ETV Bharat / health

"కిడ్నీల్లో నాలుగు రకాల రాళ్లు" - ఎవరిలో, ఎలా వస్తాయో తెలుసా?

పదేపదే కిడ్నీ స్టోన్స్ కారణాలు, లక్షణాలివే! - నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివే!

Kidney Stones
Kidney Stones (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : June 3, 2026 at 3:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Recurring Kidney Stones : శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం, రక్త ప్రవాహంలో సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి అవసరమైన ఖనిజాలను నియంత్రించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రంలో ఈ ఖనిజాలు, లవణాలను కరిగించడానికి సరిపడా ద్రవాలు లేనప్పుడు, అవి స్పటికాలుగా మారి కిడ్నీ స్టోన్స్​గా ఏర్పడతాయి. ఇవి మూత్రనాళంలో ఎక్కడైనా గట్టి నిక్షేపాలుగా మారి, తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జనకు అడ్డంకిగా మారతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

రకాలు : కిడ్నీ స్టోన్స్​లో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట కారణాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

క్యాల్షియం స్టోన్స్ : ఇది అత్యంత సాధారణమైన రకం. ఇవి క్యాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి.

స్ట్రువైట్ స్టోన్స్ : ఇవి తరచుగా మూత్రనాళ ఇన్​ఫెక్షన్లతో ముడిపడి ఉంటాయి. ఇవి చాలా తక్కువ లక్షణాలతో పెద్దవిగా పెరుగుతాయి.

యూరిక్ యాసిడ్ స్టోన్స్ : దీర్ఘకాలిక విరేచనాలు, అధిక ప్రొటీన్ ఆహారం లేదా పోషకాల శోషణ లోపాల వల్ల శరీరంలో ద్రవాలు వేగంగా తగ్గిపోయే వ్యక్తులలో ఇలాంటి స్టోన్స్​ ఏర్పడతాయి.

సిస్టీన్ స్టోన్స్ : ఇవి 'సిస్టినూరియా' అనే వంశపారంపర్య సమస్య ఉన్నవారిలో వస్తాయి. ఈ స్థితిలో కిడ్నీలు ఒక నిర్దిష్ట అమైనో ఆమ్లాన్ని అధికంగా కోల్పోతుంది.

చిన్న వయస్సులో మోకాళ్ల, తుంటి నొప్పులా? - ఈ చిన్న చిన్న అలవాట్లే కారణమని తెలుసా?

medlineplus ప్రకారం, లక్షణాలు:

  • వెనుక భాగంలో లేదా పక్కటెముకల భాగంలో తగ్గని తీవ్రమైన నొప్పి
  • మూత్రంలో రక్తం
  • జ్వరం, చలి
  • వాంతులు
  • దుర్వాసన వచ్చే లేదా మబ్బుగా కనిపించే మూత్రం
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం

పదేపదే కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణాలు : కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి, అవి పదేపదే రావడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయట. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోవడం, ప్రొటీన్లు, ఉప్పు లేదా షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, క్యాల్షియం, పొటాషియం లేదా మెగ్నీషియం తక్కువగా తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. అలాగే, కొన్ని రకాల మందులు, సప్లిమెంట్లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వాటిలో క్యాల్షియం ఆధారిత యాంటాసిడ్లు, కొన్ని రకాల మైగ్రేన్, డిప్రెషన్ మందులు కూడా కారణమవుతాయి. అంతేకాదు, జీర్ణవ్యవస్థ లేదా మూత్రనాళాన్ని ప్రభావితం చేసే అంతర్లీన వైద్య సమస్యలు కూడా పదేపదే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతాయట. కిడ్నీలో రాళ్లు తిరిగి ఏర్పడటానికి గల ప్రమాద కారకాలలో గతంలో అనేకసార్లు రాళ్లు ఏర్పడటం, చిన్న వయస్సులోనే రాళ్లు రావడం, పురుషులు కావడం, కుటుంబంలో మూత్రపిండాల రాళ్ల చరిత్ర ఉండటం, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నాయని American Journal of Kidney Diseases పేర్కొంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :

తగినంత నీరు తాగడం : మూత్రాన్ని పలుచగా చేయడానికి, ఖనిజాలు స్పటికాలుగా మారే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలంటున్నారు నిపుణులు.

క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం : పాల ఉత్పత్తులు వంటి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుందట.

ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం : రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి తక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం : పాలకూర, స్విస్ చార్డ్, నేవీ బీన్స్, బీట్​రూట్, బాదం వంటి కొన్ని అధిక ఆక్సలేట్ ఆహారాలను పరిమితం చేయలని National Kidney Foundation పేర్కొంది.

అంతర్లీన ఆరోగ్య సమస్యలు : జీర్ణ లేదా మూత్ర వ్యవస్థలను ప్రభావితం చేసే సమస్యలు అనేవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చట. కాబట్టి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయో పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కరెంటుతో కండలా? - EMS ట్రెండ్​తో లాభమెంత? నష్టమెంత?

పక్షవాతానికి "రిహాబిలిటేషన్" చికిత్స - ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?