ETV Bharat / health

విటమిన్ 'D' లోపంతో ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో తెలుసా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

విటమిన్​ డి లోపంతో బాధపడుతున్నారా? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు!

Vitamin D
Vitamin D (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : December 22, 2025 at 5:01 PM IST

4 Min Read
Choose ETV Bharat

Vitamin D Deficiency : తరచూ జబ్బు పడటం, ఉన్నట్టుండి జుట్టు ఊడిపోవడం, అరగంట పనిచేసినా అలసటతో కూర్చువడం, మందులు వేసుకున్నా బీపీ కంట్రోల్ కాకపోవడం ఈ అనారోగ్యాలన్నింటికీ ప్రధాన కారణం విటమిన్ డి లోపం. సాధారణంగా 'సన్ షైన్ విటమిన్' గా పిలిచే విటమిన్ డి, కేవలం ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శరీరంలో ఒక 'హార్మోన్'లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది షుగర్ మెటబాలిజం, కొవ్వు ప్రక్రియలు, వాపు, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. విటమిన్ డి లోపం వల్ల టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

glucose level in blood
రక్తంలో గ్లూకోజ్ స్థాయి (Getty Images)

ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం : ఆరోగ్యకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి కీలకమైన ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో విటమిన్ డి పాత్ర పోషిస్తుందని MDPI జర్నల్ ప్రచురించింది. శరీరంలో విటమిన్ డి తగినంతగా ఉన్నప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. దీంతో కణజాలాలు ఇన్సులిన్ సంకేతాలకు బాగా స్పందిస్తాయని పేర్కొంటున్నారు. విటమిన్ డి లోపం వల్ల కణాలు ఇన్సులిన్​ను సరిగ్గా స్పందించవని, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయంటున్నారు.

ఫ్యాట్, కాలేయ ఆరోగ్యం : కాలేయం ఫ్యాట్ మెటబాలిజంను నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్ డి లోపాన్ని సరిదిద్దడం ద్వారా కాలేయంలో వాపును తగ్గించి, కొవ్వు స్థాయిలను మెరుగుపరచవచ్చని సూచిస్తున్నారు.

డయాబెటిస్, PCOS, అలసటతో సంబంధం : విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి టైప్ 2 డయాబెటిస్, PCOS వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, వివరించలేని అలసట, ఒళ్లు నొప్పులు, తక్కువ శక్తి ఉండటానికి విటమిన్ డి లోపం ఒక ముఖ్య కారణం కావచ్చంటున్నారు నిపుణులు. టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న రోగులలో విటమిన్ డి లోపం ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి దారితీస్తుందని BMC జర్నల్ ప్రచురించింది.

ఈ ఆహార పదార్థాలు అతిగా తింటే - బాడీలో 'వాపు'న​కు కారణమవుతాయట!

విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది? : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ చాలా మందిలో ఈ లోపం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు:

  • ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం
  • సన్‌స్క్రీన్ వాడకం వల్ల చర్మం విటమిన్ డిని తయారు చేసుకోలేకపోవడం.
  • చర్మం నల్లగా ఉన్నవారిలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఎక్కువ సూర్యరశ్మి అవసరమవుతుంది.
  • ఒబెసిటీ - కొవ్వు కణాలు విటమిన్ డిని నిల్వ చేసుకుని రక్తంలోకి విడుదల చేయవు.
cholesterol
కొలెస్ట్రాల్ (Getty Images)

మరి ఏం చేయాలి? : ఉదయం 9 గంటల్లోపు వచ్చే ఎండ నుంచే డి విటమిన్ అందుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, నిజానికి ఉదయం 10 - 3 గంటల మధ్య ఇది మనకు పుష్కలంగా లభిస్తుందంటున్నారు నిపుణులు. ఈ టైంలో 15-30 నిమిషాల వరకూ ఎండ మన శరీరానికి తగిలితే సరిపోతుందని పేర్కొంటున్నారు. సూర్యుడి నుంచి సరైన విటమిన్ D సప్లిమెంట్ పొందడానికి, సూర్యరశ్మికి ఉత్తమ సమయం మధ్యాహ్నం అని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

  • శరీరానికి పూర్తిగా కప్పే దుస్తులు వేసుకుంటే, మన చర్మానికి సూర్మరశ్మి అసలు తగలదని చెబుతున్నారు. అలాగే, సన్​స్క్రీన్ లోషన్ రాసుకున్నా విటమిన్ డి అంతగా తయారవ్వదని వివరిస్తున్నారు. కాబట్టి, ఎండ కోసం బయటకు వెళ్లినప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
  • ఇంట్లో కిటికీలు, కారు, బస్సులో వెళుతున్నప్పుడూ అద్దాల మీదుగా సూర్యరశ్మి ఒంటి మీద పడటం పెద్దగా ఉపయోగపడదని పేర్కొంటున్నారు.
  • హానికరమైన సూర్య కిరణాలను చర్మంలో వర్ణద్రవ్యం (మెలనిన్) అడ్డుకుంటుందంటున్నారు నిపుణులు. అందుకే, ముదురు రంగు చర్మం ఉన్నవాళ్లు ఇంకాస్త ఎక్కువసేపు ఎండలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
  • పిల్లల్ని రోజంతా ఇంట్లోనే ఉంచకుండా ఆరుబయటా ఆడనివ్వాలంటున్నారు. పెద్దవాళ్లు కూడా వీలు కుదుర్చుకుని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూనో, వాకింగ్ చేస్తూనో ఎండలో గడపాలని పేర్కొంటున్నారు.
  • కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా డి విటమిన్ లభిస్తుంది. ఎండతో పోలిస్తే అది తక్కువే అయినా ఆ డైట్​ని ఫాలో అయితే ఈ లోపాన్ని కొంత తగ్గించుకోవచ్చని తెలియజేస్తున్నారు.

ఎప్పుడు పరీక్షించుకోవాలి : నిద్రపట్టకపోవడం, నీరసం, అలసట, ఒళ్లునొప్పులు ఇవన్నీ మామూలు అనారోగ్య సమస్యలే కదా, అంటూ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, PCOS, ఒబెసిటీ, ఎముకల బలహీనత లేదా విపరీతమైన అలసట ఉన్నవారు కనీసం ఆరు నెలలకోసారైనా డి విటమిన్ రక్త పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ విటమిన్ లోపం స్థాయిని బట్టి తగిన మోతాదులో డాక్టర్లు ట్యాబెట్లూ, షాట్స్ లాంటి డి విటమిన్ సప్లిమెంట్లను సూచిస్తారని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రక్త మార్పిడితో HIV ముప్పు! - WHO మార్గదర్శకాలు ఇవే!

కిడ్నీలో రాళ్ల సమస్య రాకూడదంటే - ఈ జాగ్రత్తలు పాటించాలట!