ETV Bharat / health

గోరుచుట్టు వేధిస్తోందా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

- గోరుచుట్టు సమస్య కారణాలు, నివారణోపాయాలు ఇవేనట!

Paronychia
Paronychia (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 16, 2026 at 2:30 PM IST

|

Updated : July 16, 2026 at 4:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Causes of Paronychia And How Can it be Treated : గోటికి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోతాం. మరి, గోరుచుట్టు దాడిచేస్తే.. భరించలేని నొప్పి, సలుపుతో నరకం కనిపిస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే చీము కారటం, జ్వరం రావటం వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గోరుచుట్టు ఎందుకొస్తుంది? ఎలా తగ్గించుకోవాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

గోరుచుట్టు రకాలు : గోరుచుట్టు అంటే చేయి, కాలి గోళ్ల చుట్టూ చర్మంలో తలెత్తే ఇన్​ఫెక్షన్ అని నిపుణులు చెబుతున్నారు​. ఇందులో అక్యూట్ (తక్షణ), క్రానిక్ (దీర్ఘకాల) అని రెండు రకాలు ఉంటాయంటున్నారు. ఆరు వారాల్లోపు నయమయ్యేది అక్యూట్​, అంతకు మించి వేధించేది క్రానిక్ సమస్య అని clevelandclinic పేర్కొంది.

అక్యూట్ : అక్యూట్ సమస్యకు స్టాఫిలోకాకస్ ఆరియస్, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా, హెర్పిస్ వైరస్, క్యాండిడా అల్బికాన్స్ ఈస్ట్ కారణమవుతాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. GSS సందీప్ చెబుతున్నారు. ఇది ఉన్నట్టుండి మొదలవుతుందని అంటున్నారు. ఒక గోరుకే పరిమితమవుతుందట. గోళ్లు కొరకటం, గోళ్ల చివర్ల పగుళ్లు, వేళ్లు నోట్లో పెట్టుకోవటం, చర్మం పొడిబారటం, గోళ్ల చుట్టూరా చర్మాన్ని పీకే అలవాటు, గోళ్లు మరీ మొదలుకు కత్తిరించటం వంటివి సూక్ష్మజీవులు చర్మం లోపలికి వెళ్లటానికి దారితీస్తుంటాయని తెలియజేస్తున్నారు.

క్రానిక్ : ఈ సమస్యకు క్యాండిడా వంటి ఫంగల్ ఇన్​ఫెక్షన్లు దారితీస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది నెమ్మదిగా తలెత్తుతుందని అంటున్నారు. గృహిణులు, రైతులు, పనివాళ్లు, తడి, చలి వాతావరణాల్లో పనిచేసే మత్య్సకారుల వంటి వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుందని వివరిస్తున్నారు. ఇందులో ఇన్​ఫెక్షన్ లేకుండా గోటి చుట్టూ పసుపు రంగులోకి మారుతుందని తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అన్ని గోళ్లకు దురద కూడా రావొచ్చని చెబుతున్నారు. ప్రమాద కారకాలలో వృత్తి (గిన్నెలు కడిగే వారు, బార్టెండర్, గృహ సహాయకులు), కొన్ని మందులు, రోగనిరోధక శక్తి తగ్గడం (మధుమేహం,హెచ్‌ఐవి,క్యాన్సర్) వంటివి ఉన్నాయని National Library of Medicine పేర్కొంది.

'బ్రెయిన్ ట్యూమర్' ప్రాణాంతకమేనా? - లక్షణాలు ఎలా ఉంటాయంటే!

మామూలుదే కానీ : అక్యూట్ గోరుచుట్టు చాలా వరకూ తేలికగానే తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. కానీ, బ్యాక్టీరియా చర్మం లోపలికి చేరుకుంటే సెల్యులైటిస్, టెండనైటిస్​కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. దీంతో తీవ్రమైన నొప్పి, జ్వరం వేధిస్తాయని తెలియజేస్తున్నారు. దీర్ఘకాల గోరుచుట్టు గోటి ఆకారాన్ని దెబ్బతీయెచ్చని పేర్కొంటున్నారు.

నిర్ధారణ : గోళ్లను చూడగానే గోరుచుట్టూను నిర్ధారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే చీము కల్చర్​తో బ్యాక్టీరియా, చర్మ కణాలను తీసి వైరల్, గోరును గీరి ఫంగల్ పరీక్షలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

గోరుచుట్టు వచ్చినప్పుడు వేలికి నిమ్మకాయ తొడగితే తగ్గిపోతుందనేది అపోహ. బ్యాండేజీ లేని రోజుల్లో ఇది అలవాటై ఉండొచ్చు. నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం వల్ల మరింత మంట, చికాకు కలుగజేస్తుంది. దీని కన్నా యాంటీసెప్టిల్ క్రీమ్​లు రాసుకున్నాక, వదులుగా బ్యాండేజీ చుట్టుకుంటే మంచిది- డా.GSS సందీప్, డెర్మటాలజిస్ట్

ఇంటి చిట్కాలు :

  • రోజు మూడు సార్లు ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో 10-15 నిమిషాల సేపు వేలిని ముంచి, తీయాలంటున్నారు నిపుణులు. లేకపోతే, తువ్వాలును అద్దతూ, తుడుచుకోవాలట.
  • చర్మం పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
  • రోజుకు 2 సార్లు యాంటీ సెప్టిక్ క్రీమ్​లు రాసుకోవాలట
  • గోళ్లను కొరకటం, గోటి చుట్టూ చర్మాన్ని పీకటం లాంటివి చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
  • రసాయనాలు, సబ్బులతో పని చేస్తున్నప్పుడు చేతులకు గ్లౌజులు ధరించాలని సలహా ఇస్తున్నారు.
  • రోజుకు రెండు సార్లు మాయిశ్చరైజర్​ రాసుకోవాలని అంటున్నారు.

చికిత్స ఇలా : బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్ అయినట్టయితే యాంటీ బయాటిక్ మందులు, క్రీములు రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైరల్​ ఇన్ఫెక్షన్​కు యాంటీ వైరల్ మందులు అవసరమవుతాయని అంటున్నారు. ఫంగల్ ఇన్​ఫెక్షన్ నిర్ధారణ అయితే యాంటీ ఫంగల్ మందులను దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. డాక్టర్​ సలహా మేరకు చర్మాన్ని పొడిబారకుండా చూసుకుంటూ, స్టిరాయిడ్ పూత మందులు వాడుకుంటుంటే దీర్ఘకాల గోరుచుట్టు తగ్గుతుందని సూచిస్తున్నారు.

డాక్టర్​ దగ్గరికి ఎప్పుడు? :

  • తీవ్రమైన నొప్పి, జ్వరం ఉన్నప్పుడు
  • అప్పటికే డయాబెటిస్, థైరాయిడ్ జబ్బులున్నప్పుడు, గర్భం ధరించినప్పుడు
  • ఇంటి చిట్కాలతో రెండు రోజులైనా ఉపశమనం కలగనప్పుడు

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బీపీకే కాదు, షుగర్‌ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

"అలర్ట్" శరీరం పంపే సంకేతాలను మీరు గుర్తిస్తున్నారా? - నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు!

Last Updated : July 16, 2026 at 4:51 PM IST