ETV Bharat / health

స్త్రీ, పురుషుల్లో మధుమేహం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?

- మహిళల్లో మధుమేహం - ఈ సమస్యలకూ కారణమవుతుందా?

Diabetes Mellitus
Diabetes Mellitus (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 24, 2026 at 9:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gender Difference in Diabetes Mellitus : మహిళలు, పురుషులు, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్య మధుమేహం. ఇందుకు మన జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా ఈ సమస్య బారిన పడినప్పటికీ, దీనివల్ల తదనంతర సమస్యలు, అనారోగ్యాలు మహిళల్లోనూ ఎక్కువే అని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే అనారోగ్యాలకు కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

డయాబెటిస్ పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు పురుషుల కంటే మహిళల్లో తీవ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల కంటే పురుషులే 17.7 మిలియన్లు ఎక్కువగా డయాబెటిస్ మెల్లిటస్‌తో బాధపడుతున్నారు అని National Library of Medicine పేర్కొంది. పురుషుల కంటే స్త్రీలు పునరుత్పత్తి సంబంధిత కారణాల వల్ల ఎక్కువ హార్మోన్ల హెచ్చుతగ్గులు, శరీర మార్పులను అనుభవిస్తారట. గర్భధారణ సమయంలో ముందుగా ఉన్న జీవక్రియ సంబంధిత అసాధారణతలు బయటపడవచ్చు, దీని ఫలితంగా గర్భధారణ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) నిర్ధారణ అవుతుందని తెలిపింది. ఇది స్త్రీలలో టైప్ 2 డయాబెటిస్‌గా మారడానికి అత్యంత ప్రముఖ ప్రమాద కారకంగా కనిపిస్తోందని పేర్కొంది.

Diabetes Facts
Diabetes Facts (ETV Bharat)

ఇవి మహిళల్లోనే ఎక్కువ : డయాబెటిస్ కారణంగా గుండె సమస్యల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలామంది గుండె పోటు, సంబంధిత సమస్యల నుంచి బయటపడడమూ కష్టంగా మారుతుందట. అంతేకాదు, డయాబెటిస్ కారణంగా నెలసరి సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్ వంటి వాటి ముప్పు మహిళల్లోనే ఎక్కువగానే ఉంటుందంటున్నారు. గుండెపోటు వచ్చే ముప్పు డయాబెటిస్ ఉన్న పురుషులలో 50శాతం అధికంగా ఉంటే, స్త్రీలలో అది 150శాతం ఉంటుందని rssdi పేర్కొంది.

Health Issues in Women with Diabetes
Health Issues in Women with Diabetes (ETV Bharat)

ఇన్ఫెక్షన్ల ముప్పు : వందలో 50 మంది మహిళలు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి వెజైనా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, డయాబెటిస్ ఉన్నవారిలోనే ఈ రెండు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, మూత్రాశయంలో మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వెజైనా దగ్గర ఈస్ట్​ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదమూ ఎక్కువేనట. కాబట్టి, ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, ముందు నుంచే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాలి.

Complications in Pregnant Women with Diabetes
Complications in Pregnant Women with Diabetes (ETV Bharat)

కోరిక తగ్గిపోతుందా : డయాబెటిస్ కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, హార్మోన్లలో మార్పులు, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఇవి లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో లైంగిక వాంఛలు, శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం, వెజైనా పొడిబారిపోయి కలయికలో అసౌకర్యం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చంటున్నారు. కాబట్టి, లైంగిక కోరికలు తగ్గితే డయాబెటిస్​ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

సంతానలేమి సమస్య : రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే గర్భధారణ కష్టమేనంటున్నారు నిపుణులు. మధుమేహ బాధిత మహిళలు గర్భం దాల్చినా తొలి నెలల్లోనే గర్భస్రావం, పుట్టే పిల్లల్లో లోపాలు, ప్రి మెచ్యూర్ డెలివరీ, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటాయని National Library of Medicine పేర్కొంది. కాబట్టి, ఇలాంటి వారు ముందుగా డాక్టర్ల సలహా మేరకు డయాబెటిస్​ను అదుపులో పెట్టుకోవడం ముఖ్యం.

Diabetic Women During Menopause
Diabetic Women During Menopause (ETV Bharat)

మెనోపాజ్​లో ఇలా : మెనోపాజ్​లో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో సమస్యలు మహిళల్ని వేధిస్తుంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం, శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పడిపోయి, రక్తంలో చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా మెనోపాజ్ సమస్యల తీవ్రత పెరగడంతోపాటు వెజైనా పొడిబారిపోవడం, నరాలు బలహీనపడడం వంటి సమస్యలూ తీవ్రం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ప్రశాంతమైన నిద్ర కావాలా? - ఈ అపోహలు వీడాలంటున్న నిపుణులు!

ఉదయాన్నే కీళ్లు పట్టేసినట్లు అనిపిస్తుందా? - "యూరిక్ యాసిడ్" సమస్య కావొచ్చట!