జర్నీ చేస్తే వాంతులు, తల తిరుగుతోందా? - ఈ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు
- వాహన ప్రయాణంలో వాంతుల సమస్యతో ఇబ్బందిపడేవారు ఎందరో! - ఇలా సెట్ చేసుకోవచ్చని సూచన

Published : December 13, 2025 at 12:12 PM IST
|Updated : December 13, 2025 at 12:32 PM IST
Best Remedy for Motion Sickness : కారులో లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఎగుడుదిగుడు, ఘాట్ల రోడ్లలోనైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. దీంతో కొందరు ప్రయాణాలే మానుకుంటే, మరికొందరు తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాన్ని వెదుక్కుంటారు.
మరి, ఈ పరిస్థితికి కారణమేంటి? అంటే.. ప్రయాణ సమయంలో కొందరికి చెవి లోపల ఉండే లాబ్రింథైస్, యూట్రికెల్ భాగాలు మెదడుకు సంకేతాలు సరిగా అందించకపోవడమేనట! వైద్య పరిభాషలో దీన్ని మోషన్ సిక్‌నెస్‌గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వెనక సీట్లో వద్దు : పరిశీలనగా చూస్తే 90 శాతం మంది వెనక సీట్లో కూర్చున్న వారే వాంతులు చేసుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ముందు సీట్లో కూర్చోవాలంటున్నారు నిపుణులు. వెనక సీట్లో కూర్చోవడం వల్ల వాహన వేగం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఇది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంటున్నారు. ముందు సీట్లో కూర్చోవడం ప్రభావవంతంగా ఉంటుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
ఫోన్ చూడొద్దు : కాస్త సమయం దొరికినా సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతుంటారు. మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్లు ప్రయాణంలో ఫోన్‌కు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే, వాహనం కదులుతూ ఉంటే మెదడుకు అందే సంకేతాలు తికమక కలిగిస్తాయని చెబుతున్నారు.
నడకతో అల్జీమర్స్‌కు చెక్ పెట్టొచ్చా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
గాలి ధారాళంగా : కారులో స్వచ్ఛమైన గాలి లేకపోయినా వాంతులవుతుంటాయి. ప్రయాణంలో కాస్త ఇబ్బందిగా ఉంటే, కారు కిటికీ తెరిచి, బయట కాస్త స్వచ్ఛమైన గాలికి సేదతీరాలంటున్నారు నిపుణులు. గాఢమైన పెర్ఫ్యూమ్, మసాలా వాసనలు లేకుండా చూడాలని చెబుతున్నారు. ప్రయాణం మధ్యలో విరామం తీసుకోవాలని పేర్కొంటున్నారు. కిందికి దిగి కాసేపు నడవాలంటున్నారు. అలాగే, తాజా గాలి పీల్చుకోవాలని సూచిస్తున్నారు.
తేలికపాటి ఆహారం : ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో భారీ భోజనం చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అదేవిధంగా కారంగా ఉండే ఆహారాలు తినవద్దని nhs అధ్యయనం పేర్కొంది. అదే సమయంలో ఆహారం తీసుకోకుండా ఉంటే వికారం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే తేలికపాటి పోషకాహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
నీరు తాగారా? : డీహైడ్రేషన్ వల్ల కూడా వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో నీరు, ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలని CDC అధ్యయనం పేర్కొంది. అలాగే, ప్రయాణం చేసేటప్పుడు ఆల్కహాల్, కెఫిన్ కలిగిన పానీయాలను పరిమితం చేసుకోవాలని తెలిపింది.
చిన్ని చిన్ని చిట్కాలు : ప్రయాణ సమయంలో నిమ్మకాయ దగ్గర పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. వికారం అనిపించినప్పుడు వాసన చూస్తే తాజా అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.
- తులసి ఆకులను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు. నిమ్మ, పుదీనా రసాన్ని ఒక సీసాలో నింపి.. నల్ల ఉప్పును వేసుకుని ప్రయాణంలో అప్పుడప్పుడూ తాగుతుండాలని సూచిస్తున్నారు.
- గ్లాసు నీళ్లలో కొద్దిగా జీలకర్ర పొడి కలిపి ప్రయాణానికి ముందు తాగడం లేదా అల్లం టీ తాగినా కాస్త ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
- అల్లం టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుందని clevelandclinic అధ్యయనం పేర్కొంది.
- పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా పుదీనా ఆకుల వాసన పీల్చడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు
తరచూ ప్రయాణాలు చేసేవారు పరగడుపున రెండు లేదా మూడు గ్రాముల శొంఠి పొడి తీసుకోవాలి. లేకుంటే జీలకర్ర, లవంగాలు, మిరియాలు, ఉసిరి సమాన భాగాలుగా తీసుకొని, పొడిచేసి తేనెతో కలిపి తీసుకోవాలి- మాధవీ కల్యాణి, భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యురాలు
బ్యాండ్లూ ఉన్నాయి : కారులో దూర ప్రయాణాలకు వెళ్లేవారికి మోషన్ సిక్నెస్ బ్యాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని బటన్‌ను నొక్కితే నాడీభాగంలో ఒత్తిడి ఏర్పడి వికారం, తలనొప్పి తగ్గుతాయంటున్నారు. ఈ బ్యాండ్లను చేతికి ఎంత సేపు పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యమూ లేకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో అవోమైన్, డ్రామామైన్ వంటి ఔషధాలతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఇవి వాడేందుకు డాక్టర్ల సూచన తప్పనిసరంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా? - ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు!
ఇంట్లోనే బీపీ, షుగర్ చెక్ చేసుకుంటున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించాలట!

