్లను మాత్రం కేవలం డాక్టర్లు పర్యవేక్షణలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.
పచ్చి వెల్లుల్లి : ప్రతిరోజూ వెల్లుల్లి తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL తగ్గుతుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఈ తగ్గుదల గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను సమతుల్యంగా ఉంచుకోవడానికి వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం లేదా సప్లిమెంట్ల రూపంలో వాడటం ఒక సులభమైన మార్గమంటున్నారు నిపుణులు. వెల్లుల్లిని తాలింపుల్లో లేదా పచ్చడి రూపంలో వంటలకు సులభంగా జోడించవచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీరు దీనిని పచ్చిగా తినగలిగితే, ఒక వెల్లుల్లి రెబ్బను నలిపి, దానిని తినడానికి ముందు రెండు నిమిషాల పాటు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఒత్తిడిని గుర్తించడమే అసలు సమస్య? - మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?
కండరాలు బలంగా ఉండాలా? - నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!

