ETV Bharat / health

కండరాలు బలంగా ఉండాలా? - నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!

-పోషకాహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి- మెనూలో వీటిని చేర్చుకుంటే మంచిదంటున్న నిపుణులు!

Muscle Strength
Muscle Strength (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : February 26, 2026 at 2:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Muscle Strength Gain Tips: మనం రోజూ రకరకాల పనులు చేస్తుంటాం. నడవటం వంటి తేలికైన పనుల దగ్గర నుంచి బరువులు ఎత్తటం వంటి కష్టమైన పనుల వరకూ ఎన్నెన్నో చేస్తుంటాం. వీటి అన్నింటినీ సజావుగా చేయాలంటే కండరాలు బలంగా ఉండటం ఎంతో అవసరం. కానీ, వయసు మీద పడుతున్న కొద్దీ మన కండరాల బలం కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొంతమంది బరువు ఎక్కువగా ఉండటం వల్ల కండరబలం క్షీణిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కండరాల సామర్థ్యం పెరగాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు. అది ఇప్పుడు తెలుసుకుందాం!

కండరాల క్షీణతకు కారణాలు : మధ్యవయసు నుంచి ఏటా 1-2 శాతం చొప్పున కండరాలు క్షీణిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా 80 ఏళ్లు వచ్చేసరికి సుమారు 40 శాతం కండరాల మోతాదు తగ్గిపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో శారీరక శ్రమ లేకపోవటం, టెస్టొస్టెరాన్, గ్రోత్​హార్మోన్ వంటి హార్మోన్లు తగ్గటం, వయసుతో పాటు శరీరంలో తలెత్తే వాపు ప్రక్రియ.. ప్రొటీన్ తగినంత తీసుకోకపోవటం వంటివన్నీ కండరాల క్షీణతకు దారితీస్తుంటాయని పేర్కొంటున్నారు.

కాలి కండరాలు బలహీనమైతే నడక వేగం తగ్గడంతో పాటు కింద పడిపోయే ముప్పూ పెరుగుతుందంటున్నారు నిపుణులు. అయితే, కండరాలకు కాసింత పని చెప్పటం, సమతులాహారం తీసుకోవటం ద్వారా దీన్ని నెమ్మదింపజేసుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా, మధ్యవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదట.

నిద్రలో భయం, హఠాత్తుగా మెలకువ! - 'నైట్ టెర్రర్' వేధిస్తోందా?

బలోపేతానికి ఏం చేయాలి : బరువు ఎక్కువగా ఉన్నవారు అదుపులో ఉండటంతో పాటు కొవ్వు శాతాన్ని తగ్గించుకుని కండరాల దృఢత్వాన్ని పెంచుకోవాలంటున్నారు ప్రముఖ పోషహాకార నిపుణులు డాక్టర్ లతాశశి. ఇందుకు పోషకాహారం ఒక్కటే సరిపోదని చెబుతున్నారు. బ్రిస్క్ వాకింగ్, స్మిమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు వారానికి 4-5 రోజులు 30 నిమిషాల పాటు తప్పనిసరిగా చేయాలని అంటున్నారు. ఇవి చేస్తూనే క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉంటే.. బ్రౌన్ రైస్, మిల్లెట్స్​తో చేసిన చపాతీ, పప్పు దినుసులు, పనీర్, సోయా వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఆకుకూరలు, కాయగూరల్ని తక్కువ నూనెతో వండి తినాలని సలహా ఇస్తున్నారు. చికెన్, చేపలు, గుడ్డు ఆహారంలో తప్పనిసరిగా ఉండాలని తెలియజేస్తున్నారు. అలాగే, రోజూ తినే ఆహారంలో ఆయిల్ నాలుగు టీస్పూన్లకు మించనీయొద్దని పేర్కొంటున్నారు. మైదా, బేకరీ పదార్థాలు, రిఫైన్డ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని అంటున్నారు. సుమారు 124 గ్రా. చొప్పున పండ్లు, సలాడ్లు రోజూ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. నట్స్, సీడ్స్​ను మితంగా తీసుకోవాలని వివరిస్తున్నారు. వీటితో పాటు 7-8 గంటలు నిద్ర అవసరమని సూచిస్తున్నారు. రోజూ 3 లీటర్లు నీళ్లు తప్పనిసరిగా తాగాలని సలహా ఇస్తున్నారు.

  • నెమ్మదిగా కదులుతూ, కదలికలపై మనసు పెట్టి చేసే యోగా, తాయ్​ చీ వంటి సంప్రదాయ పద్ధతులు కూడా ఎంతో మేలు చేస్తాయని nhs.uk అధ్యయనం పేర్కొంది. ఇవి కండరాలను, కీళ్లను బలోపేతం చేయటంతో పాటు శరీరం తూలిపోకుండానూ కాపాడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని చెబుతున్నారు.
  • కండరాల బలం పెరగటానికి బరువులను వ్యతిరేక బలాన్ని తట్టుకునే వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల శక్తిని బట్టి బరువులు ఎత్తటం, సాగే బ్యాండ్ల వంటి పరికరాలతో వ్యాయామాలు చేయడం మేలంటున్నారు. ముందు చిన్న బరువులతో ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ రావాలని సూచిస్తున్నారు. దీంతో తుంటి, మోకాలు, మడమలు, భుజాల కండరాలు బలోపేతమవుతాయని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"బ్రేక్‌ ఫాస్ట్" మానేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

'40ఏళ్ల'లో ఆరోగ్యం సవాల్ - ఈ జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు!