ETV Bharat / health

నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా? - ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు!

- కఠినమైన వ్యాయామం నుంచి.. బ్రేక్​ఫాస్ట్ తినకపోవడం దాకా - ఈ అలవాట్లు వెంటనే మానుకోవాలని సూచన

Morning waking up
Morning waking up (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : December 11, 2025 at 4:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Avoid These Morning Mistakes : ఇప్పుడు అంతా బిజీబిజీ. కొంతమంది ఉదయం లేవగానే కాఫీ, టీ మాత్రమే తాగేసి సమయం లేదంటూ బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్తుంటారు. ఇలాంటి మరికొన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. మరి, ఉదయం చేసే చిన్న చిన్న పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

కుడిపక్కకు తిరిగి : కొందరు ఉదయం నిద్ర లేచేటప్పుడు వెల్లకిలా పడుకొని అదే పొజిషన్‌లో గబుక్కున లేచి కూర్చుంటారు. కానీ అలా లేవడం వల్ల బిగుసుకుపోయిన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం లేచేటప్పుడు కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిదంటున్నారు. ఆపై కాస్త అటూ ఇటూ కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుందని పేర్కొంటున్నారు. ఇదే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుందని తెలియజేస్తున్నారు.

కంగారు వద్దు : కొందరు ఉదయం త్వరగానే నిద్ర లేచినా ఆఫీసు టైం వరకు ఏదో ఒక పని చేస్తూ ఆఖరి క్షణాల్లో కంగారుగా రెడీ అవుతుంటారు. ఫలితంగా, మానసిక ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అలా జరగకుండా.. ఆ రోజుకు కావాల్సిన కాయగూరలు తరుక్కోవడం, ఆఫీసుకి వేసుకునే డ్రస్ తీసి పెట్టుకోవడం వంటి పనుల్ని ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా, మరుసటి రోజు ఉదయం ఎలాంటి టెన్షనూ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి, పనులు ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని సలహా ఇస్తున్నారు.

కర్రీ పార్శిల్‌ తెచ్చుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

బ్రేక్‌ఫాస్ట్‌ మానొద్దు! : ఆఫీస్‌కు టైం అవుతోందని బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా మానేయడం వల్ల దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు.. ఒబెసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌కూ సమయం సరిపోతుందని సూచిస్తున్నారు. అల్పాహారం దాటవేయడం వల్ల నడుము చుట్టుకొలత, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) రెండింటిపైనా ప్రభావం చూపుతుందని National Library of Medicine ఓ అధ్యయనంలో పేర్కొంది.

Checking mobile phone
లేవగానే మొబైల్‌ చెక్ చేసుకోవడం (Getty Images)

లేవగానే మొబైలా : చాలామంది ఉదయం లేవగానే మొబైల్‌ చెక్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతికూల సమాచారం కంట పడితే మూడ్ మొత్తం అప్‌సెట్ అవుతుందంటున్నారు నిపుణులు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి అత్యవసర కాల్స్, మెసేజెస్ చేసే పనులుంటే తప్ప, ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్లకపోవడం మంచిదని పేర్కొంటున్నారు. దీనికి బదులుగా ఉదయం లేవగానే కాసేపు పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చని వివరిస్తున్నారు. ప్రతికూల విషయాలతో రోజును ప్రారంభించడం వల్ల మానసిక స్థితి, సృజనాత్మకత, ఉత్పాదకత, ఆత్మవిశ్వాసం తగ్గుతాయని Fielding Graduate University అధ్యయనం పేర్కొంది.

Warm up
వార్మప్‌ (Getty Images)

వార్మప్‌తో షురూ! : ఉదయాన్నే చేసే వ్యాయామం రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఉదయం లేవగానే కొంతమంది అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారని, ఇవి కండరాల ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు బిగుసుకుపోతాయని పేర్కొంటున్నారు. కాబట్టి, వీటిని వెంటవెంటనే కదిలించడం, ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం కాకుండా.. నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నారు. ఇందుకోసం వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిదంటున్నారు. దీంతో కండరాలు రిలాక్సయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆపై అసలైన వ్యాయామ రొటీన్‌ని పాటించొచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దట!

ఇంట్లోనే బీపీ, షుగర్ చెక్ చేసుకుంటున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించాలట!