పిల్లల్లోనూ హైబీపీకి అవకాశాలెన్నో! - ఇలా గుర్తించే వీలుందంటున్న నిపుణులు!
పిల్లల్లో బీపీ రావడానికి కారణాలేమిటి? - ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా!

Published : November 17, 2025 at 4:38 PM IST
High Blood Pressure in Children : హైబీపీ (అధిక రక్తపోటు) అనగానే వయస్సు మళ్లిన వారే ఎక్కువగా గుర్తొస్తుంటారు. కానీ, పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ లక్షణాలు ఉంటాయి. కొందరికి వంశ పారంపర్యంగా, మరికొందరికి ఇతరత్రా జబ్బులతో ఇది రావొచ్చంటున్నారు నిపుణులు. కారణమేదైనా పిల్లల్లో బీపీని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని చెబుతున్నారు. అయితే, బీపీ ఉన్న పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, కారణాల గురించి తెలుసుకుందాం!
పిల్లల బీపీని తరచూ పరీక్షించటం, చిన్నప్పటి నుంచే గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే అలవాట్లను నేర్పించటమూ ముఖ్యమేనని తాజా అధ్యయనం సూచిస్తోంది. ఏడేళ్ల వయస్సులో అధిక రక్తపోటు ఉన్న పిల్లలు 50 ఏళ్ల మధ్యలో హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని American Heart Association అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో 1959 నుంచి 1966 మధ్యలో పుట్టిన 38 వేల మందిని ఆరు దశాబ్దాలుగా పరిశీలిస్తూ వచ్చారు. వీరిలో 2016 నాటికి 2837 మంది మరణించగా, 504 మంది చనిపోవటానికి గుండెజబ్బులే కారణమని వెల్లడైంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పిల్లల జీవనశైలి గణనీయంగా మారిన నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
డిప్రెషన్ మందులు వాడుతూ మద్యం సేవిస్తున్నారా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

పిల్లల్లో అధిక రక్తపోటుకు కారణాలు :
జబ్బులతో సంబంధం లేనిది (ప్రైమరీ హైపర్ టెన్షన్) : ఇది చాలావరకు ఆరేళ్లు పైబడ్డవారిలోనే కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, ఉప్పు ఎక్కువగా తినటం, శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం, కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉండటం, జన్యు సమస్యలు వంటివన్నీ దీనికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.
జబ్బులతో ముడిపడింది (సెకండరీ హైపర్‌టెన్షన్) : ఇది ఆరేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకు కిడ్నీ, రక్తనాళ జబ్బులు అనేవి ఎక్కువగా దోహదం చేస్తాయని చెబుతున్నారు. మెదడు మూలం వద్ద రక్తనాళాల్లో అడ్డంకి, రక్తనాళాలు గోడలు మందంగా, గట్టిగా అవటం (ఆర్టీరియోస్క్లిరోసిస్), గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చే బృహద్ధమని, దాని శాఖల్లో వాపు ప్రక్రియ తలెత్తటం (టకయాస్ డిసీజ్), మూత్ర ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో తిత్తులు, వడపోత ప్రక్రియకు తోడ్పడే భాగాలు దెబ్బతినటం, కిడ్నీలకు రక్తన్నీ సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడటం (రీనల్ ఆర్టరీ స్టెనోసిస్) వంటివి హైబీపీకి దారితీస్తాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా, కిడ్నీల మీదుండే అడ్రినల్ గ్రంథి వద్ద ఏర్పడే కణితులతోనూ (ఫియోక్రోమోసైటోమా) బీపీ పెరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే, పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, ముఖ్యంగా బృహద్ధమని సంకోచించటమూ (కోఆర్క్టేషన్ ఆఫ్ అయోర్టా) హైబీపీకి దారితీస్తుందని వెల్లడిస్తున్నారు. ఈ సమస్యలు చిన్నప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టవని కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ ఎక్కువవుతూ వస్తుందని అంటున్నారు. దీంతో వ్యాయామాలు, కష్టమైన పనులు చేసేటప్పుడు తలకు, చేతులకు రక్తపోటు బాగా పెరిగిపోతుందని చెబుతున్నారు.

నిర్ధారణ ఎలా : పిల్లల్లో హైబీపీని కచ్చితంగా నిర్ధారించడం చాలా ముఖ్యం. దీంతో అనవసరంగా మందులు ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఒకసారి పరీక్ష చేస్తే చాలదని, కనీసం రెండు సార్లయినా పరీక్షించాలని అంటున్నారు. రెండు సార్లూ బీపీ ఎక్కువుంటేనే అధిక రక్తపోటు ఉందని అనుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా వేర్వేరు రోజుల్లో కనీసం మూడు సార్లు పరీక్ష చేసి సమస్యను నిర్ధారించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. అవసరమైతే ఆంబులేటరీ పరికరంతోనూ రోజంతా బీపీని పరిశీలించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
లక్షణాలు : పిల్లల్లో అధిక రక్తపోటు ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే, తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం లాంటి సంకేతాలతో గుర్తించవచ్చని mayoclinic అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో వీలున్నప్పడల్లా పిల్లలకు రక్తపోటు పరీక్ష చేయించటం మంచిదంటున్నారు నిపుణులు. ఆటల పోటీలకు వెళ్లే ముందు ఒకసారి రక్తపోటును పరీక్షించటం మేలని చెబుతున్నారు. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లినా, జలుబు, దగ్గు వంటి వాటి కోసం వెళ్లినప్పుడైనా, కనీసం ఏడాదికి ఒకసారైనా బీపీ పరీక్ష చేయటం మేలని సూచిస్తున్నారు.

ఎన్నెన్నో దుష్ప్రభావాలు : దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం కావొచ్చంటున్నారు నిపుణులు. ఇది గుండె వైఫల్యానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చని చెబుతున్నారు. కంట్లోని రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉందని పేర్కొంటున్నారు. మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతింటే తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
జీవనశైలి మార్పులు : పిల్లల్లో హైబీపీ చికిత్సలో మందుల కన్నా జీవనశైలి మార్పులకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు నిపుణులు. తాజా కూరగాయలు, పండ్లు, పీచుతో కూడిన ఇతర పదార్థాలు ఎక్కువగా తినటం, చక్కెరతో చేసే పానీయాలు, సంతృప్త కొవ్వు పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, రోజూ కనీసం అరగంట పాటు పరిగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం వంటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. వీటి విషయంలో తల్లిదండ్రుల బాధ్యతే కీలకమంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
చలికాలంలో తీవ్ర ఒళ్లు నొప్పులా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

