ETV Bharat / health

"ప్రెగ్నెన్సీ"లో నిద్ర పట్టడం లేదా? - ఇలా చేస్తే మంచిదట!

- తానూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నానన్న నటి సమంత - గర్భిణులు హాయిగా నిద్రపోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

Sleep Disturbances in Pregnancy
Sleep Disturbances in Pregnancy (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 17, 2026 at 5:06 PM IST

4 Min Read
Choose ETV Bharat

Sleep Disturbances in Pregnancy : మహిళలు ఎన్ని సాధించినా.. 'అమ్మా' పిలుపు ఇచ్చే అనుభూతి మరెందులోనూ దొరకదు. అందుకే, ప్రతీ మహిళ ప్రధాన కోరిక అది. గర్భిణి అయిన తర్వాత బిడ్డ తొలి కదలికలను అనుభూతి చెందడం, వారి గుండెచప్పుడు వినడం వంటి ఎన్నో ఆనంద క్షణాలు ఉంటాయి. కానీ, గర్భిణిగా ఉన్నప్పుడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవి సహజం కూడా! అయితే, చాలామంది వాటిని బయటికి చెప్పుకోవడానికి ఆసక్తి చూపరు. ఇంకొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. అయితే, ఇటీవల నటి సమంత తన గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న నిద్రలేమి గురించి తన ఇన్​స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. రాత్రిపూట నిద్రపోవడానికి తను ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిపారు. అయితే, గర్భధారణ సమయంలో నిద్రలేమి అనేది చాలా సాధారణమని నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

నిద్ర ఎందుకు క్షీణిస్తుంది? : గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, హార్మోన్లలో మార్పులు వస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు వేగంగా పెరగడం వల్ల, అది మహిళల మానసిక స్థితి, శారీరక శక్తిపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. తద్వారా నిద్రలేమి సమస్యలకూ కారణం కావచ్చని పేర్కొంటున్నారు. గర్భధారణ నిద్రలేమి కారణాలలో తరచుగా హార్మోన్లలో మార్పులు, శారీరక అసౌకర్యం, తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం వంటివి ఉంటాయని sleepfoundation పేర్కొంది.

అలాగే, బిడ్డ పెరిగేకొద్దీ, మంచం మీద సౌకర్యవంతంగా నిద్రపోవడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. బిడ్డ పడుకోవడానికి ఏ వైపు సౌకర్యవంతంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుందట. అంతేకాకుండా, తరచుగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కారణంగా నిద్రకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పిండం బరువు పెరిగి మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్లే ఇలా జరుగుతుందంటున్నారు.

బీపీకే కాదు, షుగర్‌ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

శారీరక, మానసిక మార్పులు : గర్భం దాల్చిన తర్వాత శారీరక అసౌకర్యాలు తరచుగా వస్తాయి. నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, గుండెల్లో మంట, సాధారణ ఒళ్లు నొప్పులు తరచుగా నిద్రకు భంగం కలిగిస్తాయంటున్నారు నిపుణులు. శరీరం చాలా అలసిపోయినప్పటికీ, మనసు మాత్రం మేల్కొని ఉంటుందని చెబుతున్నారు. గర్భవతి కడుపు, ఒళ్ళు నొప్పుల వల్ల సౌకర్యవంతమైన భంగిమలోకి రావడం కష్టంగా ఉంటుందని clevelandclinic పేర్కొంది.

ప్రెగ్నెన్సీలో పడుకునేటప్పుడు మనసులో అనేక ఆలోచనలు వస్తాయట. ఉదాహరణకు, ప్రసవం ఎలా ఉంటుందో, బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆసుపత్రి ఖర్చులు ఎంత అవుతాయో, బిడ్డ పుట్టిన తర్వాత మనం నిద్రపోగలమో లేదో వంటివి. ఈ ఆందోళనలు, భయాల వల్ల నిద్రపోవడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిరంతరం నిద్రలేమితో ఉన్నప్పుడు, అది పగటిపూట అలసట, చిరాకు పెరగడానికి దారితీస్తుందని అంటున్నారు.

హాయిగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? : గర్భధారణ సమయంలో వచ్చే నిద్రలేమికి మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మన రోజువారీ అలవాట్లలో కొన్ని సాధారణ మార్పులు చేసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని సూచిస్తున్నారు.

  • వారాంతాలతో సహా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.
  • నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటి నుంచి వెలువడే బ్లూ లైట్ అనేది నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ప్రభావితం చేసి, నిద్రకు భంగం కలిగిస్తాయని పేర్కొంటున్నారు. నిద్రపోయే ముందు టెలివిజన్, ఎలక్ట్రానిక్స్ వాడకాన్ని మానుకోవడం వంటి జీవనశైలి మార్పులు సహాయపడతాయని hopkinsmedicine పేర్కొంది.
  • రాత్రిపూట భారీ భోజనం మానుకోవడం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.
  • ఆరోగ్యాన్ని బట్టి, డాక్టర్లు సలహాతో పగటిపూట తేలికపాటి నడక లేదా సాధారణ వ్యాయామాలు చేయవచ్చని సలహా ఇస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట అలసట తగ్గి, మరింత సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు.
  • గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని National Institutes of Health పేర్కొంది. ఇలా పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నుముకపై ఒత్తిడి తగ్గి నిద్ర చక్కగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుందంటున్నారు.
  • నిద్రపోయే ముందు సోడా, కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించుకోవడం లేదా పరిమితం చేసుకోవాలని medlineplus పేర్కొంది.
  • నిద్రకు కనీసం గంట ముందు తల, కాళ్లను సున్నితంగా మసాజ్ చేయించుకుంటే నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.

డాక్టర్​ని ఎప్పుడు సంప్రదించాలి? : గర్భధారణ సమయంలో అప్పుడప్పుడూ నిద్రలేని రాత్రులు గడపడం సాధారణమే. అయితే, వరుసగా కొన్ని రోజుల పాటు నిద్రలేకపోతే లేదా పగటిపూట ఏ పని చేయకుండానే అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్​ సలహా లేకుండా ఎలాంటి నిద్ర మాత్రలు తీసుకోకూడదని అంటున్నారు. ఎందుకంటే, గర్భధారణ సమయంలో కొన్ని మందులు బిడ్డకు సురక్షితం కాకపోచ్చని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రొమ్ము క్యాన్సర్ ముప్పు - ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయట!

కడుపుబ్బరంగా అనిపిస్తోందా? - సహజసిద్ధ పరిష్కారాలు ఇవేనట!