పిల్లల్లో టైప్ -1 మధుమేహాన్ని గుర్తించండి - తొలిసారిగా మార్గదర్శకాలను జారీచేసిన కేంద్రం!
T4 పై దృష్టి పెట్టండి - గుర్తిస్తే చికిత్సకు సంబంధించి పూర్తి ప్యాకేజీ ఫ్రీ

Published : May 4, 2026 at 5:16 PM IST
Health Ministry Issues Guidelines on Childhood Diabetes Care : డయాబెటిస్ అనేది పెద్దవాళ్లనే కాదు, పిల్లలనూ పట్టి పీడిస్తోంది. ఆట పాటలతో సాగాల్సిన బాల్యాన్ని అవస్థలకు గురిచేస్తోంది. జీవనశైలి మార్పులు, ఊబకాయమే దీనికి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ లక్షణాలను గుర్తించేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలు : పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ లక్షణాలను త్వరగా గుర్తించేందుకు 'T4'పై దృష్టి సారించాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
1. టాయ్‌లెట్ - తరచూ మూత్రానికి వెళ్లడం.
2. థర్స్టీ - అధిక దాహం.
3. టయర్డ్ - అలసిపోవడం
4. థిన్నర్ - అకస్మాత్తుగా బరువు తగ్గడం
ఇలాంటి లక్షణాలను గమనిస్తూ ఉండాలని సూచించింది. పేరెంట్స్, టీచర్లు పిల్లల్లో ఈ లక్షణాలను గమనిస్తే టైప్-1 డయాబెటిస్‌ను త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర, ఆరోగ్య శాఖ పేర్కొంది. దీనికి వైద్యం అందించకుండా, అలాగే వదిలేస్తే ప్రాణానికి ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా పిల్లల్లో డయాబెటిస్ నిర్వహణ కోసం జాతీయ మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లల్లో ఇన్సులిన్ తయారీ నిలిచిపోయినప్పుడు టైప్ 1 డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. వారిలో డయాబెటిస్‌ని నియంత్రించకపోతే అది చూపు కోల్పోవడం, కిడ్నీ వైఫల్యం, హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
మీరు చేసే చిన్న తప్పులే మెదడును దెబ్బతీస్తాయట! - అవేంటో తెలుసా?
పాఠశాల, ఆరోగ్య కేంద్రాల స్థాయిలో : పుట్టిన బిడ్డ నుంచి 18 ఏళ్ల ఉండేవారికి సార్వత్రిక స్క్రీనింగ్‌పై ఈ ఫ్రేమ్ వర్క్ దృష్టి సారించనుంది. పాఠశాలలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో తొలుత పిల్లల్లో డయాబెటిస్ సమస్యను గుర్తిస్తారు. అక్కడ ఎవరికైనా డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో డయాబెటిస్ ఉన్నట్లు తేలిన వారిని జిల్లా హాస్పిటల్‌కు పంపి తదుపరి పరీక్షలు, వైద్యం అందిస్తారు. డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సకు సంబంధించిన పూర్తి ప్యాకేజీని ఉచితంగా అందిస్తారు.
అవగాహన ముఖ్యమంటున్న నిపుణులు : టైప్ 1 డయాబెటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఎక్కువ శాతం పిల్లల్లోనే కనిపిస్తుందంటున్నారు నిపుణులు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పిల్లలు మాదిరిగానే వారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారని చెబుతున్నారు. కానీ, పిల్లలకు సంక్రమించే ఈ వ్యాధిని తల్లిదండ్రులు అవగాహనా లేమితో తర్వగా గుర్తించలేకపోతున్నారు. బరువు తగ్గిపోవడం, విపరీతమైన దాహం, ఆకలి, కడుపులో నొప్పి, వాంతులు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్లును సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ అయినా తర్వాత ఆందోళన అవసరం లేదు. డాక్టర్లు సూచించిన మేరకు ఇన్సులిన్ తీసుకోవడం, ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులతో సాధారణ జీవితం గడపవచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డయాబెటిస్ మోసుకొచ్చే ఇతర వ్యాధులు ఏంటో తెలుసా?
"గుండెపోటు" ముందుగానే ఇలా హెచ్చరిస్తుందట - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

