ETV Bharat / health

బహుళభాషా నైపుణ్యంతో మెదడుకెంతో మేలు! - తాజా పరిశోధనలో కీలక విషయాలు!

- జ్ఞాపక శక్తికి చాలా ప్రయోజనమంటున్న పరిశోధకులు

Multilingualism
Multilingualism (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : December 15, 2025 at 3:33 PM IST

4 Min Read
Choose ETV Bharat

Multilingualism and Healthy Aging : భాష.. మన భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే వాహకం. మనల్ని సమాజంతో అనుసంధానం చేసే అదృశ్య సాధనం. కొందరు మరో అడుగు ముందుకేసి ఒకటి కన్నా ఎక్కువ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేర్పును సాధిస్తుంటారు. ఇలాంటి బహుళభాషా నైపుణ్యంతో మెదడుకు మేలు జరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. ఇలాంటి వారి మెదడులో వార్ధక్య ప్రక్రియ నెమ్మదిస్తుందని పేర్కొంది.

వయసు మీద పడే కొద్దీ మెదడులో మార్పులు వస్తాయి. అవి ఆకస్మికంగా జరిపోవు. క్రమంగా చోటుచేసుకుంటాయి. జరిగిపోయిన ఘటనలను నెమరువేసుకునే సామర్థ్యం మందగించడం, ఏకాగ్రత తగ్గడం, విషయగ్రహణ సామర్థ్యంలో లోపాల రూపంలో అవి కనిపిస్తాయి. అయితే, దీన్ని నెమ్మదింపచేయవచ్చా అన్న ప్రశ్న చాలామందికి ఉంటుంది. విషయగ్రహణ సామర్థ్యం, జ్ఞాపకశక్తిని స్వల్పంగా మెరుగుపరచడానికి కొన్ని బ్రెయిన్ టీజర్లు లేదా పజిల్స్ వంటివాటిని సూచిస్తుంటారు. అయితే, భాషా సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం బాగా ఉపయోగపడుతుందని తాజా పరిశోధన తేల్చింది. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఏమిటీ పరిశోధన : స్పెయిన్​లోని బాస్క్ సెంటర్ ఆన్ కాగ్నిషన్, బ్రెయిన్ అండ్ లాంగ్వేజ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 27 ఐరోపా దేశాల్లో 51 నుంచి 91 ఏళ్ల మధ్య ఉన్న 86 వేల మంది ఆరోగ్యవంతులకు సంబంధించిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. ఈ అధ్యయనం ఫలితాలను Nature aging జర్నల్‌ ప్రచురించింది.

నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా? - ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు!

ఒకటే భాష మాట్లాడేవారితో పోలిస్తే బహుభాషలు మాట్లాడే వారి మెదడులో వార్ధక్య సంకేతాలు సగం మేర తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అయితే, బహుళ భాషలు మాట్లాడే సమాజంలో ఉండటం వల్ల విషయగ్రహణ సామర్థ్యం, మెదడు పనితీరుల్లో క్షీణత ఆలస్యం కావొచ్చని తెలియజేస్తున్నారు. మరో భాషను నేర్చుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి నాడీ క్షీణత వ్యాధుల రాకను ఆలస్యం చేయవచ్చని Frontiers జర్నల్ ప్రచురించింది.

అలాగే, బహుభాషత్వం వల్ల ఒత్తిడి నుంచి రక్షణ పొందొచ్చంటున్నారు పరిశోధకులు. ఈ లెక్కన చూస్తే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెరుగైన సాధనంగా బహుభాషత్వం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ భాషలు మాట్లాడటాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ఎక్కువ లబ్ధి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఏ వయసులోనైనా ఈ సూత్రాన్ని అనుసరించి ప్రయోజనాలు పొందొచ్చని పేర్కొంటున్నారు. మరో భాషను నేర్చుకోవడం మొదలుపెట్టిన కొద్దికాలానికే ఈ ఫలితాలను చూడొచ్చని వెల్లడిస్తున్నారు.

సామాజిక ప్రయోజనాలూ : ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల రోజువారీ జీవితంలోనూ అనేక ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీదపడేకొద్దీ మన సామాజిక బంధాలు తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా, ఒంటరితనంలో ఉండిపోవాల్సి రావొచ్చని తెలియజేస్తున్నారు. దీనివల్ల విషయగ్రహణ సామర్థ్యం, భావోద్వేగ ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల సామాజిక సంధానత కూడా పెరుగుతుందంటున్నారు. భాష అనేది గొప్ప సంధానకర్తని, దీని ద్వారా ఇతరులతో మమేకం కావడం సులభమని తెలియజేస్తున్నారు. ఇతర సమాజాలు, సంస్కృతులతో ఈజీగా కలిసిపోయి సామాజిక బంధాలను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

సృజనకూ రెక్కలు : బహుళ భాషల వల్ల బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పొందొచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుందని చెబుతున్నారు. మెరుగైన ఏకాగ్రత వంటివి కూడా సాధ్యమవుతాయని తెలియజేస్తున్నారు. ఏకకాలంలో భిన్నపనులు చేసే నైపుణ్యం (మల్టీ టాస్కింగ్), నిర్ణయాలు తీసుకోవడం వంటి కార్యనిర్వాహక పనుల్లో వీరు మరింత సమర్థంగా వ్యవహరించగలరని పేర్కొంటున్నారు.

ఎందుకు? : బహుభాషత్వం వల్ల మెదడు నెట్​వర్క్​లు నిరంతరం పనిచేస్తాయి. దీనివల్ల అవి బలోపేతం కావొచ్చు. మార్చి మార్చి రెండు భాషలను ఉపయోగించడానికి మెదడు తీవ్రస్థాయిలో శ్రమించాలంటున్నారు పరిశోధకులు. తీవ్రస్థాయి శారీరక వ్యాయామం చేసిన రీతిలో ఈ ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఒక భాషను నేర్చుకొని, దాన్ని చురుగ్గా వాడటం మొదలు పెట్టాక.. అప్పటివరకూ ఉపయోగించిన భాష నిద్రాణంగా ఉండిపోదని తెలియజేస్తున్నారు. నిజానికి ద్విభాష అనేది మెదడులోని భిన్న భాగాల మధ్య జరిగే సంక్లిష్ట చర్యల క్రమం అని, వీటిని మెరుగ్గా సమన్వయం చేసుకోగలిగేవారు సమర్థంగా రాణించగలరని పేర్కొంటున్నారు.

సమాజమే తరగతి గది : భాషను నేర్చుకోవడానికి తరగతి గదికి వెళ్లనవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. బహుళభాషలు మాట్లాడేవారున్న సమాజంలో నివసించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందంటున్నారు. మాటలకు సంబంధించిన ధ్వనులను ఆలకించడానికి అలవాటు పడటం ద్వారా భాషను మెదడు గ్రహిస్తుంటుందని వివరిస్తున్నారు. భిన్న సంస్కృతులతో మమేకం కావడం వల్ల మెదడుపై మరింత సానుకూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆహారం ఎన్నిసార్లు నమలాలి? - తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జర్నీ చేస్తే వాంతులు, తల తిరుగుతోందా? - ఈ టిప్స్​తో చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు