రొమ్ము క్యాన్సర్ ముప్పు - ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయట!
రొమ్ము క్యాన్సర్ ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ? - ప్రాణాంతక వ్యాధి ముందస్తు లక్షణాలివే!

Published : July 17, 2026 at 1:52 PM IST
|Updated : July 17, 2026 at 2:43 PM IST
What are the Reasons for Breast Cancer : ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎంతో మంది ఈ సమస్యతో మరణిస్తున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్ రావడానికి చాలా కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని ముందుగా గుర్తించి.. అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయిన బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి? లక్షణాలు? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ఎవరికి వస్తుందంటే? :
నిద్రలేకపోతే : ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం, నెలల తరబడి నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్‌కి దారితీస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మన శరీరం సహజంగా పాటించే జీవ గడియారాన్ని అనుసరించకుండా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మొత్తం శరీర వ్యవస్థ దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ కంతులు రావడానికీ, అవి వేగంగా పెరగడానికి దోహదపడే పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. శరీరంలో తక్కిన అవయవాలతో పోలిస్తే రొమ్ముల్లోని పాలను ఉత్పత్తి చేసే కణాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పని చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 2.34 రెట్లు పెరుగుతుంది, అధిక తీవ్రతతో కూడిన రాత్రి పని చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 2.66 రెట్లు పెరుగుతుంది అని MDPI పేర్కొంది.
అధిక బరువు : అధిక బరువు కేవలం శరీర పరిమాణాన్ని మాత్రమే కాకుండా, లోపల హార్మోన్లు, కణాల పనితీరును పూర్తిగా మార్చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
మద్యం సేవించడం: అధికంగా మద్యం తాగే మహిళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని medlineplus పేర్కొంది. ఆల్కహాల్ తాగని వారితో పోల్చితే మద్యం తాగిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే, ధూమపానం చేయడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం : తగినంత శారీరక శ్రమ లేకపోవడం, నిశ్చల జీవనశైలి వల్ల కూడా మహిళ్లలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒకే చోట ఎక్కువగా స్తబ్దుగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
బీపీకే కాదు, షుగర్ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!
హార్మోన్ థెరపీలు : చాలామంది మహిళలు మెనోపాజ్ సమయంలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకుంటారు. అయితే, వీటిని అనుసరించడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. పెరుగుతున్న వయస్సు, ఊబకాయం, మద్యపానం, పొగాకు వాడకం, రుతువిరతి తర్వాత తీసుకునే హార్మోన్ థెరపీ వంటి కొన్ని కారకాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని WHO పేర్కొంది.
తల్లి పాలు ఇవ్వకపోవడం : తల్లిపాలు ఇవ్వకపోవడం కూడా రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. పిల్లలు లేని మహిళలు, తల్లి పాలు ఎక్కువగా ఇవ్వని వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. పిల్లలకు పాలు ఇచ్చిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.
గర్భ నిరోధక మాత్రల వినియోగం : కొంత మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడుతుంటారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ మందులు హార్మోన్లను ప్రభావితం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు.
mayoclinic ప్రకారం, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు :
- రొమ్ముల్లో గడ్డలు ఏర్పడడం
- రొమ్ముపై చర్మం పొట్టులా ఊడిపోవడం, పొలుసులుగా మారడం, గట్టిపడటం లేదా పొరలుగా రావడం
- రొమ్ము పరిమాణం, ఆకారం లేదా స్వరూపంలో మార్పు
- రొమ్ము చర్మం రంగులో మార్పులు
medlineplus ప్రకారం, రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చా? : ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు
- ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం
- మద్యపాన వినియోగాన్ని పరిమితం చేయడం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
- పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం
- హార్మోన్ థెరపీని పరిమితం చేయడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గోరుచుట్టు వేధిస్తోందా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

