రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
-కంటి సంరక్షణ అపోహలు - ఇవి తింటే కంటి సమస్యలు దరిచేరవంటున్న నిపుణులు!

Published : November 15, 2025 at 1:35 PM IST
Myths and Facts about Eye Sight: శరీరంలోని సున్నితమైన అవయవాల్లో 'కళ్లు' ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే, రోజూ ప్రపంచాన్ని చూడగలుగుతాం. మరి, ఇంతటి అమూల్యమైన చూపును ప్రసాదించే కళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నాం. ఎందుకంటే, కళ్ల గురించి, చూపును దెబ్బతీసే అంశాల గురించి చాలా మందికి సరైన అవగాహన లేకపోవడమే. పైగా ఎన్నెన్నో అపోహలూ రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో కంటిచూపుపై ఉన్న అపోహలు, వాటి వెనకున్న వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
అలా చదవడం వల్ల : తక్కువ వెలుతురులో చదివితే చూపు తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇది వాస్తవం కాదు. మసక వెలుతురులో చదవడం వల్ల కళ్లు అలసిపోయినట్లు అనిపించవచ్చు, కానీ అది హానికరం కాదని Stony Brook Medicine అధ్యయనం పేర్కొంది. కాబట్టి, పుస్తకం మీద నేరుగా వెలుతురు పడేలా లైటును అమర్చుకొని చదువుకోవడం మంచి పద్ధతి అని సూచిస్తున్నారు.
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - ఆశ్చర్యకరమైన ఫలితాలకు అవకాశం ఇచ్చినట్టే!
క్యారెట్ తింటేనే : కంటి ఆరోగ్యానికి క్యారెట్లను మించినవి లేవనేది కొంతమంది భావన. ఆరోగ్యకరమైన కంటి చూపును నిర్వహించడానికి శరీరానికి విటమిన్ ఎ చాలా అవసరం. క్యారెట్లలో ఈ పోషకం అధిక మొత్తంలో ఉంటుంది. కానీ శరీరానికి దృష్టికి విటమిన్ ఎ చాలా తక్కువ మొత్తంలో మాత్రమే అవసరమని American Academy of Ophthalmology అధ్యయనం పేర్కొంది . దీనిని ముదురు ఆకుకూరలు, ముదురు రంగు కూరగాయలు, పాలు, చేపలు వంటి అనేక వనరుల ద్వారా పొందవచ్చని తెలిపింది. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని, కానీ అది దృష్టిని మెరుగుపరచదు లేదా అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు అవసరం రాకుండా చేస్తుందని చెబుతుంది. ఇవి వయసుతో పాటు దాడిచేసే శుక్లాలు, రెటీనా మధ్యభాగం క్షీణించటం వంటి సమస్యల బారినపడకుండానూ కాపాడతాయంటున్నారు నిపుణులు.
కళ్లద్దాలు వల్ల : కాంటాక్ట్ లెన్సులు లేదా కళ్లద్దాలను రోజంతా పెట్టుకోవటం మంచిది కాదని, దీంతో కళ్లు వాటికి అలవాటు పడిపోతాయనేది మరికొందరి అపోహ. ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. హ్రస్వదృష్టి , దూరదృష్టి , ఆస్టిగ్మాటిజం లేదా ప్రెస్బియోపియాను సరిచేయడానికి ధరించే కళ్లద్దాలు కళ్లను బలహీనపరచవని mayoclinic అధ్యయనం పేర్కొంది. మామూలుగా వయసు మీద పడటం, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతుంటుందని తెలియజేస్తున్నారు. అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. అంతే తప్ప కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గటం, కళ్లు దెబ్బతినటం వంటి ముప్పులేవీ ఉండవని పేర్కొంటున్నారు. సరైన కళ్లద్దాలు ధరించడం వల్ల కూడా కంటి ఒత్తిడి తగ్గుతుందని Washu Medicine అధ్యయనం పేర్కొంది.
కంప్యూటర్ ముందు : అదే పనిగా కంప్యూటర్ వైపు చూడటం కళ్లకు ప్రమాదకరమని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదని, స్క్రీన్ వైపు గంటలకొద్దీ చూడటం వల్ల కళ్లు అలసిపోవటం, ఒత్తిడికి లోనవటం సహజమే గానీ చూపేమీ దెబ్బతినదని నిపుణులు అంటున్నారు. అయితే, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూచోవాల్సి వస్తే 20-20-20 సూత్రాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఎలాగంటే, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోని దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే తరచుగా కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దీంతో కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు.
అలా చేస్తే : కంటి వ్యాయామాలు చేస్తే కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఉండదని కొందరు అనుకుంటుంటారు. కంటి వ్యాయామాలతో కంటి కండరాలు బలోపేతం అవుతాయని, కానీ తగ్గిపోయిన చూపు తిరిగి మామూలు స్థాయికేమీ రాదంటున్నారు నిపుణులు. కంటి ఆకృతి, కంటి కణజాలం వంటి వ్యాయామాలతో మారిపోవని తెలియజేస్తున్నారు. కంటి వ్యాయామాలు దృష్టిని మెరుగుపరచడం లేదా సంరక్షించడం లేదా అద్దాల అవసరాన్ని తగ్గించడం వంటివి జరగవని American Academy of Ophthalmology అధ్యయనం పేర్కొంది.
ఈ క్రమంలో చూపు తగ్గటాన్ని ఎవరు ఆపలేరని కొంతమంది అనుకుంటుంటారు. కానీ చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరుమిట్లు గొలిపే కాంతులు మెరవటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. కారణాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే తగు చికిత్సలతో సరి చేయొచ్చని అంటున్నారు. కనీసం చూపు తగ్గటాన్నయినా నెమ్మదింపజేయొచ్చని తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హైబీపీ కొత్త మార్గదర్శకాలు ఇవే! - ఏం సూచిస్తున్నాయో తెలుసా?
డిప్రెషన్ మందులు వాడుతూ మద్యం సేవిస్తున్నారా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

