రోజుకు ఎంత 'వంట నూనె' వాడాలో తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!
- వంట నూనెను అధికంగా వినియోగిస్తున్న ప్రజలు - తగ్గించకపోతే ప్రమాదం తప్పదట!

Published : April 10, 2026 at 3:17 PM IST
Cooking Oil Consumption : మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువే. బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని లంచ్, స్నాక్స్, డిన్నర్లో చేసుకునే పదార్థాలకు వంటనూనెను తప్పనిసరిగా వినియోగిస్తున్నాం. అంతేకాదు, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ, అతిగా నూనె వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజుకు ఎంత నూనె వాడాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం!
ఎంత నూనె వాడాలి : మారిన జీవనశైలి కారణంగా ఇంట్లో నూనె వాడకం విపరీతంగా పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఒక్కో మనిషి ఏడాదికి సగటున 23.5 లీటర్ల వంటనూనె వాడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. Indian Council of Medical Research(ICMR) సిఫార్సుల ప్రకారం మనిషికి రోజుకు 20 మిల్లీ లీటర్లు.. అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు గరిష్ఠంగా 4 లీటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. కనిష్ఠంగా 2.5 లీటర్లకు తగ్గకూడదు.
వంటల్లో నూనె వాడకపోవటం సాధ్యం కాదు. చేపలు, కొవ్వులో కరిగే ఎ,డి, ఈ, కె వంటి విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికి నూనె అవసరం. శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని నూనె అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వంటల్లో నూనె ఎక్కువగా వాడితే రక్తనాళాలల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముందని అంటున్నారు. ఒబెసిటీ, అధిక రక్తపోటు, గుండెజబ్బులకూ దారితీస్తుందట. అందుకే ఆచితూచి లెక్క కట్టి వాడాలి. రోజువారీ వంట నూనె తీసుకోవడం అనేది హృదయ సంబంధ వ్యాధులు (CVD), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుందని National Library of medicine పేర్కొంది.
పదే పదే మరిగిస్తే : ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదంటున్నారు నిపుణులు. పొంగుతున్న, రంగు మారిన నూనెను అస్సలు ఉపయోగించవద్దని చెబుతున్నారు. రోడ్డుపక్క బండ్ల వద్ద, హోటల్స్‌లో వాడిన ఆయిల్‌నే మళ్లీ ఉపయోగించడం వల్ల నల్లగా, జిగురుగా తయారవుతుందని పేర్కొంటున్నారు. ఇలాంటి నూనెతో తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.
ఒకసారి బాగా వేడిచేసిన నూనెను తర్వాత మళ్లీ వాడుకోవచ్చు. ఆ నూనెను మామూలుగా కూరల్లో వినియోగించడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, రెండు నుంచి మూడు సార్లు డీప్ ఫ్రై చేసిన నూనె చిక్కగా తయారవుతుంది. అప్పుడు ఆ నూనె ఎందుకూ పనికిరాదు. ఇలా వాడిన నూనె వాడడం వల్ల క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. - డా. అంజలీ దేవి, పోషకాహార నిపుణులు
కాలేయం దెబ్బతింటే అంతే సంగతులు - ఇలా హెల్దీగా ఉంచుకోవాలంటున్న నిపుణులు
ఏ నూనె మేలు :
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ : గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే(కోల్డ్ ప్రెస్డ్) నూనెకు ఎలాంటి రసాయనాలనూ కలపరని నిపుణులు చెబుతున్నారు. వేడి కూడా చేయరట. సహజ రుచి అలాగే ఉండటంతో పాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయంటున్నారు.
రిఫైన్డ్ ఆయిల్ : గింజలను వేడి చేసి, తయారు చేసేవి రిఫైన్డ్ నూనెలు. సృష్టంగా, ఆకర్షణీయంగా కనిపించటానికి నిల్వ ఉండటానికి రసాయనం కలుపుతారని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయని అంటున్నారు. ఈ క్రమంలో రిఫైన్ చేసేటప్పుడు ప్రమాదకర రసాయనాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు. ఎలాగంటే, ఫంగస్‌తో కలుషితమైన వేరుశనగ గింజల్లో అఫ్లటాక్సిన్ అనే విష పదార్థం ఉండొచ్చని, ఇది తొలగిపోతుందని పేర్కొంటున్నారు.
ఒకదాంట్లో మరో రకం నూనె కలిపి వాడటం మంచిదంటున్నారు నిపుణులు. వేరుశనగ నూనె, కొబ్బరినూనె, ఆవనూనె ఆరోగ్యానికి మేలట. ఇవి నెల నెలా మార్చి వాడుకోవడం లేదా ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. లేకుంటే, కొంత కోల్డ్ ప్రెస్డ్ నూనెకు నువ్వులు, వేరుశనగ, ఆవ నూనె వంటివి కలిపి వాడుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రిఫైన్డ్ ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వినియోగించడం మంచిదని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతే కాకుండా నూనె ఎంత వాడాం అనేదాని కంటే నాణ్యత కూడా ముఖ్యమట.
American Heart Association ప్రకారం, ఆరోగ్యకరమైన నూనెలతో వంట చేయడానికి చిట్కాలు :
- కనోలా నూనె, ఆలివ్ నూనె, వేరుశనగ నూనె, సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్స్ సాధారణంగా సురక్షితమైనవి.
- నూనె నుంచి పొగ రావడం మొదలైనా లేదా మంటలు అంటుకున్నా, దానిని ఉపయోగించవద్దు. నూనె దాని స్మోక్ పాయింట్‌కు చేరుకున్న తర్వాత క్షీణించడం మొదలవుతుంది.
- నూనె దుర్వాసన వస్తే, దాన్ని వాడకుండా పారేయండి. నూనెను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే, అది ఆక్సీకరణం చెందవచ్చు లేదా పాడైపోవచ్చు.
- నూనెను తరచుగా ఉపయోగించకపోతే, చిన్న డబ్బాలలో కొనండి. ఇలా చేయడం వల్ల, గడువు ముగియక ముందే మీరు దానిని ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- నూనెను చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
శరీరాన్ని గుల్ల చేసే "సార్కోపీనియా" - ఏ వయస్సు వారిలో వస్తుందో తెలుసా?
"ఎముకలు బలహీనమవుతున్నాయా?" - తినే ఆహారం కూడా ప్రభావితం చేస్తుందని తెలుసా?

