ETV Bharat / health

రోజంతా ఏసీలోనే పనిచేస్తున్నారా? - మీలో ఈ సమస్యలు గమనించారా?

ఏసీ చల్లదనంతోనూ సమస్యల తాకిడి - ముక్కు, గొంతు సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు

Air Conditioning
Air Conditioning (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : May 26, 2026 at 3:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Air Conditioning Cause Health Problems : బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఏసీ గదిలో కూర్చుంటే చల్లగా, హాయిగా అనిపిస్తుంది. కానీ, సుదీర్ఘ కాలం ఏసీ చల్లదనంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ముక్కు మూసుకుపోవటం, గొంతు ఎండిపోవటం, చెవులు సరిగ్గా వినిపించకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చల్లటి ఏసీ గదిలో గంటల తరబడి గడపటం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం!

ముక్కులో : వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా ఫ్యాన్లు, కూలర్లు లేదా ఏసీలు వినియోగిస్తున్నారు. వీటిలో ఏసీ నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. అయితే, గంటల తరబడి ఏసీ గదుల్లో గడపడం వల్ల శరీరానికి చల్లదనంతో పాటు చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఏసీ వాతావరణం మూలంగా ముక్కు ఎండిపోతుంటుంది. నిజానికి, మన ముక్కు కేవలం గాలి పీల్చే ద్వారం మాత్రమే కాదు. అది శరీరానికి సహజమైన ఎయిర్​ ఫిల్టర్ కూడా. ముక్కులో ఉండే చిన్న చిన్న రోమాలు మ్యూకస్ పొర ఇవన్నీ బయట నుంచి వచ్చే దుమ్ము, వైరస్, బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. కానీ, ఏసీ గదుల్లో గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడి గాలి మూలంగా ముక్కులోని మ్యూకస్ పొర ఎండిపోతుందట. దీంతో ముక్కులోని రక్షణ కవచం బలహీనపడుతుంది. ఫలితంగా, తరుచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, గొంతులో గరగర ఇలా ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

మీ మెదడును నడిపించండి! - రోజులు ఎన్నివేల అడుగులు ముఖ్యమో తెలుసా?

బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మనం ఇంట్లో లేదా ఆఫీస్​లో కంటిన్యూస్​గా ఏసీ, ఎయిర్ కూలర్స్ లేదా ఫ్యాన్లు వాడాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంతో ముక్కు, గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా, ఏసీ నుంచి వచ్చే పొడి గాలి వలన ముక్కు, గొంతులో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూడా ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది. గొంతు వాపు, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా వస్తాయి - డా. సి ఆంజనేయులు, ENT సర్జన్

చెవిలో ఒత్తిడి : గంటల తరబడి ఏసీ గదిలో గడపడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలే కాదు. చెవులకు కూడా ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన చెవి, ముక్కు, గొంతు ఈ మూడు భాగాలు లోపల పరస్పరం అనుసంధానమై ఉంటాయని చెబుతున్నారు. ముక్కు బిగుసుకుపోయి లోపల ఒత్తిడి పెరిగితే యూస్టేషియన్ ట్యూబ్ అనే ఒక చిన్న మార్గం బ్లాక్ అవుతుందట. దీంతో చెవిలో ఒత్తిడి పెరిగి, లోపల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చెవి అంతా మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది.ఈ క్రమంలో ఏసీ గదిలో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పిల్లలు, సైనసైటిస్​తో బాధపడే వారు, అలర్జీ బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారని పేర్కొంటున్నారు.

అలర్జీ సమస్యలు : ఏసీని సరిగ్గా శుభ్రం చేయకపోతే, అందులోకి బ్యాక్టీరియా, ఫంగస్, దుమ్ము, ధూళి చేరుతాయి. దీని ఫిల్టర్లలో పేరుకుపోయే ధూళి, తేమ మూలంగా సూక్ష్మజీవులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ గాలిని మనం రోజంతా పీల్చుకుంటూ ఉంటే అలర్జీలు, గొంతు ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సరిగ్గా శుభ్రం చేయని ఏసీ మూలంగా గది లోపల గాలి నాణ్యత బాగా తగ్గుతుందని, శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి, ఏసీని వాడుతున్నప్పుడు అందులోని ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలట. ముఖ్యంగా, ఆఫీసులు, మాల్స్ మూసి ఉండే గదుల్లో పనిచేసేవారు తరచూ తాజా గాలి ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :

  • మన ఫేస్​కి లేదా మన బాడీకి డైరెక్ట్​గా ఏసీ/ ఎయిర్​ కూలర్ గాలి తగాలకుండా చూసుకోవాలి.
  • మన గదిలో హ్యూమిడిఫైర్​ని పెట్టుకోవడం కూడా మంచిది.
  • ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి.
  • ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది
  • రోజుకు కొద్దిసేపు అయినా బయటి వాతావరణంలో సహజమైన గాలిలో గడపాలి.
  • నీళ్లు తరచూ తాగుతుండాలి.
  • గదిలో తగినంతగా తేమ ఉండేందుకు ఇండోర్ ప్లాంట్స్​ని పెంచుకోవాలి.
  • ముక్కు, గొంతు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంటే ఆవిరి పట్టుకోవడం, నాసల్ స్ప్రేలు వాడుకోవడం మంచిది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆయుర్వేద రారాజు అశ్వగంధ - వీళ్లు మాత్రం దూరంగా ఉండాలట!

కొత్త వైరస్​లను ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా లేదు - హెచ్చరిస్తున్న GPMB రిపోర్టు!